నిపుల్ హెయిర్‌కు ‘సహజ’ పరిష్కారం!

చాలామంది అమ్మాయిలు బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడే అంశాల్లో నిపుల్‌ హెయిర్‌ కూడా ఒకటి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్‌.. వంటివి దీనికి కారణమవుతుంటాయి.

Published : 04 Dec 2023 12:36 IST

చాలామంది అమ్మాయిలు బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడే అంశాల్లో నిపుల్‌ హెయిర్‌ కూడా ఒకటి. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్‌.. వంటివి దీనికి కారణమవుతుంటాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలు ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఈ న్యాచురల్‌ వ్యాక్స్‌తో..!

చేతులు, కాళ్లు.. వంటి సున్నితమైన భాగాల్లో ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి ఎలాగైతే వ్యాక్స్‌ వాడతామో.. నిపుల్‌ హెయిర్‌ని తొలగించుకోవడానికి కూడా ఈ సహజ వ్యాక్స్‌ని ప్రయత్నించచ్చు.

⚛ నిమ్మరసం - టేబుల్‌స్పూన్

⚛ చక్కెర లేదా బ్రౌన్‌ షుగర్‌ – టేబుల్‌స్పూన్

⚛ తేనె - టేబుల్‌స్పూన్

⚛ వ్యాక్సింగ్‌ స్ట్రిప్

వ్యాక్సింగ్‌ స్ట్రిప్‌ మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా కలపాలి. దీన్ని స్టౌ మీద పెట్టి పదార్థాలన్నీ బాగా కరిగి, కలిసిపోయి వ్యాక్స్‌లా చిక్కగా మారేంత వరకూ కలుపుతూ మరిగించాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆపై నిపుల్‌ హెయిర్‌ పెరిగే దిశలో దీన్ని అప్లై చేసి.. దానిపై వ్యాక్సింగ్‌ స్ట్రిప్‌ పెట్టి కాస్త ఒత్తాలి. ఇప్పుడు ఆ స్ట్రిప్‌ని వ్యతిరేక దిశలో లాగేస్తే సరి. ఈ న్యాచురల్‌ వ్యాక్స్‌ నిపుల్‌ హెయిర్‌ని తొలగించడంతో పాటు.. ఇందులో మనం ఉపయోగించిన తేనె చర్మానికి తేమనందించడంలో సహకరిస్తుంది. అలాగే నిమ్మరసంలోని బ్లీచింగ్‌ గుణాలు ఆ ప్రదేశంలోని చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తాయి.

పసుపుతో..

పసుపు అవాంఛిత రోమాల్ని తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక బౌల్‌లో టేబుల్‌స్పూన్‌ పసుపు, టేబుల్‌స్పూన్‌ శెనగపిండి తీసుకొని దీనికి కొద్దికొద్దిగా నువ్వుల నూనె జతచేస్తూ చిక్కటి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిపుల్స్‌ దగ్గర అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేసి.. కొన్ని నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇదే చిట్కాను వారానికి ఒకటి లేదా రెండుసార్లు పాటిస్తే కొన్ని వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది.

వారానికి రెండుసార్లు ఇలా!

టేబుల్‌స్పూన్ తేనెలో అరటీస్పూన్‌ నిమ్మరసం జతచేయాలి. బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని నిపుల్‌ హెయిర్‌ ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌తో తుడిచేసి.. చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల కొన్ని వారాల్లోనే అవాంఛిత రోమాల పెరుగుదలకు అడ్డుకట్ట వేయచ్చు. అలాగే ఈ మిశ్రమం ఆ ప్రదేశంలోని చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

గమనిక: నిపుల్‌ హెయిర్‌ని తొలగించుకోవడానికి ఉపయోగించే ఈ పదార్థాలన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇన్ని చేసినా సమస్య తగ్గకపోతే మాత్రం ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్