జుట్టుకు తేమనందించండిలా!

ప్రస్తుతమున్న వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కారణంగా కేశ సంపద రోజురోజుకీ తగ్గిపోవడంతో పాటు వివిధ రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన హెయిర్‌ మాస్కుల్ని....

Published : 10 Nov 2022 21:50 IST

ప్రస్తుతమున్న వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కారణంగా కేశ సంపద రోజురోజుకీ తగ్గిపోవడంతో పాటు వివిధ రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన హెయిర్‌ మాస్కుల్ని ప్రయత్నించాల్సిందే!

పెరుగు

పెరుగు ముఖవర్చస్సును పెంపొందించడానికి మాత్రమే కాదు.. కేశాలకు సహజసిద్ధంగా తేమను అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్‌ జుట్టు కోల్పోయిన తేమను తిరిగి అందించడానికి దోహదం చేస్తుంది. కప్పు పెరుగులో గుడ్డు, నిమ్మరసం.. కొద్ది మోతాదులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తలకు పట్టించి కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి. తర్వాత శుభ్రపరచుకుంటే జుట్టుకు తేమ అంది కేశాలు నిగనిగలాడతాయి.

అవకాడో

అవకాడో జుట్టుకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇందులో భాగంగా.. సగం అవకాడో ముక్కను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. తర్వాత పుదీనా ఆకుల పొడి, ఆలివ్‌ నూనె, తేనె.. ఈ మూడింటిని చెంచా చొప్పున తీసుకొని అవకాడో పేస్ట్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించిన అనంతరం పుదీనా టీతో తలపై స్ప్రే చేసుకోవాలి. కాసేపటి తర్వాత జుట్టును శుభ్రపరచుకుంటే సరిపోతుంది. ఈ మాస్క్‌ వల్ల నిర్జీవమైన జుట్టు తిరిగి ప్రకాశవంతంగా మారడంతో పాటు కేశాలకు తగినంత తేమ అందుతుంది.

అరటిపండు

అరటిపండు రుచికే కాదు.. జుట్టుకు సహజసిద్ధంగా తేమను అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. బాగా పండిన అరటిపండును తీసుకొని మెత్తగా చేసుకోవాలి. అందులో చెంచా బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టుకు పట్టించి కాసేపు ఉంచుకోవాలి. అనంతరం శుభ్రపరచుకుంటే మృదువైన కేశాలు మీ సొంతమవుతాయి. అలాగే జుట్టుకు సరైన పోషణ లభించి, అవి తేమను సంతరించుకుంటాయి.

కోడిగుడ్డు

ఒక కోడిగుడ్డు మిశ్రమంలో కొద్దిగా ఆలివ్‌ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, కుదుళ్లకు పట్టించి కాసేపు అలాగే ఉంచుకోవాలి. తర్వాత కడిగేస్తే జుట్టు పట్టులా తయారవుతుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన జుట్టుకు పటుత్వాన్ని అందించి దృఢంగా చేస్తుంది. దీనికి కారణం ఇందులోని ప్రొటీనే. అంతేకాదు.. ఈ మాస్క్‌ జుట్టుకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.

గుమ్మడికాయ

జుట్టుకు సహజసిద్ధంగా తేమను అందించడానికి గుమ్మడికాయ, తేనె మిశ్రమం కూడా తోడ్పడుతుంది. కొన్ని గుమ్మడికాయ ముక్కల్ని తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల తేనె వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు, కుదుళ్లకు పట్టించి క్యాప్‌ పెట్టుకోవాలి. పావుగంట తర్వాత కేశాల్ని శుభ్రపరచుకోవాలి. అంతే.. తేమతో నిగనిగలాడే జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా గుమ్మడిలోని ఎ, సి విటమిన్లు, బీటా కెరోటిన్‌, జింక్‌, పొటాషియం.. వంటివన్నీ కురుల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అలాగే కేశాల్ని మాయిశ్చరైజ్‌ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్