ఎర్రకోటకు..నారీ సెల్యూట్‌

ఈ మట్టిమీద మమకారాన్ని చాటుకొనే అద్భుతమైన క్షణాలవి. దేశభక్తిని గుండెలనిండా నింపుకొని మువ్వన్నెల జెండాని గర్వంగా ఎగరేసే ఆ వేదికపై.. ఈ సారి నారీశక్తి తనని తాను సగర్వంగా చాటుకుంటోంది.

Updated : 25 Jan 2024 12:07 IST

ఈ మట్టిమీద మమకారాన్ని చాటుకొనే అద్భుతమైన క్షణాలవి. దేశభక్తిని గుండెలనిండా నింపుకొని మువ్వన్నెల జెండాని గర్వంగా ఎగరేసే ఆ వేదికపై.. ఈ సారి నారీశక్తి తనని తాను సగర్వంగా చాటుకుంటోంది. ఈ దేశం కోసం మేమున్నాం అంటున్న మహిళాశక్తిలో మన తెలుగమ్మాయీ ఉంది..


చిన్ననాటి స్ఫూర్తితో..

చిన్నతనంలో టీవీలో చూసిన గణతంత్ర దినోత్సవ వేడుకలనే స్ఫూర్తిగా తీసుకుని నేడు భారత వైమానిక దళానికి సారథ్యం వహిస్తోంది తెలుగమ్మాయి, స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధురెడ్డి...

‘అమ్మ సహోద్యోగి భారత వాయుసేనలో ఉండేవారు. అలా అమ్మతో కలిసి బెంగళూరులో వైమానికదళం నిర్వహించే ప్రదర్శనలకు వెళ్లేదాన్ని. ఆకాశంలో విమానాల విన్యాసాలు చూసి నాకూ గాలిలో అలా విమానాలతో విన్యాసాలు చేయించాలనే ఆశ ఉండేది. ఆ కోరిక నేడిలా తీరుతోంది. వైమానిక దళంలో అడుగుపెట్టాక యుద్ధహెలికాప్టర్‌లను నడపడం గర్వంగా ఉండేది. ఈ గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే అర్హతను సాధించినప్పుడు చిన్నప్పట్నుంచీ నేను చూసిన గణతంత్ర దినోత్సవ వేడుకల వీడియోలు నా కళ్లముందు మెదిలాయి. 144 మంది ఉండే ఈ బృందంలో మరో ముగ్గురు మహిళా ఆఫీసర్లు కూడా ఉన్నారు. వీరందరినీ ముందుండి నడిపించే అవకాశాన్ని అందుకోవడం ఓ మహిళగా గర్వంగా భావిస్తున్నా. దిల్లీలో ఒక డిగ్రీ ఉష్ణోగ్రతలో వేకువజామున 3 గంటలకు రిహార్సల్‌ చేయడం మామూలు విషయం కాదు. అయితే పరేడ్‌ని నడిపించే బాధ్యత ముందు అవేవీ గుర్తుకు రాలేదు. బెస్ట్‌ మార్చ్‌ కంటింజెంట్‌ ట్రోఫీ తీసుకోవాలనే లక్ష్యంతో కష్టపడ్డా. ఈ రంగంలోకి నేను అడుగు పెట్టేటప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి మారింది. అమ్మాయిలకూ అవకాశం చిక్కుతోంది. వైమానిక దళంలో లింగ వివక్షతకు చోటు లేదు. సమాన అవకాశాలున్నాయి. ఏ రంగంలోనైనా స్థానాన్ని సంపాదించగల సత్తా మనలో ఉంది. స్పష్టంగా ఓ లక్ష్యం దిశగా అడుగులేయగలిగితే చాలు. అనుకున్నది సాధించగలం.


శత్రు విమానాల భరతం పడుతూ...

వాయు క్షిపణి వ్యవస్థ గొప్పతనాన్ని చాటుతూ లెఫ్టినెంట్‌ చేతనాశర్మ నేతృత్వంలో జరగనున్న ప్రదర్శన మరోసారి మహిళాశక్తిని చాటనుంది. ‘శత్రు విమానాలు, డ్రోన్లను పసిగడుతూ, గగనతల రక్షణలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నా. క్షిపణి దళాలకు నేతృత్వం వహించే అవకాశం అందుకోవడం నా అదృష్టం’ అంటున్న శర్మది ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్‌ యూనిట్‌. భోపాల్‌ నిట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచి దేశరక్షణలో పాలుపంచుకోవాలనే ఆశయాన్ని నెరవేర్చుకున్నారీమె. 


14 ఏళ్ల కల..

‘నేను మహిళా లెఫ్టినెంట్‌ కమాండర్‌ను కాదు.. మగవారితో సమానంగా విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్‌ కమాండర్‌ను’ అనే 29 ఏళ్ల దిశా అమృత్‌ ఈ గణతంత్ర దినోత్సవాల్లో 144మందున్న నౌకాదళ కవాతు బృందానికి నేతృత్వం వహిస్తున్నారు..

‘మాది మంగళూరు. సాయుధ దళాల్లో చేరి దేశసేవకు అంకితమవ్వాలన్నది నాన్న కల. అది తీరలేదు. కానీ ఆయన మాటలు వింటూ పెరిగిన నేను దేశసేవలో అడుగుపెట్టాలకున్నా. సాయుధ దళాల్లో చేరాలనే కలతో ఎన్‌సీసీ క్యాడెట్‌గా చేరా. కర్ణాటకలో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేశా. ఆ తర్వాత ప్రవేశ పరీక్ష రాసి నావికాదళంలో చేరి.. అండమాన్‌ నికోబార్‌ నావిక, వైమానిక కార్యకలాపాల అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. 2008లో నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ రిపబ్లిక్‌ టీంలో పాల్గొన్నా. అప్పట్నుంచీ నావికాదళానికి నాయకత్వం వహించాలన్నది నా కల. అదిలా 14 ఏళ్లకు నెరవేరుతోంది’ అంటున్న దిశాతోపాటు ఈ ప్రదర్శనలో ప్లటూన్‌ కమాండర్స్‌గా మరో ఇద్దరు మహిళా లెఫ్టినెంట్‌లూ ఉన్నారు.


గగుర్పొడిచే విన్యాసాలతో...

యుధాలతో, ద్విచక్రవాహనాలపై విన్యాసాలు చేయడం తనకిష్టమంటారు లెఫ్టినెంట్‌ డింపుల్‌ భాటియా. ‘డేర్‌ డెవిల్స్‌గా.. సాహసపూరితమైన ప్రదర్శనలతో మహిళాశక్తిని చాటడమే మా ధ్యేయం. విన్యాసాలు ప్రదర్శించడంలో మా బృందానికి చక్కని అనుభవం ఉంది. ఈ ఏడాదీ అవకాశం దక్కడం మా అదృష్టం’ అంటున్న డింపుల్‌ 2021 బ్యాచ్‌లో చెన్నై ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ శిక్షణ ముగించుకున్నారు. శిక్షణ సమయంలో చేసిన సాహసాలకు వెండిపతకాన్ని కూడా అందుకున్నారు.


ఒంటెలపై కవాతు..

బీఎస్‌ఎఫ్‌కు చెందిన 12 మంది మహిళలు మొదటిసారి ఒంటెలపై కవాతు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వీరంతా తమ రాష్ట్రాల సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా జర్దోసీ కళ అద్దిన ప్రత్యేకమైన యూనిఫాంని.. మేవాడ్‌ రాజసం ఉట్టిపడేలా తలపాగాలు ధరిస్తారు. ఈ పెరేడ్‌ కోసం మూడునెలలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు వీరంతా.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్