ఆ హీరోలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశా..!

కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ల డ్రస్సులు చూసి అబ్బా ఎంత బాగున్నాయో.. మనం కూడా అలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటాం.. చిత్రాలలో నాయికానాయకులు అందంగా కనిపించడంలో కాస్ట్యూమ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో డిజైనింగ్‌పై మక్కువ, నైపుణ్యంతో తన సోదరుడితో....

Published : 19 Feb 2023 13:01 IST

కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ల డ్రస్సులు చూసి అబ్బా ఎంత బాగున్నాయో.. మనం కూడా అలా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటాం.. చిత్రాలలో నాయికానాయకులు అందంగా కనిపించడంలో కాస్ట్యూమ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో డిజైనింగ్‌పై మక్కువ, నైపుణ్యంతో తన సోదరుడితో కలిసి హైదరాబాద్ వేదికగా ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను నెలకొల్పిన మౌన గుమ్మడి.. తన డిజైనింగ్ స్టైల్స్, ప్రత్యేకతలతో అనతికాలంలోనే సెలబ్రిటీ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇటు ప్రత్యేకంగా పురుషుల కోసం దుస్తులు రూపొందిస్తూనే.. మరోవైపు వరుస సినిమా అవకాశాల్నీ అందుకుంటోన్న మౌన.. తన ‘హీలో డిజైన్’ ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

మాది హుజూరాబాద్‌. ముంబయి పెర్ల్ అకాడమీ నుంచి ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో పీజీ పూర్తి చేశాను. ఆపై కొన్నాళ్ల పాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో ఫ్రీలాన్సర్‌గా పనిచేశాను. ఈ క్రమంలో డిజైనింగ్‌పై మరింత పట్టు పెరిగింది. ఈ రంగంలో ఏదైనా చేయగలనన్న ఆత్మవిశ్వాసం కలిగింది. దీనికి తోడు నాకు చిన్న వయసు నుంచే వ్యాపారమంటే మక్కువ. అందుకే ‘నాకున్న డిజైనింగ్‌ నైపుణ్యాలతో ఫ్యాషన్‌ వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించకూడదు?’ అనుకున్నా. ఈ ఆలోచనే మా అన్నయ్య సాహిత్‌తో కలిసి ‘హీలో డిజైన్’ పేరుతో ఓ మెన్స్‌ వేర్‌ బ్రాండ్‌ను ప్రారంభించడానికి ఊతమిచ్చింది. ‘హీలో’ అంటే స్పానిష్‌లో దారం అని అర్థం.

మెన్స్‌ వేరే ఎందుకంటే..?

ప్రస్తుతం మార్కెట్లో దుస్తుల విషయంలో అమ్మాయిలకు ఉన్నన్ని ఆప్షన్స్‌, డిజైన్స్‌, స్టైల్స్‌ అబ్బాయిలకు లేవనే చెప్పాలి. అందులోనూ అబ్బాయిల దుస్తుల్లో ఇండియన్‌ బ్రాండ్స్‌ చాలా తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకొనే పూర్తిగా మెన్స్‌ వేర్‌ ఫ్యాషన్‌ లేబుల్‌ని తీసుకొచ్చాం. మాది ఎథ్నిక్‌ బ్రాండ్‌. మా వద్ద అబ్బాయిల కోసం కుర్తాస్‌, పట్టు సెట్స్, షేర్వాణీ, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ షర్ట్స్‌, ప్రింటెడ్‌ షర్ట్స్‌, నెహ్రూ జాకెట్ సెట్స్‌, బంద్‌ గాలా.. ఇలా విభిన్న రకాలైన సంప్రదాయ దుస్తులు దొరుకుతాయి. అలాగే ప్రత్యేక సందర్భాల కోసం చెప్పులు.. వంటి మ్యాచింగ్‌ యాక్సెసరీస్‌ కూడా ఆర్డర్‌పై తయారుచేసిస్తున్నాం. ప్రస్తుతం మా ఫ్యాషన్‌ బ్రాండ్‌కు సంబంధించిన డిజైనింగ్‌, ఫొటోషూట్‌, క్యాటలాగింగ్‌, ప్రొడక్షన్‌.. వంటి పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. బిజినెస్‌, మార్కెటింగ్‌, వెబ్‌సైట్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ మా అన్నయ్య చూసుకుంటున్నాడు.

సెలబ్రిటీ డిజైనర్‌గా..!

కేవలం మా బ్రాండ్‌కి ఫ్యాషన్‌ డిజైనర్‌గా వ్యవహరించడమే కాదు.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గానూ నాకు సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి. మా బ్రాండ్‌ ప్రారంభించిన ఏడాది లోపే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో తొలి అవకాశం అందుకున్నా. అందులో హీరోహీరోయిన్లతో పాటు ఇతర నటీనటులకూ దుస్తులు రూపొందించా. ఆపై ‘డీజే టిల్లు’ సినిమాకూ దుస్తులు రూపొందించా. ఫ్యాషన్‌కు ప్రాధాన్యమిస్తూ సాగే ఈ చిత్రంతో నాకు మంచి గుర్తింపొచ్చింది. ఇక అందులో హీరో సిద్ధూ వేసుకున్న మిర్రర్ వర్క్ కుర్తా చూశాక ఎంతోమంది అబ్బాయిలు ‘మాకూ అలాంటిది కావాల’ని ఆర్డర్‌ చేశారు. అదొక గొప్ప అనుభూతి! ఇక ‘ఫరెవర్‌ మేబీ’ అనే మరో సినిమాకూ పనిచేశాను. త్వరలోనే విడుదల కానున్న ‘హిడింబ’ కోసం కూడా మేమే దుస్తులు రూపొందించాం. ఇలా సినిమాలతో పాటు యాడ్స్‌, పలు వెబ్‌సిరీస్‌లు, టీవీ షోలు, డ్యాన్స్‌ షోల కోసం కూడా కాస్ట్యూమ్స్ రూపొందించాం.

