కొరియన్ల అందం.. ఆమె వ్యాపార మంత్రం!

టీనేజ్‌లో మొటిమలు, మచ్చలు సహజం. అయితే చాలామంది విషయంలో కొన్నేళ్ల తర్వాత ఈ సమస్యలు తగ్గుముఖం పట్టి చర్మం సాధారణ స్థితిలోకి వస్తుంటుంది. కానీ తొయ్‌నలి చోఫీ విషయంలో అలా జరగలేదు.

Updated : 14 Feb 2024 12:44 IST

(Photos: Instagram)

టీనేజ్‌లో మొటిమలు, మచ్చలు సహజం. అయితే చాలామంది విషయంలో కొన్నేళ్ల తర్వాత ఈ సమస్యలు తగ్గుముఖం పట్టి చర్మం సాధారణ స్థితిలోకి వస్తుంటుంది. కానీ తొయ్‌నలి చోఫీ విషయంలో అలా జరగలేదు. పైగా మొటిమలు, మచ్చలు తగ్గకపోగా వయసు పెరిగే కొద్దీ కొత్త సమస్యలు పుట్టుకొచ్చేవి. ఇక అమ్మయ్యాకా సౌందర్య సంరక్షణలో మరిన్ని సవాళ్లు ఎదుర్కొందామె. వీటి నుంచి బయటపడే క్రమంలోనే కొరియన్‌ బ్యూటీ ఉత్పత్తుల్ని ఆశ్రయించిన ఆమె.. వీటిలో ఉన్న నాణ్యమైన సౌందర్య ప్రమాణాలు, సహజత్వం గురించి తెలుసుకుంది. వీటిని ఇక్కడి వారికి చేరువ చేయాలన్న ఆలోచనే ఆమె ప్రభుత్వోద్యోగం వదిలి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేందుకు కారణమైంది. ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ బ్రాండ్లతో పోటీ పడుతూ ఎంతోమందికి సహజ సౌందర్యాన్ని చేరువ చేస్తోన్న చోఫీ వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం రండి..

చోఫీది నాగాలాండ్‌లోని దిమాపూర్‌. చిన్న వయసు నుంచే చదువులో చురుగ్గా ఉండే ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కెరీర్‌లో స్థిరపడింది. చూడ్డానికి ఫెయిర్‌గా, అందంగా ఉండే ఆమెను టీనేజ్‌ నుంచే పలు సౌందర్య సమస్యలు ఇబ్బంది పెట్టేవి. అవి తన సహజ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటే ఒక రకమైన ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేదానన్ని చెబుతోందామె.

మొటిమలతో మొదలు!

‘చిన్నతనం నుంచి చాలామంది నన్ను క్యూట్‌ గర్ల్‌ అంటూ పిలిచేవారు.. ఈ అమ్మాయి ఎంత ఫెయిర్‌గా ఉందో అనేవారు. ఇక 13 ఏళ్లొచ్చాక నాకు మొటిమల సమస్య మొదలైంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమైందే తప్ప తగ్గలేదు. మొటిమలు ఎక్కువవడం, అవి పగలడం వల్ల ఒక్కోసారి ముఖాన్ని తాకలేని పరిస్థితి. దీంతో కాలేజీకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. బయటికి వెళ్లినప్పుడల్లా స్కార్ఫ్‌తో ముఖాన్ని కవర్‌ చేసుకునేదాన్ని. నాకున్న మొటిమల సమస్యను దూరం చేయడానికి మా అమ్మ ఎన్నో సహజ చిట్కాలూ ప్రయత్నించింది. మరోవైపు ఎంతోమంది చర్మ సంబంధిత నిపుణుల్ని సంప్రదించా.. మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులూ వాడాను. అయినా ఫలితం శూన్యం. ఈ సమస్యల మధ్యే చదువు పూర్తిచేశా.. ప్రభుత్వోపాధ్యాయురాలిగా ఉద్యోగమూ వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే పిల్లలు పుట్టాక ప్రసవానంతర ఒత్తిడి మరిన్ని సౌందర్య సమస్యల్ని తెచ్చిపెట్టింది. పిగ్మెంటేషన్‌, నల్ల మచ్చలు రావడం మొదలైంది. ఈ సమయంలోనే కొరియాలో స్థిరపడ్డ నా ఫ్రెండ్‌ ఒకరు కొరియన్‌ సౌందర్యోత్పత్తుల గురించి సలహా ఇచ్చింది. వాటిని వాడాకే తనలో మార్పు మొదలైందం’టోంది చోఫీ.

కె-బ్యూటీతో మార్పు!

