పవర్ పాయింట్ ప్రజంటేషన్లతో కోట్లు సంపాదిస్తోంది..!

ఈ రోజుల్లో చాలామంది తాము చదివే చదువులకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండడం లేదు. కానీ, కొంతమంది మాత్రం ఆసక్తి ఉన్న కోర్సుని ఎంపిక చేసుకుని అందులోనే రాణిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు.

Published : 08 Sep 2023 12:13 IST

(Photo: 16x9design.com)

ఈ రోజుల్లో చాలామంది తాము చదివే చదువులకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండడం లేదు. కానీ, కొంతమంది మాత్రం ఆసక్తి ఉన్న కోర్సుని ఎంపిక చేసుకుని అందులోనే రాణిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది అమెరికాకు చెందిన కోర్ట్నీ అలెన్. చిన్నప్పటి నుంచి గ్రాఫిక్ డిజైనింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె అందులోనే డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత దానినే వృత్తిగా కొనసాగిస్తూ కోట్లు సంపాదిస్తోంది. ఈ క్రమంలో ఆమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.

తోటి విద్యార్థులే..

కోర్ట్నీ అలెన్ (33) అమెరికాలోని అట్లాంటాలో పుట్టి పెరిగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి గ్రాఫిక్ డిజైనింగ్ అంటే మక్కువ. అలా డిగ్రీలో గ్రాఫిక్ డిజైనింగ్‌ను ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకుంది. ఈ క్రమంలోనే 2012లో యూనివర్సిటీ పట్టా కూడా అందుకుంది. అలెన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో గ్రాఫిక్ డిజైనింగ్ చేసే తోటి విద్యార్థులే దాని గురించి చులకనగా మాట్లాడేవారట. ‘పవర్ పాయింట్ ప్రజంటేషనా? అసలు నేను ఇది చేయాలనుకోలేదు’ అని చాలామంది చెప్పేవారట. దాంతో అలెన్ కూడా ఆలోచనలో పడిందట. ఆ తర్వాత తేరుకుని అసలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ రంగంలో కెరీర్ ఎలా ఉంటుందో పరిశోధించడం ప్రారంభించింది. తన పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా రోజుకు మూడు కోట్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్లు చేస్తున్నారని తెలుసుకుంది. అలాగే ఈ రంగంలో అవకాశాలకు కొదవ లేదని గ్రహించింది.

అది అంత సులభం కాదు..

కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలెన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ డిజైనర్‌గా పనిచేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సిస్కో వంటి సంస్థలకు పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా మంచి సంపాదన వచ్చినప్పటికీ ఆమె సంతృప్తి చెందలేదు. దీనికి తోడు ‘పవర్ పాయింట్ ప్రజంటేషన్లు చేయడం కూడా ఉద్యోగమేనా?’ అనే విమర్శలు ఎదుర్కొంది. దాంతో అలెన్ తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంది. ఈ క్రమంలోనే ‘అప్ వర్క్’ వంటి ఫ్రీలాన్సింగ్ సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. మొదట్లో ప్రాజెక్టులు రాకపోయినా పట్టు వదలకుండా ప్రయత్నించింది. అలా ఓసారి ‘అడోబ్’ సంస్థ ప్రజంటేషన్లు కావాలని ఓ పెద్ద ప్రాజెక్టును అప్పగించిది. దాంతో ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్లింది.

దీని గురించి అలెన్ మాట్లాడుతూ ‘ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్లలో ఎలాంటి రివ్యూలు, అనుభవం లేకపోతే ప్రాజెక్టులు సంపాదించడం కష్టం. నాకు కూడా మొదట్లో ప్రాజెక్టులు వచ్చేవి కావు. కానీ నేను మాత్రం క్రమం తప్పకుండా సాధ్యమైనన్ని జాబ్ పోస్టింగ్స్‌కు అప్లై చేసేదాన్ని. దాంతో ఓసారి అడోబ్ సంస్థ నుంచి మంచి ఆఫర్ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది.

సొంతంగా సంస్థను స్థాపించి..

అలెన్ తనకు అందివచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంది. దాంతో వివిధ సంస్థల నుంచి ప్రాజెక్టులు వెల్లువలా వచ్చాయి. ఆ పనిని తాను ఒక్కర్తే చేయడం కష్టమని భావించింది. ఇందుకోసం 2017లో తనే సొంతంగా ‘16x9’ పేరుతో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు తయారు చేసే సంస్థను స్థాపించింది. దీని ద్వారా వివిధ సంస్థలకు ఎగ్జిక్యూటివ్ ప్రెజెంటేషన్లు, ఇన్వెస్టర్ పిచ్ డెక్స్, ఈవెంట్ ప్రెజెంటేషన్లు, ట్రైనింగ్ మెటీరియల్స్, టెంప్లెట్‌లు అందిస్తోంది. సొంత కాంట్రాక్టులు, సంస్థ ద్వారా అలెన్ ప్రస్తుతం సంవత్సరానికి 2 మిలియన్ డాలర్లకు పైగా సంపాదిస్తోంది. అంటే మన కరెన్సీలో సుమారు 16 కోట్లకు పైగా అన్నమాట. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్, బ్లూమ్‌బర్గ్ వంటి సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందం కూడా చేసుకుంది.

విశ్రాంతి కూడా ముఖ్యమే..!

కెరీర్‌లో పనితో పాటు విశ్రాంతి కూడా ముఖ్యమే అంటోంది అలెన్. దీని గురించి మాట్లాడుతూ ‘యూనివర్సిటీ పట్టా పొందాక పలు ఏజెన్సీలు వర్క్ కోసం నన్ను సంప్రదించాయి. కానీ అప్పటికే విసిగిపోయాను. ఏడాది గ్యాప్ తీసుకున్నా. ఈ సమయంలో థాయిలాండ్‌కు వెళ్లాను. ఈ విశ్రాంతి నన్ను మరింత ఎక్కువగా పనిచేయడానికి ప్రేరణ కలిగించింది’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. భవిష్యత్తులో ఫ్రీలాన్సర్లదే హవా అంటోంది అలెన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్