కళ్లకు.. కొత్త కళ!

సరిపడినంత నిద్ర లేకపోవడం, థైరాయిడ్, ఉప్పు అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం.. ఇలాంటి కారణాల వల్ల కళ్ల చుట్టూ వాపు, కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్లు అలసిపోయినట్లుగా కనిపించడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.

Published : 20 Sep 2023 12:25 IST

సరిపడినంత నిద్ర లేకపోవడం, థైరాయిడ్, ఉప్పు అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం.. ఇలాంటి కారణాల వల్ల కళ్ల చుట్టూ వాపు, కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్లు అలసిపోయినట్లుగా కనిపించడం.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవి కంటి అందాన్ని దెబ్బతీస్తాయి కూడా! మరి, ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.

కీరాదోసతో కూల్‌గా..

ముందుగా కీరాదోసను పలుచని చక్రాల్లా కోసుకొని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి కళ్ల మీద పెట్టుకొని పది నిమిషాలు రిలాక్స్ అయితే చాలు. కళ్ల చుట్టూ ఉన్న వాపు తగ్గి మోము కాంతులీనుతుంది.

కీరాదోసకు బదులుగా యాపిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఫ్రిజ్‌లో భద్రపరచిన యాపిల్ తీసుకొని పలుచని ముక్కల్లా కోసి నేరుగా కళ్ల మీద పెట్టుకుంటే సరి. అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా కళ్ల చుట్టూ ఉన్న వాపు ఇట్టే తగ్గిపోతుంది.

బంగాళాదుంప రసంతో..

ఒక బంగాళాదుంప తీసుకొని తొక్క చెక్కేసి ముక్కలుగా కోసి మెత్తగా చేసుకోవాలి. దాని నుంచి రసం వేరు చేసి అందులో దూది ముంచి కళ్ల కింద అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి వాపు తగ్గుతుంది. రోజూ రాత్రి పడుకొనే ముందు ఈ చిట్కా పాటిస్తే కళ్ల కింద నల్లటి వలయాలు కూడా తగ్గుముఖం పడతాయి.

రోజ్‌వాటర్‌తో..

రోజ్‌వాటర్‌లో ముంచిన దూదిని కళ్లపై పెట్టుకొని పలుచని వస్త్రంతో కప్పేయాలి. పావుగంట తర్వాత కళ్లను చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా వాపు తగ్గి, అలసిన కళ్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.

చల్లని స్పూన్‌తో..

ఒక స్టీల్ స్పూన్ తీసుకొని ఫ్రిజ్‌లో పెట్టి కాసేపు ఉంచాలి. తర్వాత దాన్ని ఫ్రిజ్ నుంచి బయటకు తీసి చల్లని నీళ్లతో కడగాలి. ఇప్పుడు దానిని కళ్ల మీద పెట్టుకోవడం లేదా స్పూన్‌ని ఉపయోగించి కళ్ల చుట్టూ మృదువుగా మర్దన చేసుకోవడం వల్ల కంటి చుట్టూ ఉన్న వాపు తగ్గి కళ్లు ప్రకాశవంతంగా మారతాయి.

బేబీ ఆయిల్‌తో..

గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల బేబీ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన దూదిని కళ్లపై ఉంచి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. బేబీ ఆయిల్‌లో ఉండే విటమిన్ 'ఇ' వల్ల ఉబ్బిన కళ్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్