Sexual Health: కొన్ని రకాల మందులూ ఆ ‘కోరిక’ను తగ్గిస్తాయట!

శృంగారం.. ఆరోగ్యాన్ని, అనుబంధాన్ని రెట్టింపు చేస్తుందిది. దీన్ని ఆస్వాదించినప్పుడే ఆయా ప్రయోజనాల్ని పొందగలుగుతాం. అయితే శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, బిడ్డకు జన్మనివ్వడం, పాలివ్వడం, మెనోపాజ్‌.. ఇలాంటి సమయాల్లో చాలామంది మహిళల్లో లైంగిక కోరికలు తగ్గడం సహజం. కానీ కొన్ని రకాల అనారోగ్యాల్ని దూరం చేసుకోవడానికి.....

Published : 16 Jul 2022 16:59 IST

శృంగారం.. ఆరోగ్యాన్ని, అనుబంధాన్ని రెట్టింపు చేస్తుందిది. దీన్ని ఆస్వాదించినప్పుడే ఆయా ప్రయోజనాల్ని పొందగలుగుతాం. అయితే శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, బిడ్డకు జన్మనివ్వడం, పాలివ్వడం, మెనోపాజ్‌.. ఇలాంటి సమయాల్లో చాలామంది మహిళల్లో లైంగిక కోరికలు తగ్గడం సహజం. కానీ కొన్ని రకాల అనారోగ్యాల్ని దూరం చేసుకోవడానికి మనం వాడే మందులు కూడా ఈ కోరికను దెబ్బ తీసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా లైంగికాసక్తి తగ్గిపోయి.. ఆరోగ్యపరంగా, అనుబంధ పరంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు.

ఒత్తిడి తగ్గించేవి!

కారణాలేవైనా ఒత్తిడి, ఆందోళనలు.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. అయితే వీటి ప్రభావానికి మరీ ఎక్కువగా గురికానంత వరకు సమస్యేమీ ఉండకపోవచ్చు.. కానీ మరింత లోతుగా ఆలోచిస్తేనే డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదముంటుంది. ఇక దీన్నుంచి బయటపడడానికి కొన్ని రకాల మందులు సూచిస్తారు వైద్యులు. వీటిని వాడడం వల్ల శరీరంలో లైంగిక హార్మోన్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నాయి పలు అధ్యయనాలు. అంతేకాదు.. వీటిలో కొన్ని రకాల మందులు నరాలపై ప్రభావం చూపి.. జననేంద్రియాలకు సరైన రక్తప్రసరణ జరగకుండా అడ్డుపడుతుంటాయి. తద్వారా లైంగికాసక్తి క్రమంగా తగ్గిపోవడం.. ఒకదశలో ఇది పూర్తిగా నశించిపోయే ప్రమాదముంటుందట!

బీపీ ఉందా?

వయసు పైబడడం, మానసిక సమస్యలు రక్తపోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఫలితంగా హైపర్‌టెన్షన్‌, లోబీపీ.. వంటి సమస్యలొస్తాయి. ఈ దీర్ఘకాలిక సమస్యల్ని అదుపులో పెట్టుకోవాలంటే రోజూ మందులు వేసుకోవాల్సిందే. అయితే ఈ ఔషధాలు కూడా రక్తపరసరణ వ్యవస్థపై ప్రభావం చూపి జననేంద్రియాలకు సరైన రక్తప్రసరణ జరగకుండా అవరోధాలుగా మారతాయట! ఫలితంగా వెజైనా పొడిబారిపోవడం, లైంగికాసక్తి తగ్గిపోవడం.. వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

కొవ్వుల్ని కరిగించే మందులు!

మనం పాటించే అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. శరీరంలో చెడు కొవ్వులు పేరుకుపోవడం.. ఆయా భాగాల ఆకృతి మారి అసౌకర్యానికి గురవడం.. చాలామందికి ఈ సమస్య సవాలు విసురుతుందని చెప్పాలి. అయితే ఈ సమస్య తీవ్రతను బట్టి చెడు కొవ్వులు కరిగించే మందులు సూచిస్తారు వైద్యులు. ఇవి కూడా కొన్ని సందర్భాల్లో మహిళల్లో శృంగార ఆసక్తిని దెబ్బతీస్తున్నాయని కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి.

