‘వీల్‌ఛైర్‌లో కూర్చొని ఏం సాధిస్తావ్‌?’ అన్నారు!

జీవితంలో కష్టాలొస్తే మనకే ఎందుకిలా అనుకుంటాం.. కానీ సత్తా ఉన్న వాళ్లకే కాలం సవాళ్లు విసురుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి సానుకూల దృక్పథంతోనే తన జీవితంలో అడుగడుగునా ఎదురైన కష్టాల్ని దాటుకుంటూ ముందుకు సాగుతోంది కశ్మీర్‌ లోయకు చెందిన సుమర్తి.

Published : 29 Nov 2023 18:53 IST

జీవితంలో కష్టాలొస్తే మనకే ఎందుకిలా అనుకుంటాం.. కానీ సత్తా ఉన్న వాళ్లకే కాలం సవాళ్లు విసురుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి సానుకూల దృక్పథంతోనే తన జీవితంలో అడుగడుగునా ఎదురైన కష్టాల్ని దాటుకుంటూ ముందుకు సాగుతోంది కశ్మీర్‌ లోయకు చెందిన సుమర్తి. పదేళ్ల వయసులోనే ప్రమాదవశాత్తూ చక్రాల కుర్చీకి పరిమితమైన ఆమె ఒక దశలో తన జీవితమే వ్యర్థమనుకుంది. దీనికి తోడు ఎదుటివారి విమర్శలు ఆమెను మరింత కుంగదీశాయి. అయినా ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో సమయం వృథా చేసుకోకుండా.. తన జీవితానికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుందామె. ఈ సంకల్పమే నేడు ఆమెను వ్యాపారవేత్తగా నిలబెట్టాయి. ప్రస్తుతం మసాలా వ్యాపారంలో రాణిస్తోన్న సుమర్తి స్ఫూర్తిదాయక ప్రయాణమిది!

జీవితంలో నడవలేనన్నారు!

సుమర్తిది శ్రీనగర్‌లోని సోనావర్‌ ప్రాంతం. ఇక్కడే పుట్టి పెరిగిన ఆమె బాల్యమంతా ఆనందంగా గడిచింది. అయితే తన పదేళ్ల వయసులో ఓ రోజు తీవ్ర జ్వరంతో స్కూల్‌ నుంచి ఇంటికొచ్చింది సుమర్తి. ‘ఇంత తీవ్రమైన జ్వరం అంతకుముందెప్పుడూ నాకు రాలేదు. దాంతో అమ్మానాన్న కంగారు పడ్డారు. వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లారు.. ఇది సాధారణ వైరల్‌ జ్వరమేమో అనుకున్నాం. కానీ ఎంతకీ తగ్గకపోవడం, దాని ప్రభావం కాళ్ల నరాలపై పడడంతో నడవలేని పరిస్థితి తలెత్తింది. ఇక జీవితంలో నేను నడవలేనంటూ ఒక దశలో డాక్టర్లు తేల్చేశారు. అయినా అమ్మానాన్నలు ఆశలు వదులుకోలేదు. రాష్ట్రం దాటి వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య నిపుణులకు చూపించారు. అయినా ఫలితం లేకపోయింది. ముంబయిలో నా కాళ్లకు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఈ సమయంలోనే డాక్టర్‌ నాకోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిన షూస్‌ని అమర్చారు. వీటితో నెమ్మదిగా నడవచ్చని భరోసా ఇచ్చారు. కానీ వాటి బరువు అధికంగా ఉండడం, అసౌకర్యంగా అనిపించడంతో ధరించలేకపోయా. నా తోటి పిల్లలందరూ స్కూలుకెళ్తుంటే నేను మాత్రం చక్రాల కుర్చీకే పరిమితమయ్యా. నాకే ఎందుకిలా అన్న ఆలోచనలతో మనసంతా కకావికలమయ్యేది..’ అంటూ తానెదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల గురించి చెబుతోంది సుమర్తి.

నాన్న పోయాక నరకం అనుభవించా!

ఇలా చక్రాల కుర్చీకే పరిమితమై శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన సుమర్తిని ఓదార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తన తండ్రే అని చెబుతోందామె.

