కుంగుబాటు అమ్మల కోసం

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లికెదురయ్యే ప్రతి అనుభవమూ, బాధ్యతా కొత్తదే. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే  క్రమేపీ అది కుంగుబాటుగా మారుతుంది.  ఈ పరిస్థితే 38 ఏళ్ల ప్రియాంక కపూర్‌కూ ఎదురైంది.

Updated : 11 Mar 2023 06:00 IST

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లికెదురయ్యే ప్రతి అనుభవమూ, బాధ్యతా కొత్తదే. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే  క్రమేపీ అది కుంగుబాటుగా మారుతుంది.  ఈ పరిస్థితే 38 ఏళ్ల ప్రియాంక కపూర్‌కూ ఎదురైంది. దీంట్లోంచి బయటపడిన ఆమె తనలా మరో తల్లి కాకూడదని భావించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారామె. అంతేకాదు, ప్రసవానంతరం తిరిగి కెరియర్‌ ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నారు.

పుట్టి పెరిగిందంతా ప్రియాంక దిల్లీలోనే. 2007లో పెళ్లైన తర్వాత అత్తింటివారుండే వడోదరకొచ్చారు. కొత్తప్రాంతం, వాతావరణంలో సెటిల్‌ అవడానికి మూడునాలుగేళ్లు పట్టింది.  2012లో పాపకు జన్మనిచ్చిన తర్వాత ప్రియాంకకు కొత్త బాధ్యతలు మొదలయ్యాయి.  ‘ప్రసవం తర్వాత పాపతోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది. మనసులో ఏదో భయం. ఓ పట్టాన నిద్రపట్టేది కాదు. తిండిపై ఆసక్తి తగ్గి అలసట పెరిగింది. హార్మోన్లలో మార్పుతో బరువూ పెరిగిపోయా. ఎవరినీ కలవలేకపోవడం, బయటికి వెళ్లకపోవడంతో నాలో ఒత్తిడి మొదలయ్యింది. అకారణంగా కోపం, అంతలోనే దుఃఖం వచ్చేవి. నా సమస్యను ఎవరితోనూ చెప్పుకోలేకపోయేదాన్ని. ప్రసవం తర్వాత ఇటువంటి మార్పులు సహజమేనా అనిపించింది. మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో దీని గురించి చదివినప్పుడు బాలింతగా నేను కుంగుబాటుకు గురయ్యానని అర్థమైంది. బయటపడటానికి ప్రయత్నించా. పాప నిద్రపోయాక నా కోసం కొంత సమయాన్ని కేటాయించుకొనేదాన్ని. నచ్చిన పుస్తకాలు చదవడం, పోషకాహారం తీసుకోవడం, చిన్నచిన్న వ్యాయామాలు చేయడం మొదలుపెట్టా. పాపను ప్లేస్కూల్‌లో వేసి, నాలాంటి తల్లులున్నారేమో తెలుసుకోవడానికి ఇరుగుపొరుగుని కలిసేదాన్ని. చాలామందిలో ఈ సమస్య కనిపించింది. కొందరు తామే స్థితిలో ఉన్నామో కూడా గుర్తించలేకపోవడం బాధనిపించింది. దాంతో వడోదర అంతా తిరిగి వందలాదిమంది తల్లులను కలుసుకుని ఓ సర్వే చేశా. తర్వాతే అందరికీ అవగాహన కలిగించాలనిపించింది’ అంటారు ప్రియాంక.


అమ్మలను చేర్చి..

2018లో ‘మామ్స్‌ ఆఫ్‌ వడోదర’ పేరుతో 15 మంది సభ్యులతో ఫేస్‌బుక్‌ గ్రూపుని ప్రారంభించారు ప్రియాంక. ‘తల్లులందరికీ ఇందులో సభ్యత్వం ఉంటుంది. అమ్మలెవరైనా సరే... తాము ఎదుర్కొనే సవాళ్లు, వాటికి పరిష్కారాలు వంటివన్నీ ఇందులో చర్చించొచ్చు. వాటిని తెలుసుకున్నప్పుడు తమలాంటి సమస్య చాలామందికి ఉందనే భావన ఆ తల్లిని ఒంటరితనం, కుంగుబాటు వంటివాటి నుంచి బయటపడేస్తాయి. తల్లీబిడ్డకొచ్చే అనారోగ్యాలు, హెల్త్‌ చెకప్‌లు, ఫిట్‌నెస్‌ వంటి చర్చలు వారిని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేలా చేస్తాయి. అంతేకాదు, సాహసక్రీడల్లాంటివి ఏర్పాటు చేసి అందులో మాతృమూర్తులు పాల్గొనేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నా. ‘మి టైం’ పేరుతో స్వయం ఉపాధి అవకాశాలపై సందేహాలూ, సూచనలు అందిస్తున్నా. ఈ బృందంలో  వేలమంది తల్లులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో అయిదువేలమందికిపైగా మహిళలు ప్రసవం తర్వాత వ్యాపారవేత్తలు, ఉద్యోగినులుగా మారారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్