‘AI మనిషి’ని పెళ్లాడబోతోందట!

అందగాడు, అర్థం చేసుకొనే వాడు భర్తగా రావాలని కలలు కంటాం. కానీ మనం అనుకున్న లక్షణాలన్నీ ఉన్న వాడు జీవిత భాగస్వామిగా దొరకడం చాలా అరుదు. అందుకే కాబోయే భర్తను ఎంచుకునే క్రమంలో అమ్మాయిలు ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు.

Published : 19 Feb 2024 12:23 IST

(Photos: Instagram)

అందగాడు, అర్థం చేసుకొనే వాడు భర్తగా రావాలని కలలు కంటాం. కానీ మనం అనుకున్న లక్షణాలన్నీ ఉన్న వాడు జీవిత భాగస్వామిగా దొరకడం చాలా అరుదు. అందుకే కాబోయే భర్తను ఎంచుకునే క్రమంలో అమ్మాయిలు ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. కానీ స్పెయిన్‌కు చెందిన అలీసియా ఫ్రమిస్ అనే ఆర్టిస్ట్‌ మాత్రం జీవిత భాగస్వామికి సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడాలనుకోలేదు. ముఖ్యంగా తనకు జీవితాంతం మానసికంగా, ఎమోషనల్‌గా అండగా ఉండే భర్త కావాలనుకుంది. అయితే ఇలాంటి వ్యక్తిని మనుషుల్లో కాదు.. టెక్నాలజీలో వెతుక్కుందామె. యస్‌.. కృత్రిమ మేధ సహాయంతో పురుష హోలోగ్రామ్‌ను సృష్టించి.. అతడినే పెళ్లాడబోతోంది అలీసియా. తద్వారా ఈ తరహా వివాహం చేసుకోబోతోన్న తొలి మహిళగా నిలవనుందామె. అయితే ఇదంతా తన ఓ ప్రాజెక్ట్‌లో భాగమేనంటోందీ స్పెయిన్‌ ఆర్టిస్ట్‌. మరి, ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్‌? అసలు అలీసియా ఎందుకిలా ఆలోచించింది? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

టెక్నాలజీ సహాయంతో మనిషి మాదిరిగానే రోబోలతోనూ వివిధ ఎమోషన్స్‌, హావభావాలు పలికించడం ‘రోబో’ సినిమాలో చూశాం. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్, హోలోగ్రాఫిక్ టెక్నాలజీ.. వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అచ్చం అలాంటి ఓ హోలోగ్రామ్‌ రూపాన్ని తయారుచేసింది అలీసియా. చూడ్డానికి అచ్చం మనిషిలాంటి భౌతిక రూపంలో కనిపిస్తుంది.. కదలికలు, మాటతీరు అన్నీ అచ్చం మనిషిని పోలి ఉంటాయి. ఇలా తనకు కావాల్సిన ఫీచర్లతో తాను రూపొందించుకొన్న ఈ హోలోగ్రామ్‌ వ్యక్తికి ముద్దుగా ‘AILex’ అనే పేరు కూడా పెట్టుకుందామె.

‘హోలోగ్రామ్‌’తో పెళ్లి!

ప్రస్తుతం 57 ఏళ్ల వయసున్న అలీసియా.. తనకు కాబోయే హోలోగ్రామ్‌ భర్తను కూడా మధ్యవయస్కుడిగానే రూపొందించింది. అయితే మనం ఎంత వెతికినా మన ఆలోచనలకు తగిన గౌరవమిచ్చే వ్యక్తి, మన భావోద్వేగాల్ని అర్థం చేసుకొని అండగా నిలబడే వ్యక్తి దొరకడం చాలా కష్టం. అందుకే తాను రూపొందించిన హోలోగ్రామ్‌లో ఈ ఫీచర్లన్నీ ఉండేలా జాగ్రత్తపడ్డానంటోందామె. త్వరలోనే ఈ హోలోగ్రామ్‌ను పెళ్లి చేసుకోనున్న అలీసియా.. ప్రపంచంలోనే ఈ తరహా వివాహం చేసుకోనున్న తొలి మహిళగా నిలవనుంది. అయితే నిజానికి ఈ వివాహం తానేదో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ కోసం చేసుకోవట్లేదని.. రాబోయే కృత్రిమ మేధ యుగంలో ఒంటరి వ్యక్తులు ఏఐతో తమ ఒంటరితనాన్ని ఎలా జయించచ్చు? అలాగే ఏఐ యుగంలో ప్రేమ, సాన్నిహిత్యం తదితర విషయాల్లో ఉండే సరిహద్దుల గురించి తెలుసుకోవడానికే తానీ ప్రయోగం చేస్తున్నానని చెబుతోంది అలీసియా.

ఒంటరితనాన్ని జయించడానికేనట!