‘కాళ్లు చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితమైన నాకు నాన్నే అండగా నిలిచారు. ఇంట్లో వాళ్లంతా నా పరిస్థితిని చూసి నా సామర్థ్యాల్ని సందేహించినా నాన్న మాత్రం నన్ను అన్ని విధాలా ప్రోత్సహించేవారు. భవిష్యత్తు గురించి పెద్ద కలలు కనమంటూ వెన్నుతట్టేవారు. కానీ కొన్నాళ్లకే నాన్న కన్నుమూయడంతో మరోసారి నా జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. నాన్న పోయిన దుఃఖంలో మునిగిపోయిన నాకు ఒకానొక దశలో నా జీవితమే వ్యర్థమన్న ఆలోచనలొచ్చేవి. దీంతో ఒంటరిగా నా గదికే పరిమితమై ఏడ్చిన సందర్భాలెన్నో! ఇలాంటి పరిస్థితిలో ఉన్న నాకు ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది. ‘లోపం ఉంది నా శరీరంలో కానీ నా మెదడులో కాదు కదా!’ అనిపించింది. అందుకే నా సామర్థ్యమేంటో నిరూపించుకోవాలనుకున్నా. నాలాంటి వాళ్లూ ఏదైనా సాధించగల సమర్థులు అని రుజువు చేయాలనుకున్నా..’ అంటోన్న సుమర్తి తొలుత ఓ ఫ్యాషన్‌ బొతిక్‌ని తెరిచింది.

మసాలా వ్యాపారంలో రాణిస్తూ..!

నలుగురమ్మాయిల్ని పనిలో చేర్చుకొని తన ఫ్యాషన్‌ బొతిక్‌ వ్యాపారాన్ని కొన్నాళ్ల పాటు నడిపించిన ఆమె.. ఈ క్రమంలో చేత్తో దుస్తులు, బ్యాగ్‌లు కుట్టేది. ఇతర యాక్సెసరీస్‌ని రూపొందించేది. అయితే ఈ పని ఒత్తిడి కొన్నాళ్లకే ఆమె కంటిపై ప్రతికూల ప్రభావం చూపడంతో బొతిక్‌ని మూసేయాల్సి వచ్చిందామె. అయినా విశ్రమించలేదామె. చక్రాల కుర్చీకే పరిమితమైనా తనకు ఆసక్తి ఉన్న బాస్కెట్‌బాల్‌ క్రీడలో నైపుణ్యాలు నేర్చుకుంది. పలు పోటీల్లో పాల్గొని ‘జమ్మూ-కశ్మీర్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌’ నుంచి పురస్కారాలు, మెడల్స్‌ సైతం అందుకుందామె. అయితే ఎప్పటికైనా ఓ స్థిరమైన వ్యాపారంలో కొనసాగాలని ఆలోచించేది సుమర్తి. ఈ క్రమంలోనే మసాలాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న ఆమె.. శ్రీనగర్‌లోని Khonmoh అనే ప్రాంతంలో ‘Sadaf Masalay’ పేరుతో తన సొంత ఫ్యాక్టరీని తెరిచింది.

‘నేను దాచుకున్న డబ్బుతోనే నా సొంత ఫ్యాక్టరీని ప్రారంభించా. ఈ క్రమంలోనే కొందరు ‘చక్రాల కుర్చీలో కూర్చొని ఏం సాధిస్తావ్‌?’ అంటూ ఎగతాళి చేసేవారు. అయినా నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్లే నన్ను స్ఫూర్తిప్రదాతగా ఇతరులకు చూపిస్తుంటే గర్వంగా అనిపిస్తోంది. మనలోని లోపాల్ని తలచుకుంటూ, ఇతరుల మాటల్ని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం. అదే మన శక్తిసామర్థ్యాలపై నమ్మకముంచితే అనుకున్న లక్ష్యాల్ని చేరుకోగలుగుతాం..’ అంటోన్న సుమర్తి.. ప్రస్తుతం తన ఫ్యాక్టరీ ద్వారా కారప్పొడి, పసుపు పొడి, మెంతి పొడి, యాలకుల పొడి.. వంటి వివిధ రకాల మసాలాల్ని తయారుచేస్తూ పెద్ద మొత్తంలో విక్రయిస్తోంది. వీటితో పాటు డ్రైఫ్రూట్స్‌, పప్పులు, వివిధ రకాల టీ పొడులు, ఆవ నూనె.. వంటివీ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేస్తోందామె. ఇలా తన వ్యాపారంతో స్థానికంగానే కాదు.. దేశవ్యాప్తంగానూ గుర్తింపు పొందింది సుమర్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్