ఆకలితో వచ్చాం...అన్నం పెడుతున్నాం!

జననీ జన్మభూమిశ్చ అంటారు... అలాంటి పుట్టినూరినీ, నేలనీ విడిచి.. ప్రాణాలు గుప్పిట పట్టుకుని, పసిపిల్లలతో, ఖాళీ కడుపులతో శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులు వారంతా!

Updated : 13 Jan 2023 07:21 IST

జననీ జన్మభూమిశ్చ అంటారు... అలాంటి పుట్టినూరినీ, నేలనీ విడిచి.. ప్రాణాలు గుప్పిట పట్టుకుని, పసిపిల్లలతో, ఖాళీ కడుపులతో శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థులు వారంతా! ఆకలి విలువ వీళ్లకంటే ఎవరికి ఎక్కువ తెలుసు? అందుకేనేమో చవులూరించే తమ శ్రీలంక రుచులతో అందరి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారీ మహిళలు. దేశంలో ‘తొలి రెఫ్యూజీ  రెస్టరంట్‌’ని నిర్వహిస్తున్న మహిళల విశేషాలివీ..

వేడివేడి ఇడియాప్పం.. జోడీగా మటన్‌కూర పుట్టు, కొబ్బరిపాలు, ఉల్లిపాయలు, నిమ్మరసంతో చేసిన సోధీ వంటకం, ఆ పక్కనే కొబ్బరిపాలతో హల్వా ఇలా చెప్పుకొంటూ పోతే సీఫుడ్‌,  చికెన్‌ వెరైటీలూ కలిపి 30రకాల వంటకాలు ఉంటాయి. వేటి ఘుమఘుమలు వాటివే. ఎర్ర బియ్యంతో చేసిన వంటకాలు మరీ ప్రత్యేకం. ఇంతకీ ఈ రెస్టరంట్‌ ఎక్కడా అంటారా? తమిళనాడు తూత్తుకుడి నగర పరిధిలోని శరణార్థుల శిబిరాల ప్రాంతంలో ఉంటుందీ ‘ఓలై పుట్టు’ రెస్టరంట్‌. శ్రీలంక సంప్రదాయ వంటకం పేరిది. పొరుగుదేశం శ్రీలంక నుంచి పొట్ట చేత పట్టుకుని, ఖాళీ కడుపులతో వచ్చి.. 11 మంది మహిళలు చేసిన చక్కని ప్రయత్నం ఇది.

వలస జీవితాల్లో వెలుగు...

కొన్నినెలల క్రితం తూత్తుకుడి సముద్రతీరంలో ఓ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. అందులో ఓ స్టాల్‌ని శరణార్థ మహిళలకు ఇచ్చారు. వాళ్లు చేసిన వంటకాల రుచులకు ఫిదా అయిన సీఎం స్టాలిన్‌ సోదరి, ఎంపీ కనిమొళి..  ‘ఈ రుచులు భలే ఉన్నాయి. శిబిరాల్లో వీరిచేతే రెస్టరంట్ తెరిపిస్తే బాగుంటుంది’ అన్నారు. అనుకుందే తడవు ఓ భవనం నిర్మితమైంది. రెస్టరంట్ పెట్టడానికి కావాల్సిన నిధులని యునైటెడ్‌ నేషన్స్‌ హై కమిషనర్‌ ఫర్‌ రెఫ్యూజీ (యూఎన్‌హెచ్‌సీఆర్‌) అందించింది. శరణార్థుల హక్కుల కోసం పోరాడే ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఈలం రెఫ్యూజీస్‌ రిహాబిలిటేషన్‌ (ఆఫర్‌)’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించి.. ప్రతిభ చూపిన 11మందిని రెస్టరంట్ నిర్వహణ కోసం తీసుకున్నారు. ప్రముఖ చెఫ్‌లతో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

తెగించారు.. సాధించారు..

ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ క్షణం తీరిక లేకుండా ఉంటారు ఓలైపుట్టుని నిర్వహించే మహిళలు. వంటలు, వడ్డింపు, నిర్వహణ వ్యవహారాలన్నీ సమర్థంగా చూస్తూ, అతిథులకు ఏ లోటూ రాకుండా చేస్తున్నారు వీరికి నాయకత్వం వహిస్తున్న వాసంతీ కోకిలాదాసన్‌. ‘1999లో తప్పనిసరి పరిస్థితుల్లో మాదేశం విడిచి రావాల్సి వచ్చింది. ఇక్కడికొచ్చాకే పెళ్లి చేసుకున్నా. ముగ్గురు పిల్లలు. వాళ్ల పోషణ కోసం శరణార్థుల శిబిరంలోనే ట్యూషన్లు చెప్పేదాన్ని. వచ్చే రూ.5వేలు సరిపడక ఇబ్బంది పడుతున్నప్పుడే మాకీ అవకాశం వచ్చింది. మా సత్తా నిరూపించుకోగలుగుతున్నాం’ అంటారామె సంతోషంగా. ‘శ్రీలంక నుంచి వచ్చేటప్పుడు నా ఒడిలో 9నెలల బిడ్డ ఉంది. పడవ సముద్రం మధ్యలో ఉండగా తోటివారు మమ్మల్ని వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలు మమ్మల్ని రామేశ్వరం సమీపంలోని శిబిరానికి తరలించాయి. ఆకలితో, భయంతో.. పసిబిడ్డని ఎత్తుకుని బిక్కుబిక్కుమంటూ వచ్చా. ఎన్నో రోజులు అన్నమే దొరకలేదు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్న రోహిణి ఇప్పుడెంతో మందికి ఆకలి తీరుస్తున్నారు. ఇంచుమించు ఇలాంటి గాథలే కృష్ణవేణి, కావేరీ, గౌరి, భువనవి కూడా. ‘రాష్ట్రవ్యాప్తంగా.. 102 క్యాంపుల్లో 59వేల మంది శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. వీళ్లని చూసిన చాలామంది మాకూ అటువంటి అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు. వారికి అండగా ఉండేందుకు అన్ని క్యాంపుల్లోనూ ఇలాంటి రెస్టరంట్లను మహిళలతోనే తెరిపించనున్నాం’ అంటున్నారు శరణార్థుల కోసం పనిచేస్తున్న ఆఫర్‌ సంస్థకు చెందిన రత్నరాజసింగం.


ఇదీ ప్రత్యేకం

ఇక్కడ ఎర్రబియ్యంతో చేసిన శ్రీలంక, భారతీయ వంటకాలని ప్రత్యేకంగా వండి వారుస్తారు. ప్రభుత్వ ధరలకే టిఫిన్‌, రెండుపూటలా భోజనాలు అందిస్తున్నారు. నాణ్యత, రుచి కోసం... మిరపపొడి, మసాలాలు వంటివి బయట నుంచి కొనకుండా స్వయంగా తయారు చేస్తున్నారు. స్వయం సహాయ బృంద సభ్యులుగా ఉన్న వీరంతా రోజుకు రూ.15వేల దాకా సంపాదిస్తున్నారు.

- హిదాయతుల్లాహ్‌.బి, ఈనాడు, చెన్నై

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్