కాబోయే శ్రీవారి కోసం.. 15 కిలోల లెహెంగాతో స్కేట్ డ్యాన్స్!

ఏరి కోరి ఎంచుకున్న జీవిత భాగస్వామిని తమ జీవితంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. డ్యాన్స్‌, సంగీతం.. ఇలా తమలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాలతో పెళ్లికి ముందే వారిని ఆకట్టుకుంటున్నారు.. వారిపై తమకున్న ప్రేమను....

Updated : 04 Jul 2023 19:20 IST

(Photos: Instagram)

ఏరి కోరి ఎంచుకున్న జీవిత భాగస్వామిని తమ జీవితంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. డ్యాన్స్‌, సంగీతం.. ఇలా తమలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాలతో పెళ్లికి ముందే వారిని ఆకట్టుకుంటున్నారు.. వారిపై తమకున్న ప్రేమను తెలియజేస్తున్నారు. ముంబయికి చెందిన అమరీన్‌ ఖురానా కూడా ఇదే ట్రెండ్‌ ఫాలో అయింది. జాతీయ స్థాయి స్కేటింగ్‌ ఛాంపియన్‌ అయిన ఆమె.. తనకున్న స్కేటింగ్‌ నైపుణ్యాలకు డ్యాన్స్‌ మెలకువల్ని జోడించి.. ఇటీవలే జరిగిన తన సంగీత్‌ ఫంక్షన్లో అదరగొట్టింది. అదీ 15 కిలోల భారీ లెహెంగా ధరించి మరీ డ్యాన్స్‌ చేసిందామె. తనకు కాబోయే భర్తను సర్‌ప్రైజ్‌ చేయడానికే ఇలా చేశానంటోన్న అమరీన్‌.. తన డ్యాన్స్‌ చూశాక అతని కళ్లల్లో కలిగిన ఆనందం చూసి ఎంతో ముచ్చటపడ్డానంటోంది. ఇలా తన ఇష్టసఖుడి కోసం అమరీన్ చేసిన స్కేట్‌ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే స్కేటింగ్, డ్యాన్స్‌లోనే కాదు.. వ్యాపారంలోనూ రాణిస్తోన్న ఈ కొత్త పెళ్లి కూతురి గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

అమరీన్‌కు చిన్నతనం నుంచి స్కేటింగ్‌పై ఆసక్తి ఎక్కువ. ఈ ఇష్టంతోనే ఐదేళ్ల వయసు నుంచే ఈ క్రీడలో శిక్షణ తీసుకుందామె. ఆర్టిస్టిక్‌ ఫ్రీ స్టైల్‌, స్పీడ్‌ రేసింగ్‌, ఫిగర్‌ ట్రేసింగ్‌, కపుల్‌ పెయిర్‌ స్కేటింగ్‌.. ఇలా రోలర్‌ స్కేటింగ్‌కు సంబంధించిన దాదాపు అన్ని రకాల్లోనూ ఆమె ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పోటీపడిన ఆమె.. పలు పతకాలూ సాధించింది. జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలుచుకున్న ఈ ముంబయి స్కేటర్‌.. గతంలో ఓసారి ఏషియన్‌ గేమ్స్‌కీ అర్హత సాధించింది.

కాబోయే శ్రీవారి కోసమే ఇదంతా!

అయితే ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అమరీన్‌.. తనలో ఉన్న ఈ ప్రత్యేకమైన స్కేటింగ్‌ నైపుణ్యాలతోనే తనకు కాబోయే భర్తను సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంది. తన సంగీత్‌ వేడుకను ఇందుకు వేదికగా చేసుకుంది. ఈ వేడుక కోసం సీక్విన్‌ హంగులద్ది డిజైన్‌ చేసిన 15 కిలోల భారీ ఎంబ్రాయిడరీ లెహెంగాను ఎంచుకుందామె. అంతేకాదు.. తన స్కేట్‌ డ్యాన్స్‌ కోసం కస్టమైజ్‌డ్‌ రోలర్‌ స్కేట్స్‌ కూడా ప్రత్యేకంగా తయారుచేయించుకుంది. ఇలా స్కేట్స్‌ కనిపించకుండా ఫ్లోర్‌లెంత్‌ లెహెంగాతో అందంగా ముస్తాబై వేదిక పైకి వచ్చిన ఆమె రోలర్‌ స్కేట్స్‌ ధరించిందని ఎవరూ ఊహించలేదు. పాటకు తగ్గట్లుగా వాటితోనే స్టెప్పులేస్తూ.. మధ్యలో ఓసారి గుండ్రంగా తిరిగిందామె. దీంతో ఆమె ధరించిన స్కేట్స్‌ కనిపించడంతో అసలు విషయం అక్కడున్న వారికి అర్థమైంది. అయితే తనకు కాబోయే శ్రీమతి డ్యాన్స్‌ చూస్తూ మైమరచిపోయిన వరుడు.. తన స్కేటింగ్‌ నైపుణ్యాల్ని చూసి.. మరింత ఫిదా అయిపోయాడు.