గర్భనిరోధక మాత్రలు

నెలసరి సమస్యల్ని తగ్గించుకోవడానికి, పీసీఓఎస్‌ ఉన్న వారు, అవాంఛిత గర్భం రాకుండా, అవాంఛిత రోమాలకు విరుగుడుగా.. ఇలా పలు సందర్భాల్లో మహిళలు గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం సహజమే! అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా లైంగిక హార్మోన్ల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడి.. తద్వారా శృంగార ఆసక్తి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

నొప్పి నివారిణులు

తలనొప్పైనా, నడుంనొప్పైనా, ఏదైనా గాయమైనా.. ఓ పెయిన్‌ కిల్లర్‌ వేసుకుంటే తగ్గిపోతుందనుకుంటాం. ఇది నిజమే.. కానీ దీని ప్రభావం లైంగిక జీవితంపై పడుతుందంటున్నారు నిపుణులు. ఈ ఔషధాలు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని తగ్గించడమే ఇందుకు కారణం.

ఇక వీటితో పాటు అలర్జీని తగ్గించుకోవడానికి వాడే మందులు, యాంగ్జైటీ-నిద్రలేమి సమస్యలకు విరుగుడుగా వాడే ఔషధాలు కూడా లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు నిపుణులు.


ప్రత్యామ్నాయాలూ ఉన్నాయ్!

 

ఆహారమైనా, ఔషధాలైనా.. మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. కాబట్టి సమస్యను బట్టి ఇలాంటి మందులు అత్యవసరమైతేనే.. అదీ తక్కువ మోతాదులో వాడడం మంచిదంటున్నారు నిపుణులు. దీంతో పాటు ఈ ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం ద్వారా కూడా లైంగికాసక్తి కోల్పోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

మందుల వల్ల లైంగికాసక్తి తగ్గుతున్నట్లు గమనిస్తే.. ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది. అవసరమైతే వారు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల్లో మార్పు చేసి.. శృంగార ఆసక్తిపై ప్రభావం చూపని ఔషధాలు మీకు సూచించే అవకాశం ఉంటుంది.

అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు.. మహిళలు గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం కంటే.. కండోమ్స్‌ వంటి శరీరానికి బయట ఉపయోగించే పద్ధతుల్ని ఎంచుకోవడం శ్రేయస్కరం!

కొవ్వులు, అధిక బరువు తగ్గించుకోవడానికి.. మందులకు ప్రత్యామ్నాయంగా వ్యాయామాల్ని ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో నిపుణుల సలహా మేరకు వివిధ రకాల వర్కవుట్స్‌ చేయడం వల్ల చాలా వరకు ఫలితం ఉంటుంది.

మానసిక ఆరోగ్యం సొంతం చేసుకోవడానికి యోగా, ధ్యానం.. వంటివి ఉండనే ఉన్నాయి. కాబట్టి చిన్న సమస్యకే ఔషధాలను ఆశ్రయించకుండా ఇలాంటి పద్ధతుల్ని పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల భాగస్వామితో తగిన సమయం గడపలేకపోవడం వల్ల కూడా లైంగికాసక్తి తగ్గిపోతుంది. కాబట్టి కెరీర్‌, పిల్లల బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నా భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు తగిన సమయం కేటాయించడం మంచిది.

చాక్లెట్స్‌, నట్స్‌, గింజలు.. వంటి లైంగికాసక్తిని పెంచే ఆహారం తీసుకోవడం; కీగల్‌, బరువులెత్తడం, ఈత.. వంటి వ్యాయామాలు భాగస్వామితో కలిసి చేయడం వల్ల శృంగార ఆసక్తిని పెంచుకొని.. తద్వారా లైంగిక జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్