అమెరికాలో 23 ఏళ్లకే ఆ గౌరవం సంపాదించింది!

‘దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది.. వారు రాజకీయాల్లోకొస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని, దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని’ అంటోంది భారతీయ-అమెరికన్‌ ముస్లిం మహిళ నబీలా సయద్. ఈ నమ్మకంతోనే ఓటు వేసి తనను గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని....

Published : 12 Nov 2022 19:22 IST

(Photos: Instagram)

‘దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది.. వారు రాజకీయాల్లోకొస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని, దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని’ అంటోంది భారతీయ-అమెరికన్‌ ముస్లిం మహిళ నబీలా సయద్. ఈ నమ్మకంతోనే ఓటు వేసి తనను గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయనంటోందామె. ఇటీవలే జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇల్లినాయిస్ 51 డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆమె.. ఆ రాష్ట్ర చట్టసభలోకి అడుగుపెట్టనున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రజా సంక్షేమం, మహిళల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానంటోన్న నబీలా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

అమెరికా ఇల్లినాయిస్ 51 డిస్ట్రిక్ట్లో భారతీయ మూలాలున్న ఓ కుటుంబంలో పుట్టి పెరిగింది 23 ఏళ్ల నబీలా సయద్. ఆమెకు చిన్నతనం నుంచే రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే అటు చదువు సాగిస్తూనే.. ఇటు సమాజ హితం కోరే పలు ప్రచార కార్యక్రమాల్లోనూ భాగమయ్యేది. క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆమె.. అదే సమయంలో స్థానిక వ్యాపారాలు, స్వచ్ఛంద సంస్థలకు సహాయమందించే కన్సల్టింగ్‌ సంస్థకు అధ్యక్షురాలిగా పనిచేసింది.

సేవే పరమావధిగా..!

డిగ్రీ తర్వాత పలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన ఆమె.. ప్రస్తుతం ‘సివిక్‌ నేషన్‌’ అనే ఎన్జీవోలో డిజిటల్‌ స్ట్రాటజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో కళాశాల క్యాంపస్‌లలో లైంగిక వేధింపుల్ని అంతమొందించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం.. వంటి అంశాలపై అందరిలో అవగాహన పెంచుతోంది. మరోవైపు హైస్కూల్‌ డిబేట్‌ కోచ్‌గా యువతకు శిక్షణనిస్తోంది. నార్‌్తవెస్ట్‌ సబర్బ్స్‌లోని ఇస్లామిక్‌ సొసైటీలోనూ క్రియాశీల సభ్యురాలిగా ఉన్న నబీలా.. ఈ క్రమంలో ముస్లిం యువతుల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇలా తాను చేస్తోన్న సేవా కార్యక్రమాలే ఆమెను ఇటీవలే జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో 51 డిస్ట్రిక్ట్‌ నుంచి పోటీ చేసేందుకు ప్రేరేపించాయని చెప్పచ్చు.

ఇంటింటికీ వెళ్లా.. మళ్లీ వెళ్తా!

ఈ ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన నబీలా.. రిపబ్లిక్‌ అభ్యర్థి క్రిస్‌ బోస్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో ఆమెకు 52.3 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రతినిధిగా నన్ను ప్రకటించిన మరుక్షణం నుంచి ప్రజలతో మమేకమవడం, వాళ్ల సమస్యల గురించి చర్చించడంపై ఎక్కువ దృష్టి పెట్టాను. ప్రిస్క్రిప్షన్‌ మందుల ధరల పెరుగుదల గురించి సీనియర్లతో చర్చించాను. నానాటికీ పెరుగుతోన్న ఆస్తి పన్నుల భారంపై కార్మిక కుటుంబాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నా. మహిళల వ్యక్తిగత ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి ఆరోగ్య సంరక్షణ హక్కును పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాను. తుపాకీ భద్రతా చట్టాలను బలోపేతం చేయాలని కోరుకుంటోన్న తల్లిదండ్రులతో చర్చలు జరిపాను. ఇలా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటి తలుపూ తట్టాను. వారి సమస్యల్ని పరిష్కరిస్తానని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని నేను చేసిన వాగ్దానంపై నమ్మకముంచి.. నన్ను గెలిపించినందుకు మరోసారి వారందరి ఇళ్లకు వెళ్లి వారికి కృతజ్ఞతలు చెప్పబోతున్నా. ఇల్లినాయిస్‌ జనరల్‌ అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తుల్లో నేనే పిన్నవయస్కురాలిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. నా లక్ష్యాల్ని, ప్రజలకు నేనిచ్చిన హామీల్ని నెరవేర్చడానికి వచ్చే ఏడాది జనవరిలో చట్ట సభలో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నా..’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది నబీలా.

ముక్కుసూటిగా.. నిర్మొహమాటంగా..!

తన సేవా కార్యక్రమాలతో ప్రజల మనిషిగా మన్ననలందుకున్న నబీలా.. మహిళలకు సంబంధించిన అంశాల పైనా స్పందిస్తుంటుంది. ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తుంటుంది. ఈ క్రమంలో ఓ సందర్భంలో హిజాబ్ సంప్రదాయం గురించి స్పందిస్తూ.. ‘హిజాబ్‌ ధరించడం, ధరించకపోవడం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం.. అది వారి హక్కు కూడా! మత విశ్వాసాల్ని ఒకరిపై రుద్దడం సరికాదు. హిజాబ్‌ ధరించాలని, ధరించకూడదని ఇతరులపై ఒత్తిడి తీసుకొచ్చే అధికారం ఏ ఒక్కరికీ లేదు. ఇక నా విషయానికొస్తే.. నాకు హిజాబ్‌ ధరించడమంటేనే ఇష్టం. దీన్ని నేను ఎంతో గౌరవంగా భావిస్తా..’ అంది నబీలా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్