‘నాకు కాబోయే భర్త సాహిల్‌ను సర్‌ప్రైజ్‌ చేయడానికే ఇలా చేశాను. 15 కిలోల లెహెంగాతో స్కేట్‌ డ్యాన్స్‌ అంటే.. ముందు కాస్త టెన్షన్ పడ్డా.. కానీ తన కళ్లలో ఆనందం చూశాక.. నా ప్రయత్నం సఫలమైందనిపించింది..’ అంటూ తన డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది అమరీన్‌. సుమారు 35 లక్షల మందికి పైగా వీక్షించిన ఈ వీడియోపై చాలామంది స్పందిస్తూ.. ‘బ్రిలియంట్‌.. తన డ్యాన్స్‌ చూసి మేమూ చూపు తిప్పుకోలేకపోయాం..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

లండన్‌లో వచ్చిన ఆలోచన!

అమరీన్‌ స్కేటర్‌, డ్యాన్సరే కాదు.. వ్యాపారవేత్త కూడా! 2015లో Brewlette పేరుతో ఓ సంస్థను స్థాపించిన ఆమె.. ఈ వేదికగా సహజసిద్ధమైన టీలను సరికొత్త రుచుల్లో వినియోగదారులకు చేరువ చేస్తోంది.

‘పెరిగి పెద్దయ్యే క్రమంలో టీ అంటే అనాసక్తి చూపేదాన్ని. ఒకవేళ తాగాలనిపించినా సాధారణ ఛాయ్‌ కాకుండా.. బ్లాక్‌ టీ, మసాలా ఛాయ్‌.. వంటివి తీసుకునేదాన్ని.. అదీ అరుదుగానే! అయితే మాస్టర్స్‌ కోసం లండన్‌ వెళ్లినప్పుడు.. అక్కడి చలి వాతావరణం నుంచి ఉపశమనం పొందడానికి టీ తాగేదాన్ని. అలా అక్కడి ప్రత్యేకమైన టీ రుచులు నాకు దీనిపై మక్కువను పెంచాయి.. నన్ను ఆలోచనలో పడేశాయి. సాధారణ టీలకు బదులు కొత్త రుచుల్లో సహజసిద్ధంగా వీటిని అందిస్తే బాగుంటుందనిపించింది. నిజానికి వ్యాపారం చేయాలన్న ఆలోచన నాకు ముందు నుంచీ లేదు.. కానీ లండన్‌ అనుభవాలతో టీ బిజినెస్‌ ప్రారంభించాలనుకున్నా. ఇండియాకు తిరిగొచ్చాక 2015లో Brewlette పేరుతో ముంబయిలో సంస్థను స్థాపించా..’ అంటూ చెప్పుకొచ్చింది అమరీన్.

పూలు, ఆకులతో..!

తన సంస్థ వేదికగా ఎన్నో ఔషధ గుణాలున్న వివిధ రకాల పూలు, ఆకులు, పండ్లతో ప్రత్యేకమైన రుచుల్లో టీ పొడుల్ని తయారుచేస్తోంది అమరీన్‌. వీటిని విడివిడిగానే కాదు.. కలిపి మరిన్ని రుచుల్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీలతో పాటు హెర్బల్‌ ఇన్‌ఫ్యూజన్స్‌, ఎన్నో రకాలైన ఫ్లేవర్డ్‌ టీ పొడులు తయారుచేస్తోన్న ఆమె.. ఈ టీలు తయారు చేసుకోవడానికి కెటిల్స్‌, ఇన్‌ఫ్యూజర్స్‌.. వంటివీ విక్రయిస్తోంది.

‘మన దేశంలో టీ చరిత్ర ఈనాటిది కాదు.. అయితే ప్రాచీన కాలానికి చెందిన ఈ పానీయాన్ని ఆధునిక రుచుల్లో అదీ సహజసిద్ధంగా అందించాలనుకున్నా. ఈ క్రమంలోనే పూలు, పండ్లు, ఆకుల్ని ఎండబెట్టి ప్రత్యేకమైన టీ మిక్స్‌లను తయారుచేస్తున్నా. ప్రస్తుతం మా సేవలు ఆన్‌లైన్‌ వేదికగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా టీ పొడుల్ని విక్రయించడమే కాదు.. అధికారికంగా జరిగే టీ పార్టీలు, కార్పొరేట్‌ ఈవెంట్లు, పెళ్లిళ్లు, పండగలు, ఇతర కార్యక్రమాలకూ క్యాటరింగ్‌ సేవల్ని అందిస్తున్నాం. మరోవైపు కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ కూడా చేస్తున్నాం. త్వరలోనే మా బిజినెస్‌ని వివిధ దేశాలలో విస్తరించడంపై దృష్టి పెట్టాం..’ అంటోంది అమరీన్.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్