Heeraben Modi: అమ్మతో ఈ జ్ఞాపకాలు.. నాకెప్పటికీ పదిలమే!

తన పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తల్లి పెద్ద తపస్సే చేస్తుంది.. విలువలకు కట్టుబడుతూ అడుగడుగునా వారికి ఆదర్శంగా నిలుస్తుంటుంది. తన తల్లి హీరాబెన్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు ప్రధాని మోదీజీ. తాజాగా మాతృవియోగానికి గురైన ఆయన.. తన తల్లితో తనకున్న అనుబంధాన్ని....

Published : 30 Dec 2022 17:34 IST

తన పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తల్లి పెద్ద తపస్సే చేస్తుంది.. విలువలకు కట్టుబడుతూ అడుగడుగునా వారికి ఆదర్శంగా నిలుస్తుంటుంది. తన తల్లి హీరాబెన్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు ప్రధాని మోదీజీ. తాజాగా మాతృవియోగానికి గురైన ఆయన.. తన తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆదర్శమూర్తి అంటూ ఆమె ఉన్నత వ్యక్తిత్వాన్ని ట్వీట్‌ రూపంలో కొనియాడారు.

అమ్మే ఆదర్శం!

‘అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే!’ అంటుంటారు. తానెంత ఉన్నత హోదాలో ఉన్నా అమ్మ చాటు బిడ్డనే అంటూ ప్రతి సందర్భంలోనూ తన మాటలు, చేతలతో నిరూపించారు మోదీజీ. తాజాగా తన తల్లిని కోల్పోవడంతో ఆమె వందేళ్ల జీవిత ప్రయాణంపై భావోద్వేగ ట్వీట్‌ చేశారాయన. ‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకొని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సు లాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు..’ అంటూ తన తల్లి గురించి రాసుకొచ్చారు మోదీ.

ఆలోచనలో మిన్న!

తానెంత బిజీగా ఉన్నా ప్రతి సందర్భాన్నీ తన తల్లితో కలిసి జరుపుకునేవారు మోదీ. ఈ క్రమంలోనే తన తల్లితో తనకున్న జ్ఞాపకాల్ని నెమరువేసుకునేవారు. వాటిలో కొన్నింటిని బ్లాగ్‌ రూపంలోనూ పొందుపరిచారు మోదీ. ‘చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పుల్ని ప్రతిబింబిస్తాయంటారు. అందుకు అమ్మే గొప్ప ఉదాహరణ! మా చిన్నతనంలో ఓ రోజు బాగా వాన కురుస్తోంది. దాంతో ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ సమయంలో ఎక్కడెక్కడైతే నీళ్లు లీకవుతున్నాయో.. అక్కడ బకెట్లు, పాత్రలు పెట్టింది అమ్మ. అలా సేకరించిన నీళ్లను తదుపరి అవసరాల కోసం వినియోగించచ్చన్నది తన ఆలోచన. నిజానికి అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అమ్మ ఆలోచించిన విధానం గొప్పది. నీటి పొదుపుకి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది? ఇదొక్కటనే కాదు.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో ఆమెకు ఆమే సాటి. తన ఆలన, లాలన నేను ఎంత ఎదిగినా నన్ను చిన్న పిల్లాడిని చేసేస్తుంది.. అందరమ్మల్లాగే మా అమ్మ కూడా ఎంతో సింపుల్‌గా ఉంటుంది.. తను అనితర సాధ్యురాలు!’ అంటూ అమ్మను ఆకాశానికెత్తేశారు మోదీజీ.

అమ్మతో కలిసి రెండుసార్లే..!