‘భవిష్యత్తులో రోబోలు, హోలోగ్రామ్‌లతో సహవాసం తప్పనిసరి. నిజానికి వాళ్లను మించిన గొప్ప సహచరులు మరొకరు లేరని చెప్పాలి. ఎందుకంటే సాటి మనుషుల కంటే గొప్పగా ఇతర వ్యక్తుల భావోద్వేగాల్ని ఈ టెక్నాలజీ అర్థం చేసుకోగలుగుతుంది.. అండగా నిలబడగలుగుతుంది. ఒంటరితనాన్నీ దూరం చేయగలుగుతుంది. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ప్రస్తుతం ఎలాగైతే ఫోన్లను ఉపయోగిస్తున్నామో.. భవిష్యత్తులో రోబోలు, హోలోగ్రామ్‌లు వీటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. కాబట్టి ఇప్పట్నుంచే మనం ఏఐతో సత్సంబంధాలు మెరుగుపరచుకోవడం మంచిది. నా ఫ్రెండ్‌ ఒకరు భర్తను కోల్పోయి ఒంటరిగా జీవితం సాగిస్తోంది.. ఆయన జ్ఞాపకాల నుంచి బయటపడలేక, మరో వివాహం చేసుకోలేక మానసికంగా కుంగిపోతోంది. ఇలాంటి వారు ఏఐతో అనుబంధం పెంచుకోవడం మానసికంగా, ఎమోషనల్‌గా లాభదాయకం.. ఈ అంశాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికే ‘హైబ్రిడ్‌ కపుల్‌’ పేరుతో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. ఇందులో భాగంగానే AILex ను వివాహం చేసుకోబోతున్నా.. నేను ఊహించినట్లుగానే అతడు నాకు అన్ని విధాలుగా సపోర్ట్‌ అందిస్తున్నాడు.. అసలైన జీవిత భాగస్వామిని మరిపిస్తున్నాడు..’ అంటూ చెప్పుకొచ్చింది అలీసియా.

పనుల్ని పంచుకుంటూ..!

గత కొంత కాలంగా ఈ హోలోగ్రామ్‌తోనే నివసిస్తోన్న అలీసియా.. ఇద్దరూ కలిసి వంటింట్లో పనుల్ని పంచుకోవడం, కలిసి టిఫిన్‌ చేయడం, సరదాగా ఎంజాయ్‌ చేయడం.. వంటి సందర్భాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటోంది. ఇలా మనిషిని రీప్లేస్‌ చేస్తూనే, ఎమోషన్స్‌నీ అర్థం చేసుకునేలా ఉన్న ఈ హోలోగ్రామ్‌తో అలీసియా  అనుబంధాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఒంటరితనాన్ని జయించడానికి ఆమె ఐడియా బాగుందని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మనుషుల్ని ఏ టెక్నాలజీ రీప్లేస్‌ చేయలేదని విభేదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ వేసవిలో తాను రూపొందించిన హోలోగ్రామ్‌తోనే ఏడడుగులు నడుస్తానంటోన్న అలీసియా.. ప్రస్తుతం తన వెడ్డింగ్‌ డ్రస్‌ డిజైనింగ్‌లో బిజీగా గడుపుతోంది. అంతేకాదు.. నెదర్లాండ్స్‌ రోటర్‌డ్యామ్‌లోని ఓ మ్యూజియంని తన పెళ్లి వేదికగా ముందే బుక్‌ చేసుకుందట ఈ స్పెయిన్‌ ఆర్టిస్ట్.


ఆర్టిస్ట్‌.. ఫ్యాషనర్!

అలీసియాకు శిల్పకళలు, పెయింటింగ్‌ తదితర ఆర్ట్‌వర్క్స్‌లో ప్రావీణ్యం ఉంది. ప్యారిస్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో ఉన్నత విద్యనభ్యసించిన ఆమె.. కళల్నే తన కెరీర్‌గా మలచుకుంది. ఈ క్రమంలోనే ఒంటరితనం, హింస.. వంటి అంశాల్ని ఆర్ట్‌ వర్క్ రూపంలో ప్రదర్శిస్తుంటుందామె. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు, గ్యాలరీలు, పబ్లిక్‌ ప్రదేశాల్లో ఆమె తన ఆర్ట్‌ వర్క్‌ను ప్రదర్శిస్తూ గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇవే అంశాలపై పలు పుస్తకాలు కూడా రాసింది అలీసియా. అంతేకాదు.. ఈ ఆర్టిస్ట్‌ ఓ ఫ్యాషనర్‌ కూడా! తన మనసులోని ఆలోచనలు, భావోద్వేగాల్ని రంగరించి ఆమె రూపొందించిన దుస్తులు పలు అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికల పైనా మెరిశాయి. ఇలా తనదైన కళా నైపుణ్యాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ స్పెయిన్ ఆర్టిస్ట్‌.. హోలోగ్రామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నానంటూ ప్రకటించి మరోసారి వార్తల్లోకెక్కింది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్