ఈ హోటల్‌లో పుస్తకాలూ చదువుకోవచ్చు!

సాధారణంగా మనం ఏదైనా హోటల్‌కి వెళ్తే అక్కడి డైనింగ్‌ టేబుల్‌పై ఏం కనిపిస్తాయి? ఓ మెనూ బుక్‌, ఫోర్క్‌లు-స్పూన్లు ఉన్న స్టాండ్‌, టిష్యూ పేపర్‌ హోల్డర్‌.. కదా! కానీ నాసిక్‌లోని ‘పుస్తకాంచ హోటల్‌’కి వెళ్తే.. ప్రతి డైనింగ్‌ టేబుల్‌ సెంటర్‌లో ఓ బుక్‌ హోల్డర్‌ దర్శనమిస్తుంది.

Published : 16 Apr 2024 13:29 IST

(Photos: Instagram)

సాధారణంగా మనం ఏదైనా హోటల్‌కి వెళ్తే అక్కడి డైనింగ్‌ టేబుల్‌పై ఏం కనిపిస్తాయి? ఓ మెనూ బుక్‌, ఫోర్క్‌లు-స్పూన్లు ఉన్న స్టాండ్‌, టిష్యూ పేపర్‌ హోల్డర్‌.. కదా! కానీ నాసిక్‌లోని ‘పుస్తకాంచ హోటల్‌’కి వెళ్తే.. ప్రతి డైనింగ్‌ టేబుల్‌ సెంటర్‌లో ఓ బుక్‌ హోల్డర్‌ దర్శనమిస్తుంది. ఇలా టేబుల్‌పైనే కాదు.. పుస్తక ప్రేమికుల కోసం ఓ చిన్న పాటి గ్రంథాలయాన్నే ఏర్పాటుచేశారు భీంబాయి జోంధాలే. ఫుడ్‌ లవర్స్‌కి రుచికరమైన ఆహారంతో పాటు టైంపాస్‌ కోసం చదవడానికి ఆసక్తికరమైన పుస్తకాల్నీ అందిస్తూ ఎంతోమందికి దగ్గరయ్యారీ బామ్మ. ప్రస్తుతం ముంబయి వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగానూ పాపులరైన తన బుక్‌ హోటల్‌ని ఈ గ్రానీ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..

భీంబాయికి ఆరో తరగతిలో ఉన్నప్పుడే పెళ్లైంది. ఆమె భర్త తాగుబోతు. సంపాదించి కుటుంబాన్ని పోషించడానికి బదులు ఉన్న డబ్బు, పొలం.. అన్నీ అమ్మేసి ఆ డబ్బునూ తాగడానికే ఖర్చు పెట్టేవాడు. దీంతో ఇల్లు, పిల్లల్ని పోషించే బాధ్యత ఆమెపైనే పడింది. ఈ క్రమంలోనే పొలం పనులకు వెళ్లేది భీంబాయి. పిల్లలు కాస్త పెద్దై చేతికొచ్చే దాకా చాలా కష్టపడ్డానంటోంది.

టీ స్టాల్‌తో మొదలు..!

‘నాకు చదువంటే ప్రాణం. చిన్న వయసులోనే పెళ్లి కావడంతో చదువును పక్కన పెట్టేయాల్సి వచ్చింది. భర్తతోనైనా సంతోషంగా ఉందామంటే అదీ కుదరలేదు. పుస్తక పఠనమంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ గడిపేదాన్ని. సొంతంగా పొలం ఉన్నప్పటికీ నా భర్త దాన్ని అమ్మేయడంతో ఇతరుల పొలాల్లో పనిచేయాల్సి వచ్చేది. ఎంతో కష్టపడి నా పిల్లల్ని పెంచా.. చదివించా. ఆపై నా కొడుక్కి చిన్న ఉద్యోగం రావడంతో ఆర్థిక సమస్యలు కాస్త సద్దుమణిగాయి. ఈ క్రమంలోనే పొలం పనులు మానేసి నేను, నా కూతురు కలిసి ఓ టీ స్టాల్‌ పెట్టుకున్నాం. చాలామంది ‘ఆడవాళ్లు ఇంటి బాధ్యతలు చూసుకోవాలి కానీ బయటికెళ్లి టీ అమ్మడమేంటి?’ అన్నారు. అయినా వాళ్ల మాటలు నేను పట్టించుకోలేదు. క్రమంగా ఈ టీ స్టాల్‌నే ఫుడ్‌ కోర్ట్‌గా మార్చాం. మా వద్దకొచ్చే కస్టమర్లు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ తమ టేబుల్‌ వద్దకొచ్చే లోపు ఫోన్లే లోకంగా గడిపేవారు. కానీ వాళ్ల ఈ అలవాటులో కొంత వరకైనా మార్పు తీసుకురావాలనిపించింది. ఈ ఆలోచనే 2010లో ‘పుస్తకాంచ హోటల్‌’ ప్రారంభించేందుకు దోహదం చేసింది..’ అంటారు భీంబాయి బామ్మ.