ప్రతి సందర్భంలోనూ తన తల్లిని వ్యక్తిగతంగా కలుసుకొని ఆమె ఆశీర్వచనాలు తీసుకునే మోదీ.. బహిరంగంగా కలిసింది మాత్రం రెండు మార్లేనట! ‘అమ్మ అనే పదంలో ఎన్నో భావోద్వేగాలు నిండి ఉన్నాయి. మా అమ్మ ఎన్నో త్యాగాలకు ప్రతిరూపం. నన్ను వ్యక్తిగతంగా, మానసికంగా, ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దేందుకు ఆమె ఎన్నో కష్టాలు పడింది. అయితే ఆమెతో కలిసి బహిరంగంగా కనిపించింది మాత్రం రెండే రెండుసార్లు. ఒకటి - ఏక్తా యాత్ర ముగించుకొని గుజరాత్‌కు తిరిగొచ్చాక నిర్వహించిన బహిరంగ సభలో అమ్మ పాల్గొని నా నుదుట తిలకం దిద్ది నన్ను ఆశీర్వదించింది. రెండోసారి - 2001లో గుజరాత్‌ సీఎంగా ప్రమాణం చేసే సమయంలో బహిరంగ సభలో అమ్మ పాల్గొంది.

తననూ సన్మానించాలనుకున్నా.. కానీ!

చదువు లేకపోయినా జీవితాన్ని చదవాలని తెలిసేలా చేసింది అమ్మ. ఒకసారి నా గురువుల్ని సన్మానించాలని అనుకున్నా. మా అమ్మే నాకు అతిపెద్ద టీచర్‌. అందుకే ఆమెనూ సన్మానించాలని ఆహ్వానించా. కానీ ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించింది. తన బదులు నాకు చిన్నప్పుడు అక్షరాలు దిద్దించిన స్థానిక టీచర్‌ని గౌరవించమని కోరింది. ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టి నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటాయి. ఎన్నో కష్టనష్టాలకు, త్యాగాలకు మరో రూపం అమ్మ. ఎన్నో పోరాటాల కంటే ఉన్నతమైంది తల్లి బలమైన సంకల్పం..!’ అంటూ మరో సందర్భంలో ఎమోషన్‌ అయ్యారు మోదీ.

చదువు రాకపోతే ఏంటి ?!

ఒక పురుషుడిని ‘నువ్వేం కాగలవు ?’ అని అడిగితే డాక్టర్‌, ఇంజినీర్‌, శాస్త్రవేత్త.. ఇలా ఎవరి ఆసక్తిని బట్టి వాళ్లు చెబుతుంటారు. అదే స్త్రీని ‘నువ్వేం కాగలవు ?’ అనడిగితే మాత్రం.. అన్నింటికంటే ముందు అమ్మతనానికే ఓటేస్తుంది. సంతానానికి సత్ప్రవర్తన నేర్పి సమాజోద్ధారకులుగా వారిని మార్చగలనని చెబుతుంది. హీరాబెన్ కూడా అదే చేశారు. ఆమెకి చదువు రాదు! అయితే ఏంటి ? ఎదుటివారికి కష్టం, నష్టం కలిగించకూడదని తెలుసు! ఆ విలువలే మోదీకి నేర్పారామె. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాదు.. ప్రజలు ఆయనకు పట్టే నీరాజనాలు చూసి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయేవారామె.

వందేళ్ల రహస్యం అదేనట!

ఉన్నతంగా ఆలోచించడమే కాదు.. వయసు మీద పడుతున్నా ఎంతో ఉత్సాహంగా ఉండేవారు హీరాబెన్‌. ఇలా తన వందేళ్ల ఆయుష్షు వెనుక రహస్యం ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఆమె వ్యక్తిగత వైద్య నిపుణులు. హీరాబెన్ ఎక్కువగా ఇంటి ఆహారానికే ప్రాధాన్యమిచ్చేవారట! ఒకవేళ కుటుంబంతో కలిసి బయటి ప్రదేశాలకు వెళ్లినా.. ఇంటి నుంచే స్నాక్స్‌, ఇతర పదార్థాలు తయారుచేసుకొని తీసుకెళ్లేవారట! అంతేకాదు.. పప్పులు, కాయధాన్యాలు, కిచిడీ, అన్నం, చపాతీ.. వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే ఆమె.. నూనెలు, మసాలాలు తగ్గించి తీసుకునేవారట! అంతేకాదు.. తన 99 ఏళ్ల వయసులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొని.. దీనిపై చాలామందిలో ఉన్న అపోహలు, భయాల్ని కూడా పటాపంచలు చేశారీ మాతృమూర్తి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్