గోళ్లకూ మసాజ్ కావాలి!

కొంతమందికి గోళ్లు పెంచడం అంటే ఎంతో ఇష్టం. గోళ్లు పెంచి, ఇష్టమైన నెయిల్ పాలిష్ వేసుకుని మురిసిపోతుంటారు. అయితే- ఎంత జాగ్రత్తగా పెంచినా ఒక్కోసారి గోళ్లలో ఇన్ఫెక్షన్లు, విరిగిపోవడం, పొడిబారడం.. ఇలాంటి సమస్యలు తప్పవు....

Published : 24 May 2024 12:29 IST

కొంతమందికి గోళ్లు పెంచడం అంటే ఎంతో ఇష్టం. గోళ్లు పెంచి, ఇష్టమైన నెయిల్ పాలిష్ వేసుకుని మురిసిపోతుంటారు. అయితే- ఎంత జాగ్రత్తగా పెంచినా ఒక్కోసారి గోళ్లలో ఇన్ఫెక్షన్లు, విరిగిపోవడం, పొడిబారడం.. ఇలాంటి సమస్యలు తప్పవు. ఈ క్రమంలో గోళ్ల సంరక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం.. వంటి పనులు చేసేటప్పుడు గోళ్లు ఎక్కువగా నీటిలో నానుతుంటాయి. ఫలితంగా త్వరగా నిర్జీవమై విరిగిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం మంచిది.
 గోళ్లను రోజుకోసారి మాయిశ్చరైజింగ్ లోషన్‌తో మసాజ్ చేయడం మర్చిపోవద్దు. ఫలితంగా రక్తప్రసరణ సరిగ్గా జరిగి అవి ఆరోగ్యంగా, దృఢంగా ఎదుగుతాయి. అంతేకాదు.. చేతులు కడుక్కున్న ప్రతిసారీ లోషన్ రాసుకోవడం మంచిది. తద్వారా గోళ్లకు తగినంత తేమ అందించిన వారవుతారు.
 బిగుతుగా ఉన్న డబ్బాల మూతలు తెరిచేందుకు, ఇతర కఠినమైన పనులు చేయడానికి కొంతమంది గోళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల గోళ్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పనులకు గోళ్లను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం.

 నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడల్లా దాన్ని తొలగించడానికి పాలిష్ రిమూవర్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే మీ గోళ్ల ఆరోగ్యాన్ని మీరే చేజేతులా పాడుచేస్తున్నారన్నమాట. ఎందుకంటే రిమూవర్‌లో ఉండే ఎసిటోన్ గోళ్లను పొడిబారేలా చేస్తుంది. కాబట్టి నెలకు రెండుసార్లకు మించి రిమూవర్ వాడకుండా జాగ్రత్తపడడం ఉత్తమం. అలాగే నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒకే కోట్ కాకుండా, డబుల్ కోటింగ్ వేయడం వల్ల గోళ్లు త్వరగా విరిగిపోకుండా జాగ్రత్తపడచ్చు.
 అటు శారీరక ఆరోగ్యం, ఇటు చర్మానికి మెరుపు అందించడంలో నీరు ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు.. గోళ్ల ఆరోగ్యానికి కూడా నీరు ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టి రోజూ ఎక్కువ మొత్తంలో నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. తద్వారా గోళ్లకు తేమ అంది.. అవి మరింత ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా తయారవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్