బీపీని అదుపు చేసే ఆహారం!

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు....

Published : 17 May 2024 14:14 IST

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధమైన మార్గాల గురించి తెలుసుకుందాం..

ఒత్తిడే కారణమా?
అధిక రక్తపోటుకు మన జీవనశైలిలో చోటుచేసుకునే కొన్ని మార్పులు కారణమవుతుంటాయి. ముఖ్యంగా స్థూలకాయం, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు, నొప్పి నివారిణులు ఎక్కువగా వాడడం.. వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల గుండె పోటు, కిడ్నీ సమస్యలు.. వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ, డాక్టర్‌ సలహాలు పాటిస్తూనే.. దాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

పుచ్చకాయ గింజలు..
పుచ్చకాయలు శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడతాయి. అలాగే వాటిలో ఉండే గింజల వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వాటిని ఉపయోగించి రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం పుచ్చకాయ గింజలు, గసగసాలు.. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపున, సాయంత్రం.. ఒక్కో చెంచా చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే ఇలా కూడా ప్రయత్నించచ్చు.. ఒక చెంచా పుచ్చకాయ గింజల్ని బరకగా దంచి.. ఒక కప్పు బాగా మరిగించిన నీటిలో వేసి దాదాపు గంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి రోజూ నిర్ణీత వ్యవధుల్లో నాలుగు చెంచాల చొప్పున తీసుకుంటే కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడచ్చు.

నిమ్మరసం..
ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో అరచెక్క నిమ్మరసాన్ని పిండి రోజూ పరగడుపునే తాగాలి. దీనిలో ఉండే విటమిన్ ‘సి’ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీరాడికల్స్ వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. అలాగే నిమ్మరసం రక్తనాళాల్ని ఫ్లెక్సిబుల్‌గా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తద్వారా అధిక రక్తపోటు నుంచి బయటపడచ్చు. అయితే నిమ్మరసం మిశ్రమానికి ఉప్పు, చక్కెర.. వంటివి కలపకపోవడమే ఉత్తమం.

కొబ్బరి నీళ్లు..
కొబ్బరి నీళ్లతో శరీరానికి కావాల్సిన శక్తి అందడమే కాదు.. బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో లభించే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ‘సి’.. వంటివన్నీ సిస్టాలిక్ రక్తపోటును తగ్గించడంలో తోడ్పడతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి రోజూ కొబ్బరినీళ్లు తాగుతూనే.. అప్పుడప్పుడూ కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది.

ఉల్లిపాయలు..
ఉల్లిపాయలంటే కొంతమంది మొహం చిట్లించుకుంటారు. కూరల్లో వేసినా తీసి పక్కన పెట్టేస్తుంటారు మరికొందరు. అయితే ఉల్లిపాయల్ని తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం రోజూ చిన్న ఉల్లిపాయ ముక్కను తినడం లేదంటే ఒకటిన్నర చెంచా చొప్పున ఉల్లిపాయ రసం, తేనెల మిశ్రమాన్ని.. రోజుకు రెండుసార్లు, కనీసం రెండు వారాల పాటు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.


ఇవి కూడా...

రెండు చెంచాల మెంతుల్ని నీటిలో వేసి మరిగించాలి. అవి చల్లారాక వడకట్టి తీసుకోవాలి. మెంతుల్లో అధికంగా ఉండే పొటాషియం, ఫైబర్.. వంటివి అధిక రక్తపోటు నుంచి త్వరిత ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయి.
తేనె కూడా అధిక రక్తపోటు నుంచి విముక్తి కలిగించడంలో దోహదం చేస్తుంది. ఇందుకోసం రోజూ పరగడుపున రెండు చెంచాల తేనె తీసుకోవడం మంచిది. అలాగే తులసి రసం, తేనె సమపాళ్లలో కలిపిన మిశ్రమాన్ని కూడా ప్రయత్నించచ్చు.
అలాగే రోజుకు రెండు అరటిపండ్లు తినడం, అల్లాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం, కూరల్లో ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివన్నీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్