తన బిడ్డ సమస్య ఆమెను థెరపిస్ట్‌ను చేసింది!

పిల్లలకు ఏ చిన్న అనారోగ్యం ఎదురైనా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటిది తన చిన్నారిలో వయసుకు తగ్గ మానసిక పరిణతి లేదని తేలితే.. ఆ అమ్మ పడే బాధ వర్ణనాతీతం! తన కొడుకు విషయంలో తానూ ఇలాంటి మనో వేదననే ఎదుర్కొన్నానని చెబుతున్నారు.....

Updated : 28 Oct 2022 19:17 IST

(Photos: Instagram)

పిల్లలకు ఏ చిన్న అనారోగ్యం ఎదురైనా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అలాంటిది తన చిన్నారిలో వయసుకు తగ్గ మానసిక పరిణతి లేదని తేలితే.. ఆ అమ్మ పడే బాధ వర్ణనాతీతం! తన కొడుకు విషయంలో తానూ ఇలాంటి మనో వేదననే ఎదుర్కొన్నానని చెబుతున్నారు జర్నలిస్ట్‌, రచయిత్రి గోపికా కపూర్‌. ఆటిజం సమస్య ఉన్న తన కొడుకును చూసి చలించిపోయిన ఆమె.. అందరు తల్లుల్లా బాధపడుతూ కూర్చోలేదు. తన కొడుకుతో పాటు ఇలాంటి బుద్ధిమాంద్యం ఉన్న చిన్నారులకు చేయూతనందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆటిజం థెరపిస్ట్‌గా అవతారం ఎత్తారు. మరోవైపు రచయిత్రిగానూ ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో, వాళ్ల తల్లిదండ్రుల్లో సమస్య పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్లే.. ఇలాంటి చిన్నారుల్నీ ఓపికతో దారిలోకి తెచ్చుకోవచ్చంటోన్న గోపిక తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

ముంబయిలో నివసించే గోపికా కపూర్‌కు వీర్‌, గాయత్రి.. అనే ఇద్దరు కవల పిల్లలు. కలిసి పుట్టినా వీరిద్దరిలో గాయత్రిలో ఎలాంటి లోపాలు లేవు.. కానీ వీర్‌కి మాత్రం మూడేళ్ల వయసులో ఆటిజం నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన గోపిక.. బాధపడుతూ కూర్చుకోవడం కంటే దీనికి పరిష్కార మార్గాలు వెతకాలనుకుంది. తద్వారా వీర్‌తో పాటు తనలాంటి ఇతర చిన్నారులకూ అండగా నిలవాలనుకున్నానంటోందామె.

ఆటిజంపై పోరాటం.. అలా మొదలైంది!

‘ఆటిజం.. ఈ పేరు విన్నప్పటికీ.. ఇది నా కుటుంబంలో ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే మా కుటుంబాల్లో ఎవరికీ ఈ సమస్య లేదు. కానీ నా కొడుకు వీర్‌కి మూడేళ్ల వయసులో ఈ సమస్య నిర్ధారణ అయింది. పిల్లల వైద్యులు ఈ విషయం చెప్తే ముందు నేను నమ్మలేదు.. కానీ వాడిలో వయసుకు తగ్గ మానసిక పరిణతి లేకపోవడం, మాట్లాడలేకపోవడం, కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోవడం, ఇతరులతో కలవకపోవడం.. ఇవన్నీ చూశాక విషయం అర్ధమైంది. దీంతో కొన్నాళ్లు బాధపడ్డా.. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య తగ్గదు.. పైగా విలువైన సమయం వృథా అవుతుందని గుర్తించిన నేను ఈ వ్యాధిపై చిన్నపాటి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే ‘ఉమీద్‌ పిల్లల అభివృద్ధి కేంద్రం’లో చేరాను. బుద్ధిమాంద్యం, మానసిక పరిణతి లేని చిన్నారుల అభివృద్ధికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థ ఇది. అక్కడి ఆటిజం ఇంటర్వెన్షన్‌ బృందంతో కలిసి సుమారు 10 ఏళ్ల పాటు పనిచేశాను..’ అంటూ ఆటిజంపై తన పోరాటాన్ని మొదలుపెట్టిన తీరును వివరించారు గోపిక.

