Ghazal Alagh: పాతిక లక్షల పెట్టుబడితో.. వేల కోట్లు సంపాదిస్తోంది!

వ్యాపార రంగంలో రాణిస్తూ గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొడుతున్నారు ఎంతోమంది మహిళలు. వేల రూపాయలతో ప్రారంభించిన కంపెనీని కోట్లకు పడగెత్తేలా అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి బిజినెస్‌ విమెన్‌ సక్సెస్‌ మంత్రా తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. మరి, వాళ్ల కోసమే తన విజయ సూత్రాల్ని, కెరీర్‌లో ఎదగాలంటే పాటించాల్సిన చిట్కాల్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు ‘మామా ఎర్త్‌’ సహ వ్యవస్థాపకురాలు గజల్‌ అలఘ్‌.

Published : 06 Apr 2024 18:35 IST

(Photos: Instagram)

వ్యాపార రంగంలో రాణిస్తూ గ్లాస్‌ సీలింగ్‌ని బద్దలుకొడుతున్నారు ఎంతోమంది మహిళలు. వేల రూపాయలతో ప్రారంభించిన కంపెనీని కోట్లకు పడగెత్తేలా అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి బిజినెస్‌ విమెన్‌ సక్సెస్‌ మంత్రా తెలుసుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు. మరి, వాళ్ల కోసమే తన విజయ సూత్రాల్ని, కెరీర్‌లో ఎదగాలంటే పాటించాల్సిన చిట్కాల్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు ‘మామా ఎర్త్‌’ సహ వ్యవస్థాపకురాలు గజల్‌ అలఘ్‌. తాజాగా అలాంటి ఓ సక్సెస్‌ టిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారామె. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మరి, ఈసారి ఈ లేడీ బాస్‌ మన కోసం ఏం చిట్కా తీసుకొచ్చారు? అసలు వ్యాపారం వైపు ఆమె ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం రండి..

వంద గంటల రూల్‌!

కెరీర్‌లో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి.. టెక్నాలజీ పోకడలకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. మరి, ఆ నైపుణ్యాల్ని ఎలా ఒంటబట్టించుకోవాలి? అనడిగితే.. అందుకు తాను వంద గంటల రూల్‌ పాటిస్తానని చెబుతున్నారు గజల్‌.

‘తరచూ నాకో ప్రశ్న ఎదురవుతుంటుంది.. ‘మీరు కొత్త విషయాల్ని/నైపుణ్యాల్ని ఎలా నేర్చుకుంటారు?’ అని! చాలా సింపుల్‌.. అందుకు నేను వంద గంటల రూల్‌ పాటిస్తా. ఈ వంద గంటలు దీని పైనే సాధన చేస్తా.. పట్టు సాధిస్తా. ఈ రూల్‌ ఎప్పుడు మొదలుపెట్టానో తెలియదు కానీ.. ఈ అలవాటే నన్ను తరచూ కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రేరేపిస్తుంది. జీవితంలో మీరు ఏం నేర్చుకోవాలన్నా దానికి తగిన సమయమివ్వండి.. కష్టపడండి.. కష్టపడితే సాధించలేనిదేదీ లేదు..’ అంటూ ఎక్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారీ బిజినెస్‌ లేడీ. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రముఖుల దగ్గర్నుంచి సామాన్యుల దాకా దీనిపై స్పందిస్తున్నారు. ‘ఇది గేమ్‌ ఛేంజర్‌ రూల్‌’ అని ఒకరంటే, ‘నేను కూడా ఈ సూత్రాన్ని పాటించి సక్సెసవుతాను..’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

కపిల్‌ సలహాలు.. విలువైనవి!

ఇలా తన సక్సెస్‌ టిప్స్‌ని మనతో పంచుకోవడమే కాదు.. తానూ ప్రముఖుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతానంటున్నారు గజల్‌. ఈ క్రమంలోనే ఇటీవలే విమాన ప్రయాణం చేసిన ఆమెకు.. అదే ఫ్లైట్‌లో క్రికెట్‌ లెజెండ్‌ కపిల్‌ దేవ్‌ కలిశారు. ఆ రెండు గంటల జర్నీలో ఆయన నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు ఆ సమయంలో ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెట్టారామె.

‘నేను, పాజీ (కపిల్‌ దేవ్‌) రెండు గంటల పాటు కలిసి విమాన ప్రయాణం చేశాం. ఈ క్రమంలో ఆయన దగ్గర్నుంచి కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నా. అవేంటంటే..

⚛ ఆటల్లో గెలుపే లక్ష్యం కాదు.. తపనతో ఆడాలి..

⚛ పిల్లలు సాధించే మార్కులపై కాదు.. వాళ్ల ప్రవర్తన, నడవడికపై దృష్టి పెట్టండి.

⚛ సవాళ్లను సమస్యలుగా కాకుండా.. సాహసాలుగా పరిగణిస్తే వాటిని సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం..

