ఇవీ మాయిశ్చరైజర్లే!

శీతాకాలంలో చర్మం పొడిబారడం సహజం. దీనికి పరిష్కారంగా వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడడం మామూలే. అయితే బయట దొరికే వాటికి బదులు ఇంట్లోనే లభించే కొన్ని సహజ పదార్ధాలను మాయిశ్చరైజర్లుగా వాడచ్చంటున్నారు నిపుణులు.

Published : 02 Nov 2023 20:58 IST

శీతాకాలంలో చర్మం పొడిబారడం సహజం. దీనికి పరిష్కారంగా వివిధ రకాల మాయిశ్చరైజర్లను వాడడం మామూలే. అయితే బయట దొరికే వాటికి బదులు ఇంట్లోనే లభించే కొన్ని సహజ పదార్ధాలను మాయిశ్చరైజర్లుగా వాడచ్చంటున్నారు నిపుణులు.

పూటపూటకీ మాయిశ్చరైజర్లు రాసే అవసరం లేకుండా రోజంతా చర్మం తేమగా, తాజాగా ఉండాలంటే విటమిన్‌ ‘ఇ’ నూనెను వాడమంటున్నారు నిపుణులు. ఇది చర్మంపై సులువుగా పరచుకోవడంతో పాటు బాగా ఇంకుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే ఈ నూనె ఎండ వల్ల కమిలిన చర్మానికీ చక్కటి పరిష్కారం! దీంతో పాటు కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనె, ఆర్గాన్‌ ఆయిల్‌.. వంటివి కూడా న్యాచురల్‌ మాయిశ్చరైజర్లుగా ఉపయోగపడతాయి.

పొడిబారిన చర్మానికి, పెదాలకు తేమనందించడంలో షియా బటర్‌ చక్కగా పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని పునరుత్తేజితం చేసి మెరిపించడంలో సహకరిస్తాయి.

కలబంద గుజ్జులో ‘ఎ’, ‘సి’, ‘ఇ’, ‘బి12’.. వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడిన ర్యాషెస్‌ను తగ్గించడంతో పాటు ఎక్కువ సమయం పాటు చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

మజ్జిగ, పెరుగు.. వంటి పులియబెట్టిన పదార్థాల్లో ల్యాక్టికామ్లం ఉంటుంది. దీనిలో చర్మానికి తేమనందించే గుణాలు ఎక్కువని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే వీటిని ఫేస్‌మాస్కుల్లో భాగం చేసుకోవడం, లేదంటే నేరుగా చర్మానికి రాసుకోవడం.. వంటివి చేస్తే చక్కటి ఫలితాలు పొందచ్చంటున్నారు నిపుణులు.

రోజ్‌వాటర్‌లో చర్మానికి తేమనందించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటోంది ఓ అధ్యయనం. ఈ నీటిని మిస్ట్‌/స్ప్రే బాటిల్‌లో నింపి.. నిర్ణీత వ్యవధుల్లో చర్మం లేదా ముఖంపై స్ప్రే చేసుకుంటే రోజంతా తేమగా, తాజాగా ఉండచ్చంటోంది.

కీరాదోసలో ఉండే అధిక నీటి శాతం చర్మానికి తేమనందించడంలో సహకరిస్తుంది. ఇందుకోసం దీన్ని తినడమే కాదు.. దీంతో ప్యాక్స్ తయారుచేసుకొని కూడా ఉపయోగించచ్చు.. లేదంటే కీరా స్లైసుల్ని కళ్లు, ముఖమంతా పరచుకొని కాసేపు సేదదీరితే చక్కటి ఫలితం ఉంటుంది.

బాగా పండిన అరటిపండ్లను పడేయడం కంటే.. వాటిని పేస్ట్‌లా చేసుకొని చర్మంపై అప్లై చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందులో అధికంగా ఉండే విటమిన్‌ ‘సి’ పొడిబారిన చర్మానికి ఉపశమనాన్ని అందిస్తుంది.

ఈ కాలంలో సాధారణ చర్మాన్ని సంరక్షించుకోవడమే సవాలంటే.. పొడి చర్మం ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారు తేనెతో చర్మాన్ని మర్దన చేసుకొని పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు మేను మెరిసిపోతుంది.

ఇవన్నీ సహజసిద్ధమైన పదార్థాలే అయినప్పటికీ చర్మతత్వాలను బట్టి కొంతమందికి కొన్ని పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్