Makeup Kit: ఇవి ఉంటే చాలు!

మేకప్.. ఇష్టమనో లేదంటే వృత్తిపరంగానో మేకప్‌తో తమ అందానికి మెరుగులు దిద్దుకునేవారే ఎక్కువమంది! అయితే మేకప్‌ అంటే కిట్‌లో అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు ఉండాలా? ఖర్చుకు వెనకాడకుండా ప్రతిదీ కొనేయాలా? అంటే అవసరం లేదంటున్నారు....

Published : 06 Nov 2022 13:24 IST

మేకప్.. ఇష్టమనో లేదంటే వృత్తిపరంగానో మేకప్‌తో తమ అందానికి మెరుగులు దిద్దుకునేవారే ఎక్కువమంది! అయితే మేకప్‌ అంటే కిట్‌లో అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులు ఉండాలా? ఖర్చుకు వెనకాడకుండా ప్రతిదీ కొనేయాలా? అంటే అవసరం లేదంటున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని ప్రాథమిక, అత్యవసర మేకప్‌ వస్తువులుంటే సరిపోతుందంటున్నారు. తద్వారా పర్సు ఖాళీ కాకుండా చూసుకోవడంతో పాటు అనవసర మేకప్‌ ఉత్పత్తులతో అందం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ మేకప్‌ కిట్‌లో ఉండాల్సిన కొన్ని వస్తువులేంటో తెలుసుకుందాం రండి..

అందుకే ఇవి ఉండాల్సిందే!

⚛ మేకప్‌ వేసుకునే క్రమంలో ఫౌండేషన్‌ని ఉపయోగించడం మామూలే! అయితే దీనికంటే మెరుగైన ఫలితం మాయిశ్చరైజర్‌ ఇస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇది చర్మానికి తేమనందించడంతో పాటు సహజసిద్ధమైన లుక్‌ని అందిస్తుంది. ఈ క్రమంలో బయట దొరికే మాయిశ్చరైజర్‌ క్రీమ్స్‌ అయినా ఎంచుకోవచ్చు.. లేదంటే ఇంట్లో ఉండే షియా బటర్‌, కొబ్బరి నూనె వంటివి వాడచ్చు. తద్వారా ఖర్చూ కలిసొస్తుంది.

⚛ అలాగే సింపుల్‌ మేకప్‌ లుక్‌ని సొంతం చేసుకోవాలనుకునే వారి మేకప్‌ కిట్‌లో ఓ ప్రైమర్‌, టాల్కం పౌడర్‌ ఉంటే సరిపోతుంది.

⚛ మేకప్‌ వేసుకున్నా వేసుకోకపోయినా కంటికి కాటుక, కనురెప్పలకు మస్కారా పెట్టుకొని మెరిసిపోతారు కొంతమంది. మీరూ అంతేనా? అయితే ఇతర మేకప్‌ ఉత్పత్తులు మీ మేకప్‌ కిట్‌లో ఉన్నా, లేకపోయినా ఈ రెండూ మాత్రం ఉండాల్సిందే!

⚛ మేకప్‌ ఉత్పత్తుల వల్ల కళ కోల్పోయిన చర్మానికి తిరిగి ప్రాణం పోయడంలో నైట్‌ క్రీమ్‌ పాత్ర కీలకం! ఇది పొడిబారిన చర్మానికి తేమనందించడంతో పాటు చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తప్రసరణనూ మెరుగుపరుస్తుంది. తద్వారా చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.

⚛ అలసిన కళ్లకు సాంత్వన చేకూర్చడంలో ఐ క్రీమ్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. ఇవి కంటి చుట్టూ నల్లటి వలయాలు, కళ్ల కింద వాపు, ముడతలు, గీతల్ని తగ్గించి.. కంటి కళ తగ్గకుండా చేస్తాయి. కాబట్టి దీన్ని మీ కిట్‌లో చేర్చుకోవడంతో పాటు ఉదయాన్నే బయటికి వెళ్లే ముందు అప్లై చేసుకోవడం మంచిది.

⚛ కంటి మేకప్‌లో భాగంగా ఐల్యాష్‌ కర్లర్‌, మస్కారా వంటివి ఉపయోగిస్తుంటాం. వాటిలోని రసాయనాల ప్రభావం కనురెప్పలపై పడకుండా ఉండాలంటే ఐల్యాష్‌ కండిషనర్‌ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇవి కనురెప్పలకు తేమను, దృఢత్వాన్ని అందిస్తాయి. దీన్ని ఉదయం, రాత్రి.. అంటే మేకప్‌కు ముందు, మేకప్‌ తొలగించుకున్నాక.. ఇలా రెండుసార్లు అప్లై చేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందచ్చంటున్నారు.

⚛ అమ్మాయిల మేకప్‌ కిట్‌లో ఏది ఉన్నా, లేకపోయినా లిప్‌స్టిక్‌ మాత్రం తప్పకుండా ఉంటుంది. చాలామంది దీన్ని హ్యాండ్‌బ్యాగ్స్‌లో క్యారీ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇది కూడా మరీ పెద్దది కాకుండా చిన్న సైజుల్లో ఉన్నది ఎంచుకోవడం మంచిది. తద్వారా ఎప్పటికప్పుడే తాజాగా మార్చేసుకోవచ్చు. దీంతో పాటు ఓ లిప్‌బామ్‌ కూడా వెంట ఉంచుకోవాలి. ఇది పెదాలకు తేమనందిస్తుంది.

⚛ తక్కువ ధరకు లభిస్తూ.. అమ్మాయిల అందాన్ని ద్విగుణీకృతం చేసే వస్తువుల్లో నెయిల్‌ పాలిష్‌ ఒకటి. కాబట్టి మీకు నచ్చిన, నప్పిన రంగు నెయిల్‌ పాలిష్‌ను కిట్‌లో ఉంచుకోవడం/వెంట తీసుకెళ్లడంలో తప్పు లేదు.

⚛ మేకప్‌ వేసుకోవడమే కాదు.. తొలగించడమూ తప్పనిసరి. కాబట్టి ఓ మేకప్‌ రిమూవర్‌ కూడా కిట్‌లో తప్పకుండా ఉండాల్సిన వస్తువే! లేదంటే మిసెల్లార్‌ వాటర్‌ ఉపయోగించినా సమాన ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్