పడవల్లోనే వైద్యసేవ!

సేవ చేయాలన్న గుణం ఉండాలే కానీ దానికి వయసు అడ్డంకి కానే కాదు...అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం సావిత్రి పాల్‌. 79 ఏళ్ల వయసులో భర్త సహాకారంతో సదరన్‌ హెల్త్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సమితి (ఎస్‌హెచ్‌ఐఎస్‌) ఫౌండేషన్‌ స్థాపించి, మొబైల్‌ బోట్స్‌లో సేవలను అందిస్తున్నారు.

Updated : 27 May 2024 03:13 IST

సేవ చేయాలన్న గుణం ఉండాలే కానీ దానికి వయసు అడ్డంకి కానే కాదు...అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం సావిత్రి పాల్‌. 79 ఏళ్ల వయసులో భర్త సహాకారంతో సదరన్‌ హెల్త్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సమితి (ఎస్‌హెచ్‌ఐఎస్‌) ఫౌండేషన్‌ స్థాపించి, మొబైల్‌ బోట్స్‌లో సేవలను అందిస్తున్నారు.

అది 1978 సెఫ్టెంబర్‌ 27... పశ్చిమ బంగలోని హౌరా ప్రాంతం.. వేలమంది ఆకలితో మరణించారు. ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. పశువులు చనిపోయి వాటి కళేబరాలు నీటిలో తేలుతున్నాయి. కారణం.. అక్కడ ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలే. ఇళ్లల్లో వరదనీరు చేరి ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాఠశాలలూ, చెట్లెక్కి తలదాచుకుంటున్నారు. ఆ హృదయ విదారక సంఘటనలు చూసి మహ్మద్‌ అబ్దుల్‌ ఒహాబ్, సావిత్రి పాల్‌ దంపతులు కదిలిపోయారు. ఎప్పుడేమి జరుగుతుందో అనే భయం ఓ వైపు... వరదల వల్ల వచ్చిన రోగాలు మరోవైపు... ఈ పరిస్థితిలో ఏం చేయాలో తోచలేదు. అప్పుడే ఒక వ్యక్తి పడవలో బాధితులకు ఆహారాన్ని అందిస్తూ కనిపించాడు. అప్పుడు వారిలో మెదిలిన ఆలోచనే ఈ బోట్‌ క్లినిక్‌లు. పశ్చిమబంగలోని సుందర్‌బన్స్‌ మడ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకి వైద్యసేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. నడకమార్గం కూడా లేని ప్రాంతాలను గుర్తించారు.

ప్రభుత్వం అందిస్తున్న మందులను ప్రజలకు అందించడం మొదలుపెట్టారు. ‘ఈ ప్రాంతంలో దాదాపు 30 చిన్నచిన్న ద్వీపాలున్నాయి. ఇక్కడ నివసించే మూడులక్షల మందికి, ముగ్గురు వైద్యులు మాత్రమే. సమయానికి సరైన వైద్యం, మందులు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఏమీ చేయలేని దుస్థితి. పైగా 50శాతం మంది క్షయ వ్యాధి బాధితులే. ప్రాథమిక వైద్యం అందక ఇన్ఫెక్షన్లు ఎక్కువై రోగుల సంఖ్య పెరిగిపోయేది. ఇవన్నీ చూశాక... ఇక్కడి పరిసరాలపై పుస్తకం రాయడానికి వచ్చిన ఫ్రెంచ్‌ రచయిత సాయంతో మొబైల్‌ బోట్లను కొనుగోలు చేసి, 1980లో ‘ఎస్‌హెచ్‌ఐఎస్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేశాం. ఇవి రోజుకి నాలుగు ప్రాంతాల చొప్పున విడతల వారీగా వారం రోజులూ వైద్య సేవలను అందిస్తాయి. ప్రతి బోట్‌లోనూ పడకలు, మందుల పంపిణీ గది. ఎక్సరే రూం, చిన్న పాథలాజికల్‌ యూనిట్, ఆక్సిజన్‌ సిలిండర్‌తో పాటు ఇతర వైద్య పరికరాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం గర్బిణులకు ముందు ప్రాధాన్యం ఇస్తాం. ఇప్పటి వరకు ఎనిమిది లక్షలమంది సాయం పొందారు’ అంటూ చెప్పుకొచ్చారు సావిత్రి పాల్‌. అయితే ఇదంతా ఒక్కరోజులోనే సాధ్యపడలేదు.  42 ఏళ్లు పట్టింది. ఈ మడ అడవుల గుండా వెళ్లే మార్గాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. గంటల తరబడి నడవాలి.  కానీ ఎస్‌హెచ్‌ఐఎస్‌ ఫౌండేషన్‌ ద్వారా గుమ్మం వద్దకే వైద్యం అందిస్తున్నారు. వలంటీర్ల సాయంతో బోట్‌ క్లినిక్‌ల ద్వారా నలభై వేల మందికి క్షయ వ్యాధిని నివారించగలిగారు. అలానే, మహిళలకు స్వశక్తితో నిలబడేలా చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే సేవ చేయడానికి వయసుతో సంబంధం లేదనీ, మంచి మనసు ఉంటే చాలనీ మీకూ అనిపిస్తోంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్