కార్తికేయకు నా వర్క్‌ నచ్చింది!

‘చావు కబురు చల్లగా’ సినిమా కోసం పని చేస్తున్నప్పుడే ఆ చిత్ర హీరో కార్తికేయతో పరిచయమైంది. ఆయనకు నా పనితనం నచ్చింది. దాంతో కార్తికేయకు పర్సనల్‌ స్టైలిస్ట్‌గానూ వ్యవహరించాను. ఈ క్రమంలో ఆయన మీటింగ్స్, ఫొటోషూట్స్‌ కోసం.. ఇలా వేర్వేరు సందర్భాల్లో విభిన్న దుస్తులు రూపొందించాం. ఆయన పెళ్లి వేడుకల్లోనూ డిజైనర్‌గా, పర్సనల్‌ స్టైలిస్ట్‌గా వ్యవహరించా.

ఇవే మా ప్రత్యేకతలు!

ప్రస్తుతం మార్కెట్లో అబ్బాయిలకు సంబంధించిన ఏ డ్రస్‌ చూసినా ధర ఎక్కువగా ఉంటోంది. ఇక ఎథ్నిక్‌ వేర్‌ గురించి చెప్పాల్సిన పనే లేదు. పైగా ప్రస్తుతం మార్కెట్లో అబ్బాయిల డిజైనర్‌ వేర్‌కీ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొనే ఎక్కువ డిజైనర్‌ ఆప్షన్స్‌ని, అందరికీ అందుబాటు ధరల్లో బ్రాండెడ్‌గా అందించడమే లక్ష్యంగా మా సంస్థ పనిచేస్తోంది. ఇక మా వద్ద ఉన్న ప్రత్యేకమైన ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఒకేసారి ఎక్కువమంది కస్టమర్స్‌ని ఎంగేజ్‌ చేయచ్చు. ఈ క్రమంలో వారి చర్మ ఛాయకు అనుగుణమైన రంగు, డిజైన్.. తదితర విషయాల్లో సలహాలివ్వడానికి ఈ డిజిటల్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలాగే వీడియో కాల్స్‌ ద్వారా కూడా కొలతల్ని నమోదు చేసుకునే సదుపాయం మా వినియోగదారులకు కల్పిస్తున్నాం.

భవిష్యత్తులో మరిన్ని!

ప్రస్తుతం మెన్స్‌ వేర్‌ కోసం పనిచేస్తోన్న మేము.. తదుపరి దశల్లో పిల్లలు, మహిళల కోసం దుస్తులు రూపొందించాలనుకుంటున్నాం. అలాగే నెలకు 50-100 కొత్త డిజైన్లు మా క్యాటలాగ్‌లో చేర్చేందుకూ ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం మా వెబ్‌సైట్‌తో పాటు కొన్ని ఆన్‌లైన్ వేదికల పైనా మా ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నాం. త్వరలోనే అమెజాన్‌, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌.. వంటి వేదికలకూ విస్తరించనున్నాం. మాకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ముంబయి, బెంగళూరు నుంచి కూడా ఆర్డర్స్‌ వస్తుంటాయి. యూఎస్‌కూ దుస్తులు డిజైన్‌ చేసి పంపిస్తున్నాం. ఇక త్వరలోనే బెంగళూరుకూ మా వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నాం. భవిష్యత్తులో మా సంస్థను బిలియన్‌ డాలర్‌ కంపెనీగా చేయాలన్నదే నా లక్ష్యం!

వీ-హబ్‌ సహకారం!

మా ప్రతిభకు గుర్తింపుగా కరోనా సమయంలో టీ-హబ్‌ నుంచి రూ. 4 లక్షల గ్రాంట్స్‌ అందాయి. 2020లో వీ-హబ్‌లోనూ ఇంక్యుబేట్‌ అయ్యాం. వ్యాపారాభివృద్ధికి సంబంధించిన మెలకువల్ని పెంచుకోవడంతో పాటు నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోవడానికీ ఈ వేదిక నాకు ఉపయోగపడింది. వీహబ్‌ సహకారంతోనే ‘నేను సూపర్‌ ఉమన్‌’ అనే మహిళా వ్యాపారవేత్తలకు సంబంధించిన రియాల్టీ షో ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశమొచ్చింది. ఇందులో భాగంగా కొన్ని రౌండ్స్‌ కూడా పూర్తిచేశాం. అలాగే ‘తెలంగాణ హ్యాండ్లూమ్‌ ఫ్యాషన్‌ షో’లో పాల్గొనే అవకాశం కూడా మాకు లభించింది.

స్వీయ నమ్మకం కావాలి!

వ్యాపారంలో నిలదొక్కుకునే క్రమంలో అడుగడుగునా ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. స్వీయ నమ్మకంతో వాటన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్లగలగాలి. మన ఆలోచనల్ని స్పష్టంగా, బలంగా మన పనితనంతో చూపగలగాలి. మరోవైపు కుటుంబ ప్రోత్సాహం, మద్దతూ ముఖ్యమే! ఈ విషయంలో నాకు మావారు, ఇతర కుటుంబ సభ్యులందరి ప్రోత్సాహం ఉంది. అందుకే ఎంచుకున్న రంగంలో రాణించగలుగుతున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్