శారద తోడుగా.. లక్షమందికి చదువు!

నాన్న నుంచి అలవరుచుకొన్న సేవా భావంతో.. డిగ్రీ చదువుతూనే పేదల కోసం పాఠశాల ప్రారంభించారామె. 26 ఏళ్ల పాటు ఆ విద్యాయజ్ఞాన్ని కొనసాగించారు. అనారోగ్యం పాలై.. కోమాలోకి వెళ్లినా... కోలుకుని సేవాపథంలోనే కొనసాగుతున్నారు నూకల పద్మావతి.

Updated : 22 Dec 2022 07:52 IST

నాన్న నుంచి అలవరుచుకొన్న సేవా భావంతో.. డిగ్రీ చదువుతూనే పేదల కోసం పాఠశాల ప్రారంభించారామె. 26 ఏళ్ల పాటు ఆ విద్యాయజ్ఞాన్ని కొనసాగించారు. అనారోగ్యం పాలై.. కోమాలోకి వెళ్లినా... కోలుకుని సేవాపథంలోనే కొనసాగుతున్నారు నూకల పద్మావతి. లక్ష మందికి విద్యాదానం చేసిన ఈ స్ఫూర్తిప్రదాత తన సేవా ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా...

ప్రస్తుత పల్నాడు జిల్లా వినుకొండ మా సొంతూరు. అప్పట్లో అక్కడ అంతగా సదుపాయాలుండేవి కావు. మేం ఐదుగురు సంతానం. అన్నయ్య తర్వాత నేను. నాన్న అన్నపురెడ్డి కోటేశ్వర్రావు కమ్యూనిస్టు భావజాలమున్న వ్యక్తి. విద్యార్థి సంఘాలతో కలిసి పనిచేశారు. ఆర్‌ఎమ్‌పీ డాక్టర్‌గా ఎంతో మంది పేదలకు అండగా నిలిచారు. ఆయన ప్రభావం నాపైనా, అన్నయ్యపైనా ఎక్కువ. దీనికి తోడు మిషనరీ స్కూల్లో చదువుకున్నా. వీటన్నింటివల్లా చిన్నతనం నుంచే పేదలకు ఏదో చేయాలన్న తలంపు బలంగా ఉండేది. పదో తరగతి చదువుతున్నప్పుడే.. చుట్టుపక్కల పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పేదాన్ని. నా సేవాభావం చూసి అక్కడి మసీదులో కొంత జాగా అద్దెకిచ్చి.. పాఠాలు చెప్పుకొమ్మన్నారు. అలా డిగ్రీ కొచ్చేసరికి.. ట్యూషన్లు కాకుండా ఏకంగా శారదా ఎడ్యుకేషనల్‌ సొసైటీని ప్రారంభించి.. ఉచితంగా చదువునందించడం మొదలుపెట్టా. నాన్న స్నేహితులొకరు ప్రిన్సిపల్‌గా వ్యవహరించేవారు. ఇవన్నీ చేస్తూనే ఎమ్మే పొయెట్రీ, ఎమ్మే తెలుగు పూర్తిచేశా. ఐదో తరగతివరకూ ఉన్న శారదా పాఠశాలని జూనియర్‌ కాలేజీగా విస్తరించా. ఆంగ్ల మాధ్యమంలో చదవడం కోసం పిల్లలు దూరాలు వెళ్తుంటే.. చూడలేక శారదా కాన్వెంట్‌ పేరుతో ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌నీ ప్రారంభించా. దీనికి నామమాత్రపు ఫీజులు ఉండేవి. వినుకొండ చుట్టుపక్కల గిరిజన గ్రామాలుండేవి. ద్విచక్రవాహనంపై ఆ ఊళ్లన్నీ తిరిగి అక్కడి పరిస్థితులు తెలుసుకుని పిల్లలకోసం ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ని మొదలుపెట్టా. కొన్నాళ్లు అంగన్‌వాడీల మాదిరిగా శారదా క్రచ్‌ సెంటర్లనీ నిర్వహించా.

చిన్నపిల్లలకు ఉచితంగా పోషకాహారాన్ని అందించేవాళ్లం. ఇవన్నీ చేయడానికి మా అన్నయ్య రవికుమార్‌, మావారు ఉదయ్‌శంకర్‌ అన్ని విధాలుగా అండగా ఉన్నారు. ఇద్దరూ న్యాయవాదులు. మా విద్యార్థులు చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ రాణించే వారు. ఒక సారి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు స్పోర్ట్స్‌ మీట్‌ జరిగింది. అందులో మా స్కూల్‌ ప్రతి పోటీలోనూ కప్‌ గెలుచుకుంది. దీంతో అక్కడికి అతిథిగా వచ్చిన కలెక్టర్‌ సొసైటీ అభివృద్ధి పనుల కోసం ఐదు ఎకరాలు ఇచ్చారు. ఈ స్థలాన్ని అక్కడే ఉంటున్న పేదలకు నివాస స్థలాలుగా పంచాం. అలాగే నడిచుంటే బాగుండేది. కానీ అన్నయ్య, మావారు నాకు దూరమయ్యారు. ఆ బాధతోనే నాకు బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చింది. ఆర్నెల్లు కోమాలో ఉండి బయటకొచ్చా. దాంతో 26 ఏళ్ల పాటు సాగించిన విద్యా యజ్ఞంలో లక్ష మందికి పైగా పేద పిల్లలకు చదువు చెప్ప గలిగామన్న తృప్తితో... బాధ్యతల్ని సిబ్బందికే అప్పగించేసి చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చా.


సేవే సాంత్వన...

ఆత్మీయుల మరణాలు నన్ను బాగా కుంగదీశాయి. అది గమనించిన వైద్యులు ‘ఇన్నాళ్లూ సేవా మార్గంలోనే ఉన్నారుగా... ఇకపైనా ఆ దారిలోనే నడవండి త్వరగా కోలుకుంటార’న్నారు. అలా 2012లో హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌కు వచ్చా. గమనిస్తే అక్కడ బతుకు దెరువు కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వలసజీవులే కనిపించారు. వాళ్లకు సరైన ఉపాధి దొరికేది కాదు. అందుకే వీళ్లకు నైపుణ్యాలు అందిస్తే బాగుంటుందనిపించింది. వివిధ ప్రభుత్వ సంస్థల సాయంతో అక్కడి మహిళలకు కుట్లు, అల్లికలు, బ్యుటీషియన్‌, టైలరింగ్‌, కంప్యూటర్‌ కోర్సుల్లో శిక్షణ మొదలు పెట్టా. ఈ పదేళ్లలో 8000 మందికి పైగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. కొందరు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుంటే.. చాలామంది స్వయం ఉపాధితో రాణిస్తున్నారు. ఎన్నిచేసినా నా దృష్టంతా చదువుపైనే ఉంటుంది. అందుకే అమ్మానాన్నల పేరుతో జవహర్‌ నగర్‌లో కేఎస్‌ పాఠశాల ప్రారంభించి ఉచితంగా చదువు, పోషకాహారం అందిస్తున్నా. లాక్‌ డౌన్‌లోనూ సేవా కార్యక్రమాలు చేశా. ఆ తర్వాతా ఫిజియోథెరపీ కేంద్రాన్ని తెరిచి పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నా. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే సొంత భవనంలో మరింత మందికి సేవ అందేలా కార్యక్రమాలు సాగించాలనుకుంటున్నా. నేనున్నా లేకున్నా ఈ ట్రస్టు నిర్విరామంగా కొనసాగాలన్నదే నా ఆకాంక్ష.


- సంతోష్‌రెడ్డి, హైదరాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్