మార్కెట్లో దొరికే ఏ ఉత్పత్తీ తన సౌందర్య సమస్యల్ని తగ్గించలేకపోయినా.. కొరియన్‌ ఉత్పత్తులతో మార్పు రావడం గమనించిన చోఫీ.. ఈ క్రమంలోనే వీటి గురించి, వీటి తయారీ గురించి ఆన్‌లోన్‌లో శోధించి తెలుసుకుంది. అప్పుడు అర్థమైందామెకు.. కె-బ్యూటీకి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత ఆదరణ లభిస్తుందో! ఇలా ఏడాది పాటు ఆ ఉత్పత్తుల్ని వాడిన ఆమెలో క్రమంగా మార్పు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్‌.. ఆ ఉత్పత్తులు తమకూ కావాలని అడిగేవారు. అప్పుడే ఇక్కడా కొరియన్‌ బ్యూటీ ఉత్పత్తుల అవసరం ఎంతగానో ఉందన్న విషయం అర్థమైందంటోందామె.

‘కొరియన్‌ సౌందర్య ఉత్పత్తులు వాడినప్పట్నుంచే నా చర్మ సమస్యలు తగ్గుముఖం పట్టడం గమనించా. అందుకే వీటి గురించి కాస్త లోతుగా పరిశోధన చేశా. వీటి తయారీలో వాడే నాణ్యమైన, సహజసిద్ధమైన పదార్థాలు ఎలాంటి చర్మతత్వానికైనా ఇట్టే నప్పుతాయన్న విషయం తెలుసుకున్నా. అలాగే ఈ సౌందర్యోత్పత్తులు చర్మానికి తేమనందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. చర్మాన్ని లోలోపలి నుంచి ఆరోగ్యంగా మార్చుతాయి. తద్వారా ఎలాంటి చర్మ సమస్యల నుంచైనా విముక్తి పొందచ్చు. అయితే నేను వాడే ఈ ఉత్పత్తుల వల్ల నా చర్మంలో మార్పు రావడం చూసి చాలామంది వీటి గురించి నన్ను అడిగేవారు. అప్పుడనిపించింది.. ఇక్కడా కె-బ్యూటీ ఉత్పత్తుల అవసరం ఎంతగానో ఉందని! ఈ ఆలోచనే 2016లో ‘బ్యూటీ బార్న్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభించేందుకు దోహదం చేసింది..’ అంటూ చెబుతోంది చోఫీ.

క్లెన్సింగ్‌ నుంచి మేకప్‌ దాకా!

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన కొరియన్ల సౌందర్య ఉత్పత్తుల్ని భారతీయులకు చేరువ చేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం! ఈ క్రమంలోనే దక్షిణ కొరియా వెళ్లి అక్కడి పలు బ్యూటీ బ్రాండ్స్‌తో కొన్నాళ్ల పాటు పనిచేసిన చోఫీ.. వాటిలో వాడే ఉత్పత్తులు, వాటి తయారీకి సంబంధించిన విషయాలపై లోతుగా అవగాహన పెంచుకుంది.

‘కరోనా ముందు వరకు మా వ్యాపారం సాధారణంగానే కొనసాగింది. వెతికితే ఇక్కడి మార్కెట్లో వాళ్ల బ్యూటీ ఉత్పత్తులు విక్రయించే వారూ తక్కువే! అందులోనూ ఆ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకొని వినియోగదారులకు అందించే కొన్ని సంస్థలు.. వారిపై పన్ను భారం అధికంగా మోపేవి. ఈ క్రమంలోనే చాలామంది వీటి గురించి ఆన్‌లైన్‌లో వెతికి నన్ను సంప్రదించేవారు. నేను ఆయా ఉత్పత్తుల్ని ఇక్కడే తయారుచేసి అందుబాటు ధరల్లోనే అందించడంతో వారిపై అదనపు భారం తప్పేది.. పైగా అక్కడి లాగే నాణ్యమైన ఉత్పత్తులు కావడంతో క్రమంగా ఆదరణా పెరిగింది..’ అంటోన్న చోఫీ.. తన సంస్థ వేదికగా విభిన్న కొరియన్‌ సౌందర్యోత్పత్తుల్ని ఇక్కడి వారికి చేరువ చేస్తోంది. క్లెన్సింగ్‌, ఎక్స్‌ఫోలియేటర్స్‌, టోనర్స్‌, సీరమ్స్‌, ఫేస్‌మాస్క్‌లు, హైడ్రేటింగ్‌ ఉత్పత్తులు, ఐక్రీమ్‌, మేకప్‌ ఉత్పత్తులు, మేకప్‌ టూల్స్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది. వీటిని అన్ని చర్మతత్వాలకు తగ్గట్లుగా నిపుణుల బృందంతో తయారుచేయిస్తోందామె. ప్రస్తుతం నెలకు పది వేల ఉత్పత్తుల దాకా ఆర్డర్లొస్తున్నాయంటోన్న చోఫీ.. ప్రముఖ దేశీ బ్రాండ్లతో పోటీ పడుతూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు దిమాపూర్‌లో రెండు అవుట్‌లెట్స్‌ని ఏర్పాటుచేసిన ఈ బిజినెస్‌ ఉమన్‌.. త్వరలోనే దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ స్టోర్స్‌ని తెరిచి తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు.. సోషల్‌ మీడియా వేదికగా కొరియన్‌ సౌందర్య చిట్కాలూ అందిస్తోంది చోఫీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్