ఐదు వేల పుస్తకాలు!

రుచికరమైన వంటకాలతో పాటు ఆసక్తికరమైన పుస్తకాల్నీ అందించే హోటల్‌ ఇది. ఇక్కడి డైనింగ్‌ టేబుల్స్‌పై మెనూతో పాటు బుక్‌ స్టాండ్స్‌ దర్శనమిస్తాయి. వాటిలో ఆసక్తికరమైన కథల పుస్తకాలు, నవలలు, కవితల పుస్తకాలు.. వంటివెన్నో పొందుపరిచారు భీంబాయి. తొలుత 25 పుస్తకాలతో ప్రారంభమైన ఈ బుక్‌ హోటల్‌లో ఇప్పుడు 5 వేలకు పైగా పుస్తకాలున్నాయి.
‘పుస్తకాలే మన నేస్తాలు. ప్రతి సందర్భంలోనూ అవి మనకు తోడుంటాయి. మేం తొలుత 25 పుస్తకాలతో మా ఫుడ్‌ స్టాల్‌ ప్రారంభించాం. కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో క్రమంగా విస్తరించాం. ఇప్పుడు మా హోటల్‌లో 5 వేలకు పైగా పుస్తకాలున్నాయి. పాఠకుల ఆసక్తుల్ని బట్టి కథలు, కాల్పనికాలు, నవలలు, పిల్లల స్టోరీ బుక్స్‌.. వంటివెన్నో అందుబాటులో ఉంచాం. ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలు టేబుల్‌ వద్దకొచ్చే సరికి హాయిగా వీటిని చదువుకోవచ్చు. తద్వారా మనసుకు ఒక రకమైన రిలాక్సేషన్‌ దొరుకుతుంది. ఇలా పాఠకులకు పుస్తకాలు అందించడమే కాదు.. వాళ్ల కోసం ప్రత్యేకంగా పోయెట్రీ నైట్స్‌, బుక్‌ గ్రూప్స్‌.. వంటి పలు కార్యక్రమాలూ ఏర్పాటుచేస్తున్నాం. వీటిలో భాగంగా బుక్‌ లవర్స్‌ ఒక్క చోట చేరి వాళ్ల వాళ్ల అభిప్రాయాల్ని, ఆలోచనల్ని పంచుకుంటారు. ఇదీ ఓ రకమైన రిలాక్సేషనే!’ అంటారు భీంబాయి బామ్మ.

ఉచితంగా అందిస్తూ..!

ఇలా తమ బుక్‌ హోటల్‌లో కస్టమర్ల రిలాక్సేషన్‌ కోసం పుస్తకాల్ని అందుబాటులో ఉంచడమే కాదు.. మహిళా దినోత్సవం, రిపబ్లిక్‌ డే.. వంటి ప్రత్యేక సందర్భాల్లో ఆయా థీమ్‌లతో కూడిన పుస్తకాల్నీ కొందరు పాఠకులకు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉండే ఆస్పత్రులకూ పలు పుస్తకాల్ని ఉచితంగా ఇస్తున్నారు భీంబాయి.

‘ఆస్పత్రుల్లో డాక్టర్‌ని సంప్రదించడానికి ముందు చాలామంది వెయిటింగ్‌ హాల్‌లో వేచి ఉండడం చూస్తుంటాం. అలాంటి వారి బోరింగ్‌ని పుస్తకాలు పోగొడతాయనిపించింది. అందుకే హాస్పిటల్స్‌కీ ఉచితంగా కొన్ని పుస్తకాలు అందిస్తున్నాం. ఏదేమైనా మా బుక్‌ హోటల్‌కి వచ్చే కస్టమర్లు పుస్తకాలు చదువుతూ సేదదీరడం చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంటుంది. ఈ ఆనందంలో గతంలో నేను పడిన కష్టాలన్నీ మర్చిపోతుంటా. మరిన్ని మంచి పుస్తకాలు పాఠకులకు చేరువ చేయాలన్న ఉత్సాహం నాలో కలుగుతుంటుంది..’ అంటారీ 74 ఏళ్ల బామ్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్