ఇవే కాదు.. మా ఇద్దరి స్వస్థలం చండీగఢ్ అని, ఇద్దరం చిన్నప్పుడు ఒకే స్కూల్లో (దయానంద్‌ ఆంగ్లో వేదిక్‌ స్కూల్‌) చదివామని.. ఇలా మాటల మధ్యలో బోలెడన్ని విషయాలు తెలుసుకున్నా. అనుకోకుండా పాజీని కలిసినా.. ఈ ప్రయాణం ఎన్నో మధురానుభూతుల్ని పంచింది..’ అంటూ కపిల్‌ దేవ్‌తో ఫ్లైట్‌లో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు గజల్‌. ఇలా తన స్ఫూర్తిదాయక చిట్కాలు, తాను నేర్చుకున్న విషయాల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎంతోమందిలో ప్రేరణ కలిగిస్తుంటారీ బిజినెస్‌ లేడీ.

కొడుకు కోసం..!

చండీగఢ్ లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగారు గజల్‌. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. అప్లైడ్‌ ఆర్ట్స్‌-మోడ్రన్‌ ఆర్ట్‌ డిజైన్‌లో ఇంటర్న్‌షిప్‌ కోర్స్‌ చేశారు. ఆపై ‘న్యూయార్క్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్‌’ నుంచి ఫిగరేటివ్‌ ఆర్ట్‌లో ఇంటెన్సివ్‌ కోర్స్‌ చేసిన ఆమెకు ఇదే సమయంలో వరుణ్‌ అలఘ్‌తో పరిచయం ఏర్పడింది. 2011లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కొన్నేళ్ల పాటు కార్పొరేట్‌ ట్రైనర్‌గా పనిచేసిన గజల్‌.. అగస్త్య అనే కొడుక్కి జన్మనిచ్చారు. అయితే అమ్మయ్యాక కొన్నాళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. తన కొడుకు ఆలన పాలనలోనే గడిపేవారు. ఈ క్రమంలోనే తన చిన్నారి కోసం రసాయనాల్లేని బేబీ కేర్‌ ఉత్పత్తుల కోసం వెతికారామె. కానీ అలాంటి ఉత్పత్తి ఒక్కటీ కనిపించలేదు. పైగా కొన్నింట్లో క్యాన్సర్‌ కారకాలూ ఉన్నట్లు గ్రహించారు గజల్‌. ఎంత ప్రయత్నించినా మార్కెట్లో సహజ బేబీ కేర్‌ ఉత్పత్తులు దొరక్కపోయేసరికి.. తానే సొంతంగా పరిశోధించి సహజ ఉత్పత్తుల్ని తయారుచేసి తన కొడుక్కి వాడేవారామె.

సురక్షితం అని తేలాకే..!

తన కొడుకు పరిస్థితి సరే.. మరి, వీడిలాంటి చిన్నారుల పరిస్థితేంటి? అని ఆలోచించిన గజల్‌.. 2016లో తన భర్త వరుణ్‌తో కలిసి ‘మామా ఎర్త్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. పసి పిల్లలు, చిన్నారుల కోసం సహజసిద్ధమైన చర్మ ఉత్పత్తుల్ని తయారుచేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఇలా తయారుచేసిన ఉత్పత్తుల్ని రీసైక్లింగ్‌ చేసిన ప్యాకేజింగ్‌ వస్తువుల్లో ప్యాక్‌ చేయిస్తోన్న ఆమె.. పర్యావరణ పరిరక్షణకూ తన వంతుగా కృషి చేస్తున్నారు.

‘సహజసిద్ధమైన బేబీ కేర్‌ ఉత్పత్తులతో మా వ్యాపారాన్ని ప్రారంభించాం. క్రమంగా దీన్ని పర్సనల్‌ కేర్‌ ఉత్పత్తులకూ విస్తరించాం. ప్రస్తుతం మా వద్ద చిన్నారుల సంరక్షణ కోసం అన్ని రకాల ఉత్పత్తులూ లభిస్తున్నాయి. అలాగే పెద్ద వారి కోసం బ్యూటీ, హెయిర్‌ కేర్‌, మేకప్‌ ఉత్పత్తులూ మా వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ మా వద్ద ఓ కొత్త ఉత్పత్తి తయారైందంటే.. ముందు నేను స్వయంగా ఆ ఉత్పత్తిని వాడి పూర్తి సురక్షితం అని నిర్ధరించుకున్నాకే మార్కెట్లోకి తీసుకొస్తా..’ అంటోన్న ఈ బిజినెస్‌ క్వీన్‌.. ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇక గజల్‌ సంస్థ మామా ఎర్త్‌లో పెట్టుబడి పెట్టిన బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి.. ఇదే తన విజయవంతమైన పెట్టుబడిగా పేర్కొంది. సుమారు రూ. 25 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన తన సంస్థను.. రూ. 9800 కోట్లకు పడగెత్తించిన ఘనత గజల్‌దే అనడం అతిశయోక్తి కాదు. ఆసియాలోనే తొలి ‘సేఫ్లీ మ్యాన్యుఫ్యాక్చర్డ్‌ సర్టిఫైడ్‌ బ్రాండ్‌’గా తన సంస్థను నిలిపిన ఈ సూపర్‌ ఉమన్‌ను.. ఫోర్బ్స్‌, ఫార్చ్యూన్‌.. వంటి ప్రముఖ పత్రికలు ‘శక్తిమంతమైన మహిళ’గా గుర్తించి గౌరవించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్