14 ఏళ్లకే బిడ్డని పోగొట్టుకొని..

ఒక మరాఠీ సినిమా! కథ కూడా దశాబ్దాల క్రితానిది. ఇప్పుడు ఎన్నో అంతర్జాతీయ స్కూళ్లు తమ విద్యార్థులకు ఈ సినిమా చూసి, ఏం స్ఫూర్తి పొందారో రాయమంటున్నాయట. అది ఆనందీబాయి గోపాల్‌రావ్‌ జోషి కథ! ఇంతకీ ఎవరీమె? 

Updated : 03 Mar 2023 08:59 IST

తొలి అడుగు

ఒక మరాఠీ సినిమా! కథ కూడా దశాబ్దాల క్రితానిది. ఇప్పుడు ఎన్నో అంతర్జాతీయ స్కూళ్లు తమ విద్యార్థులకు ఈ సినిమా చూసి, ఏం స్ఫూర్తి పొందారో రాయమంటున్నాయట. అది ఆనందీబాయి గోపాల్‌రావ్‌ జోషి కథ! ఇంతకీ ఎవరీమె?

తన బామ్మతో కలిసి వంట చేస్తోంది ఆనందీ బాయి. కోపంగా వంటగదిలోకి వచ్చిన భర్త ఆమెపై కోపగించుకున్నారు. ఆయన కోపం పని సరిగా చేయలేదనో.. కావాల్సినవి అందించలేదనో కాదు. చదువు నిర్లక్ష్యం చేస్తోందని! ఈ కాలంలో ఈ చర్య సహజంగానే తోయొచ్చు. 18వ శతాబ్దంలో ఇది వింతే! అసలు పేరు యమున. పుట్టింది ఓ మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో. ఇంట్లో గారాలపట్టి.. బాగా చదువుకున్న వ్యక్తితోనే పెళ్లి చేయాలనుకున్నారు ఆమె నాన్న. అందుకే 20 ఏళ్లు పెద్దయినా గోపాల్‌రావు జోషికిచ్చి పెళ్లిచేశారు. ఆయనికిది రెండో పెళ్లి. అలా 9 ఏళ్ల వయసులో 8 ఏళ్ల కొడుక్కి అమ్మయింది ఆనందీ బాయి. భర్త తపాలాశాఖ ఉద్యోగి. దీంతో ఎన్నో ప్రాంతాలు మారారు. ఆడవాళ్లకీ చదువు అవసరమని గోపాలరావు నమ్మేవారు. అందుకే బలవంతంగా ఆవిడని చదివించేవారు.

14 ఏళ్ల వయసులో ఒక బిడ్డకి జన్మనిచ్చారు ఆనందీబాయి. కానీ ఆ బాబు కొద్దిరోజుల్లోనే చనిపోవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పుడు చదువుని సీరియస్‌గా తీసుకొని వైద్యురాలవ్వాలనుకున్నారు. కానీ సమాజం నుంచి వ్యతిరేకత. ఇక్కడి మెషినరీ స్కూళ్లు ఆమెను చేర్చుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో మతం మార్చుకోవాలనీ అనుకున్నారు. భర్త ప్రయత్నంతో అమెరికాలో చదివే అవకాశమొచ్చింది. అప్పుడూ వ్యతిరేకతే! వాళ్లతో ‘దేశంలో మహిళా వైద్యుల అవసరం చాలా ఉంది. మంత్రసాని వైద్యం సరిపోదు. అందుకే నేనే ముందడుగు వేస్తున్నా’ అని చెప్పారు. 19 ఏళ్లకి పెన్సిల్వేనియా వైద్య కళాశాలలో రెండేళ్ల వైద్యవిద్య పూర్తిచేశారు. ఆయుర్వేదం, ఇంగ్లిష్‌ వైద్యంపై ఓ థీసిస్‌నీ పూర్తిచేసి విక్టోరియా రాణితో శభాష్‌ అనిపించుకున్నారు. విదేశాల్లో  వైద్య పట్టా అందుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచారు. దేశానికి సేవలందించాలని భారత్‌కి తిరిగొచ్చినపుడు ఘనస్వాగతం లభించిందామెకు. దీంతోపాటు కోల్హాపూర్‌ ఆల్బర్ట్‌ ఎడ్వర్డ్‌ హాస్పిటల్‌లో ఉద్యోగమూ వచ్చింది. కానీ టీబీ సోకి.. 22 ఏళ్లు రాకముందే మరణించారు. అప్పటికి ఆమె వైద్య సేవలందించి మూణ్నెళ్లే అయినా  ఆనందీబాయి స్ఫూర్తితో ఆ తర్వాత ఎంతోమంది మహిళలు వైద్యవిద్యను ఎంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్