ఆ నరకయాతన.. వ్యాపారవేత్తగా మార్చింది!

ఈ రోజుల్లో చాలా అంకుర సంస్థలు వివిధ సమస్యలకు పరిష్కారంగా పుట్టుకొస్తున్నాయి. ఒడిశాకు చెందిన సుమోన కర్జీ మిశ్రా కూడా గర్భధారణ సమయంలో తనకెదురైన సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కోసం ఓ అంకుర సంస్థను నెలకొల్పారు. ఆమె గర్భం ధరించిన 25 వారాల వరకు సాధారణంగా....

Published : 02 Feb 2023 20:56 IST

(Photos: Screengrab)

ఈ రోజుల్లో చాలా అంకుర సంస్థలు వివిధ సమస్యలకు పరిష్కారంగా పుట్టుకొస్తున్నాయి. ఒడిశాకు చెందిన సుమోన కర్జీ మిశ్రా కూడా గర్భధారణ సమయంలో తనకెదురైన సమస్యకు పరిష్కారం కనుక్కోవడం కోసం ఓ అంకుర సంస్థను నెలకొల్పారు. ఆమె గర్భం ధరించిన 25 వారాల వరకు సాధారణంగానే ఉన్నా మూడు రోజుల్లోనే పరిస్థితులు మారాయి. నెలలు నిండక ముందే బిడ్డకు జన్మనిచ్చారు. ఆ పసికందు దాదాపు 45 రోజుల పాటు ఎన్‌ఐసీయూలో ఉంది. ఆ సమయంలో తల్లీబిడ్డలిద్దరూ నరకయాతన అనుభవించారు. కానీ దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రీఎక్లాంప్సియానే తన పరిస్థితికి  కారణమని గుర్తించారు. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ప్రాంతేయి’ అనే అంకుర సంస్థను నెలకొల్పి ప్రీఎక్లాంప్సియాతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే వివిధ వైద్య పరికరాలను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో 2022కి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేషనల్‌ స్టార్టప్‌ అవార్డ్స్‌’లో ఆమె సంస్థ స్థానం సంపాదించుకుంది.

మూడు రోజులు నరకయాతన...!

ఒడిశాకు చెందిన సుమోన కర్జీ మిశ్రా మైక్రో బయాలజీలో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ చేశారు. ఆ తర్వాత ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పొందారు. ఆ తర్వాత నుంచి వివిధ రకాల వైరస్‌లు, అవి మానవ రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి.. వంటి వివరాలపై అధ్యయనం చేశారు. ఆమె సార్స్ వైరస్‌పై కూడా పలు పరిశోధనలు చేశారు. వాటికి సంబంధించిన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. మిశ్రా తన పీహెచ్‌డీ క్లాస్‌మేట్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గర్భం దాల్చారు. అప్పటివరకు ఆమె వృత్తిగత, వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతోన్న సమయంలో అనుకోని ప్రమాదం ఎదురైంది. గర్భం ధరించిన ఏడు నెలల వరకు ఆరోగ్యంగా ఉన్న ఆమె ఒకరోజు విపరీతమైన తలనొప్పి, శరీరమంతా వాపు లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. దాంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లడంతో డాక్టర్లు బీపీ ఎక్కువగా ఉందని, యూరిన్‌లో ప్రొటీన్లు అధికంగా ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత మూడు రోజులు నరకయాతన అనుభవించిన మిశ్రాకు సిజేరియన్‌ చేసి పాపను బయటకు తీశారు. పాప పుట్టినప్పుడు కేవలం 960 గ్రాములు మాత్రమే ఉంది. దాంతో 45 రోజుల పాటు ఎన్‌ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది. అలా తల్లీబిడ్డలిద్దరూ మృత్యువుతో పోరాడి విజయం సాధించారు.

అయితే వృత్తిరీత్యా మైక్రోబయాలజిస్ట్‌ అయిన మిశ్రా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ప్రీఎక్లాంప్సియానే తన పరిస్థితికి కారణమని తెలుసుకున్నారు. మనదేశంలో ప్రతి ఏటా చాలామంది గర్భిణులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నారు. దాంతో ఇందుకు ఒక పరిష్కారం కనుగొనాలని భావించారు.

‘ప్రాంతేయి’తో పరికరాలు..

మిశ్రా తన ఆలోచనను ఆచరణలో పెట్టడం కోసం ‘ప్రాంతేయి’ అనే అంకుర సంస్థను 2015లో నెలకొల్పారు. దీని ద్వారా గర్భిణులకు ఎదురయ్యే ప్రీఎక్లాంప్సియా వంటి సమస్యలను ముందుగానే గుర్తించే పరికరాన్ని రూపొందించాలనుకున్నారు. ఇందుకోసం ఎంతోమంది మహిళలు, గైనకాలజిస్టులను సంప్రదించి సంబంధిత వివరాలను సేకరించారు. అలాగే ఆన్‌లైన్‌లో కూడా శోధించారు. ఈక్రమంలో యూరిన్‌లో ప్రొటీన్లు పెరగడం వల్ల ప్రీఎక్లాంప్సియా సమస్య వస్తుందని గుర్తించారు. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తించడానికి ProFlo-U అనే పరికరాన్ని అభివృద్ధి చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ పరికరం ద్వారా కేవలం ప్రీఎక్లాంప్సియాని మాత్రమే కాకుండా కిడ్నీకి సంబంధించిన పలు సమస్యలను సైతం ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. తద్వారా తగిన నివారణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

కొవిడ్‌కు సంబంధించి...

మిశ్రా ‘ప్రాంతేయి’ ద్వారా కేవలం ProFlo-U మాత్రమే కాకుండా నానోసెన్సార్‌లను ఉపయోగించి ఐరా, ఐరా సెన్స్‌ అనే పరికరాలను కూడా అభివృద్ధి చేశారు. వీటి ద్వారా పలు ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు. ఇవే కాకుండా కరోనా సమయంలో వైరస్‌ను గుర్తించేందుకు ఎంబార్గో అనే కిట్‌ను కూడా రూపొందించారు. అంతేకాకుండా ఈ పరికరాలకు పేటెంట్‌ హక్కులను కూడా పొందారు. ఈ క్రమంలో తన ఆలోచనలకు మద్దతునిచ్చి ఈ పరికరాలను రూపొందించడానికి పలు సంస్థలు ఫండింగ్‌ చేశాయని అంటున్నారు మిశ్రా. అయితే అప్పటివరకు ఒక విద్యావేత్తగా రాణించాలనుకున్న తనకు జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలు తన లక్ష్యాన్ని, ఆలోచనను మార్చేశాయని; ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగడానికి దోహదం చేశాయని చెబుతారు మిశ్రా. ఈ క్రమంలో ఆమె పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్