Taticherla Vijaya Durga: ఐదున్నర లక్షల మందిలో ప్రధాని మెచ్చిన విజయం

ఈ దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తిగాథనే అద్భుతమైన పాటగాకట్టి దేశం మనసు దోచారామె.

Published : 02 Mar 2023 00:10 IST

ఈ దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తిగాథనే అద్భుతమైన పాటగాకట్టి దేశం మనసు దోచారామె. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా  ఐదున్నర లక్షలమంది పాల్గొన్న పాటల పోటీలో మొదటి బహుమతిని గెలిచి ప్రధాని మెప్పు పొందారు నంద్యాల ఆడపడుచు తాటిచెర్ల విజయదుర్గ..

దివింది పదో తరగతే అయినా సమాజాన్ని లోతుగా అర్థం చేసుకున్నారామె. గుండెనిండా జాతీయభావాలు నింపుకొన్నారు. తండ్రీతాతల వారసత్వాన్ని అందుకొని గేయరచనలో తనదైన ముద్రవేసుకున్నారు విజయదుర్గ. ‘మా సొంతూరు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. నాన్న లింగాల వెంకటేశ్వర్లు వడ్రంగి. అమ్మ సుబ్బమ్మ గృహిణి. చిన్నతనం నుంచీ పుస్తకాలు బాగా చదివేదాన్ని. పదో తరగతిలో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేశారు. దీంతో 16 ఏళ్లకే కుటుంబ బాధ్యతలు మొదలయ్యాయి. అత్తింటి వారిది నంద్యాల జిల్లా గోస్పాడు. మావారు రత్నమయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన ప్రోత్సాహంతో ఖాళీ సమయంలో కవితలు రాసేదాన్ని. మనసు కదిలించే సంఘటనలు ఎదురైనప్పుడు వాటినే కవితలుగా అల్లడం అలవాటు చేసుకున్నా. ఇప్పటి వరకు 200లకు పైగా రాశా’ అంటారు విజయదుర్గ.

ఆ పుస్తకం చదివాక...

వ్యక్తిగత ఆసక్తితో సాహిత్య సభలు, సమావేశాలకు హాజరవుతుండే విజయదుర్గ బెంగళూరు విశ్వవిద్యాలయ ఆచార్యులు తంగిరాల సుబ్బారావు పరిచయమయ్యాక సాహిత్యంలో మరో అడుగు ముందుకు వేసే అవకాశం దొరికింది అంటారు. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం చదవమని ఆయనే సూచించారు. ‘రేనాటి సూర్యచంద్రులు’ అనే పుస్తకాన్ని ఇప్పించారు. ఆ పుస్తకం చదివాక నరసింహారెడ్డి నివసించిన ఉయ్యాలవాడ, రూపనగుడి గ్రామాలకు వెళ్లా. ఆయన పోరాట స్ఫూర్తి గురించి తెలుసుకుని ఓ చక్కటి గీతాన్ని రాసుకున్నా. కేంద్రం పోటీలు పెట్టడంతో నాకు చక్కని వేదిక దొరికినట్లైంది. నాడు రాసుకున్న దేశభక్తి గీతానికి మరిన్ని మెరుగులు దిద్ది పోటీకి పంపా. ఫిబ్రవరి ఐదో తేదీన విజేతలను దిల్లీకి పిలిపించారు. ఆ సందర్భంగా కేంద్ర సాంస్కృతికశాఖ ప్రదర్శించిన కార్యక్రమాల్లో భాగంగా నేను రాసిన దేశభక్తి గీతానికి చక్కని సంగీతం సమకూర్చి... నరసింహారెడ్డి పోరాట పటిమ కళ్లకు కట్టేలా నృత్యరూపకం ప్రదర్శించారు. అదే రోజు విజేతల్నీ ప్రకటించారు. 5.6 లక్షల మంది పాల్గొన్న ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో నేను రాసిన దేశభక్తి గీతానికి  ప్రథమ బహుమతి ప్రకటించారు. లాలిపాటల విభాగంలో రాష్ట్రస్థాయిలో మూడో బహుమతి వచ్చింది. ఇవన్నీ ఒకెత్తైతే ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని అభినందించడం చాలా సంతోషంగా అనిపించింది. మా పెద్దమ్మాయి సృజన ఎమ్మెస్సీ పూర్తిచేసింది. చిన్న అమ్మాయి ఎంటెక్‌ చేసింది. ఇద్దరికీ పెళ్లైంది. మనవళ్లతో ఆడుకోవడంతోపాటు ఖాళీ సమయాల్లో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నా’ అంటున్నారు విజయదుర్గ.


నాన్న స్ఫూర్తితో..

కవితలు అల్లడం, పుస్తకాలు రాయడం ఆమె రక్తంలోనే ఉన్నాయి. విజయదుర్గ తాత ఫణిభూషణాచారి వడ్రంగం చేస్తూ పద్యాలు, కథలు రాసేవారు. ఆధ్యాత్మిక విషయాలతో ‘భవానీ శంకర విజయం’ అనే పుస్తకాన్ని రచించారు. ‘చంద్రశేఖర విజయం’ పేరుతో మరో పుస్తకాన్ని రచించినా ముద్రించలేకపోయారు. ‘నాన్న లింగాల వెంకటేశ్వర్లు పాటలు, పద్యాలు ఎంతో బాగా పాడేవారు. అప్పుడప్పుడు హరికథలూ చెప్పేవారు. నాన్న పాడిన ఆ పాటలే నాకు సాహిత్యంపై అభిలాష కలిగించాయేమో. స్త్రీవాదం, ప్రజా చైతన్యం, ప్రకృతి, బాలల గేయాలు, దేశభక్తి గీతాలు, స్వాతంత్య్ర సమరయోధులపై కవితల్ని రాయడం మొదలుపెట్టా’ అనే విజయదుర్గ ఉగాది పురస్కారాన్ని, మాజీ గవర్నర్‌ వి.ఎస్‌.రమాదేవి చేతుల మీదుగా అవార్డునీ అందుకున్నారు. ఆకాశవాణిలో పలుమార్లు కవితలను వినిపించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో మూడుసార్లు పాల్గొని కవితలను వినిపించారు.

-బీఎస్‌ రామకృష్ణ,  కర్నూలు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్