వీర్‌ లాంటి పిల్లల కోసం..!

సుమారు దశాబ్దం పాటు ఈ సంస్థలో పనిచేసి అనుభవం గడించిన ఆమె.. ఈ క్రమంలో ఈ సమస్య గురించిన బోలెడన్ని విషయాలు అవపోసన పట్టారు. ‘ఒక సమస్యను దూరం చేసుకోవాలంటే.. ముందు దాన్ని అంగీకరించాలనేది నా నమ్మకం. ఆటిజం కూడా ఈ కోవలోకే వస్తుంది. తమ పిల్లల్లో ఈ సమస్య ఉందని తెలిసి చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేరు. బాధపడుతూ విలువైన కాలాన్ని వృథా చేస్తారు. దీనికి తోడు సమాజపు ఒత్తిళ్లు వారిని మరింతగా కుంగదీస్తాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా సరైన సమయంలో సమస్యను గుర్తించి చిన్నారులకు తగిన థెరపీలు అందిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అందుకే వీర్‌లాంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఈ భరోసా కల్పించాలనుకున్నా. ఉమీద్‌లో పనిచేసిన దశాబ్ద కాలంలో వందలాది మంది చిన్నారులకు వారి సమస్యకు తగిన థెరపీలు అందించాను. ముంబయి, దిల్లీ, గోవా, గుజరాత్‌, బంగ్లాదేశ్‌.. వంటి నగరాల్లో ఆటిజం సమస్యపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పలు నగరాల్లో ప్రత్యేకంగా కేర్‌గివర్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ సెషన్స్‌ ఏర్పాటుచేశాం..’ అంటూ చెప్పుకొచ్చారు గోపిక.

రచనలతోనూ అవగాహన..!

ఉమీద్‌తో పనిచేస్తూ ఆటిజం పిల్లల అభివృద్ధికి కృషి చేసిన గోపిక.. ఇదే క్రమంలో ఈ సమస్యపై మన దేశంలో సమగ్ర సమాచారం లేదని గుర్తించింది. ఇదే తనను 2020లో ‘Beyond the Blue: Love, Life and Autism’ అనే పుస్తకం రాయడానికి పురికొల్పిందంటోందామె.

‘ఒక జర్నలిస్ట్‌గా, ఆటిజంతో బాధపడే కొడుక్కి తల్లిగా.. నా అనుభవాలను ఓ పుస్తకంగా రాయాలనుకున్నా. నిజానికి ఇది ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితమైన సమస్య కాదు.. ప్రపంచంలో ఎంతోమంది చిన్నారులు బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. సమాజం నుంచి పలు విమర్శల్నీ ఎదుర్కొంటున్నారు. వారిలో, వారి తల్లిదండ్రుల్లో స్ఫూర్తి నింపాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ పుస్తకం రాశాను. పేరెంట్స్‌ కూడా ఇలాంటి చిన్నారుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. స్కూల్‌, సోషల్‌ యాక్టివిటీల్లో వారిని ప్రోత్సహించాలి. అలాగే వాళ్లడిగే ప్రశ్నలకు ఓపిగ్గా, వారికి అర్థమయ్యేలా సమాధానం చెప్పాలి. వారి పట్ల ఎంత ఓపికతో వ్యవహరిస్తే వారిలో అంత మార్పును మనం చూడగలుగుతాం.. ఇందుకు నా కొడుకు వీర్‌ ప్రత్యక్ష ఉదాహరణ..’ అంటోందీ థెరపిస్ట్‌ మామ్‌. గోపిక రాసిన ఈ పుస్తకం ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది.

ప్రస్తుతం ఆటిజం థెరపిస్ట్‌గా, న్యూరోడైవర్సిటీ కన్సల్టెంట్‌గా, పేరెంట్‌ అడ్వొకేట్‌గా, రచయిత్రిగా.. ఇలా భిన్న కోణాల్లో బుద్ధిమాంద్యం ఉన్న చిన్నారుల్లో, వారి తల్లిదండ్రుల్లో అవగాహన నింపుతోన్న గోపిక.. తన సేవలకు గుర్తింపుగా యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ నుంచి ‘విమెన్‌ అఛీవర్స్‌ అవార్డు’ అందుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్