ఆ లక్ష్యాన్నే వ్యాపార అవకాశంగా మలుచుకుని..!

ప్యాకింగ్‌ దగ్గర్నుంచి స్టోరేజీ దాకా.. ఒక్కసారి ప్లాస్టిక్‌ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. కష్టంగా ఉంటుంది కదూ..! మరి, అంతగా మన జీవితాల్లో భాగమైందీ ప్లాస్టిక్‌. దీనివల్ల ఏటా 300 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయని, ఇవి ప్రపంచ జనాభా బరువుకు దాదాపు....

Published : 28 Jan 2023 17:18 IST

ప్యాకింగ్‌ దగ్గర్నుంచి స్టోరేజీ దాకా.. ఒక్కసారి ప్లాస్టిక్‌ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. కష్టంగా ఉంటుంది కదూ..! మరి, అంతగా మన జీవితాల్లో భాగమైందీ ప్లాస్టిక్‌. దీనివల్ల ఏటా 300 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయని, ఇవి ప్రపంచ జనాభా బరువుకు దాదాపు సమానమని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల వాతావరణమే కాదు.. మనతో పాటు మన చుట్టూ ఉండే ఇతర జీవుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే ఈ ప్లాస్టిక్‌ భూతాన్ని సమూలంగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రతిభా భారతి. తన లక్ష్యాన్నే వ్యాపార అవకాశంగా మలుచుకుని ‘నేచర్స్‌ బయోప్లాస్టిక్‌’ సంస్థను నెలకొల్పారు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ఉండే వివిధ రకాల వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. చేయి చేయి కలిపితేనే సుస్థిరాభివృద్ధి సాధ్యమన్నట్లు.. ప్రతి ఒక్కరికీ పర్యావరణ స్పృహ ఉంటేనే ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించగలమంటోన్న భారతి.. తన ఆశయం, వ్యాపార ప్రయాణం గురించి ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

నేను పుట్టి పెరిగిందంతా కరీంనగర్‌ జిల్లా రామగుండంలోనే! ఇంటర్మీడియట్‌ దాకా అక్కడే చదివా. హైదరాబాద్‌లో ఫైనాన్స్‌ విభాగంలో ఎంబీఏ పూర్తిచేశాక.. 14 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేశాను. ఉద్యోగంలో ఉన్నానన్న మాటే కానీ.. నా మనసంతా వ్యాపారం పైనే ఉండేది. దీనికి తోడు నాన్న ప్రోత్సాహం కూడా తోడైంది. ఈ మక్కువే నేను ఉద్యోగం వదులుకొని వ్యాపారంలోకి వచ్చేందుకు పురికొల్పింది.

జనపనార వద్దనుకొని..!

ఏ వ్యాపారం చేసినా అది పర్యావరణహితంగా ఉండాలన్న ఒక స్పష్టమైన అవగాహనైతే నాకు ముందు నుంచే ఉంది. ఇలా ఆలోచిస్తున్న క్రమంలోనే ప్లాస్టిక్‌కి పూర్తి ప్రత్యామ్నాయంగా ఉండేలా వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారుచేసి మార్కెట్లోకి తీసుకురావాలనుకున్నా. ఇందుకోసం ముందుగా జనపనార గురించి ఆలోచించా. కానీ అది చాలా ఖరీదైంది.. కాబట్టి ప్లాస్టిక్‌కి పూర్తి ప్రత్యామ్నాయంగా ఉంటూనే.. అందరికీ అందుబాటు ధరల్లో ఉండే వస్తువుల్ని తయారుచేయాలనుకున్నా. ఈ క్రమంలోనే బయోప్లాస్టిక్స్‌పై పరిశోధనలు మొదలుపెట్టా. స్పెయిన్‌, పోర్చుగల్‌.. వంటి దేశాల్లో ఉన్న ఇలాంటి పద్ధతులపై ప్రత్యక్షంగా అధ్యయనం చేశా. పర్యావరణానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు కూడా చదివా. దీనికి సంబంధించిన అవగాహన పెంచుకున్న తర్వాత ‘నేచర్స్ బయోప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థను నెలకొల్పాను. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా పర్యావరణహితమైన ఉత్పత్తులు తయారుచేయడమే మా సంస్థ ముఖ్యోద్దేశం.

ప్యాకింగ్‌ టు గార్బేజ్‌..!

ప్రస్తుతం క్యారీబ్యాగ్స్‌, పౌచెస్‌, గార్బేజ్‌ బ్యాగ్స్‌, బిన్‌ లైనర్స్‌, టెక్స్‌టైల్‌ ప్యాకింగ్‌, షాపింగ్‌ బ్యాగ్స్‌, అగ్రికల్చర్‌ మల్చ్‌ (పంట పొలాల్లో ఉపయోగించే షీట్‌), వంట పాత్రలు.. వంటి విభిన్న రకాల ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తులు మా వద్ద తయారవుతున్నాయి. మొక్కజొన్న, బంగాళాదుంప స్టార్చ్‌లే ప్రధాన ముడిసరుకులుగా, ఎక్స్‌ట్రూడర్‌ మెషీన్‌ సహాయంతో వీటన్నింటినీ తయారుచేస్తున్నాం. అయితే 2019లో కొవిడ్‌ మా సంస్థ కార్యకలాపాలకు అడ్డుపడింది. ఆ సమయంలో అనుమతుల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా వెనుకంజ వేయకుండా.. ఫుడ్‌ ప్యాకింగ్‌, కొరియర్‌ ప్యాకింగ్‌ కోసం మా ఉత్పత్తుల్ని కొన్ని సంస్థలకు ఉచితంగా అందించాం. అయితే దీనివల్ల ఒక రకంగా మాకు మంచే జరిగిందని చెప్పాలి. మా ఉత్పత్తుల్లో నాణ్యతే కొవిడ్‌ తర్వాత మాకు డిమాండ్‌ క్రమంగా పెరిగేలా చేసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా మాకు ఆర్డర్లొస్తున్నాయి. ముఖ్యంగా.. ఫార్మా, ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు, నాబార్డ్‌, స్థానిక హోటల్స్‌కు కావాల్సిన ఉత్పత్తుల్ని అందించడమే కాకుండా.. ఎమ్మెన్సీలకూ ఎక్కువ మొత్తంలో గార్బేజ్‌ బ్యాగ్స్‌ని సరఫరా చేస్తున్నాం. ఆ మధ్య నైజీరియాకూ ప్లాంట్‌ బ్యాగ్స్‌ ఎగుమతి చేశాం. తాజాగా యూఎస్‌ నుంచీ క్యారీబ్యాగ్స్‌ ఆర్డర్‌ అందుకున్నాం.

నాణ్యతే మా ప్లస్‌ పాయింట్‌!

మా వద్ద తయారయ్యే ఉత్పత్తులను దాదాపు ఆరు నెలల పాటు వాడుకోవచ్చు. ఈ క్రమంలో ఆర్డర్లను బట్టి అవసరం ఉన్నంత మేరకే వీటిని ఉత్పత్తి చేస్తున్నాం. మేం పాటించే నాణ్యతా ప్రమాణాలే తక్కువ సమయంలోనే మాకు ఆదరణ పెరిగేలా చేశాయని చెప్పచ్చు. వీటి ప్రామాణికంగానే రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ మండళ్ల నుంచి సర్టిఫికేషన్లు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇటీవలే TSIC అవార్డూ అందుకున్నాం. జాతీయ స్థాయిలో అందించే ‘అటల్‌ ఇన్నొవేషన్‌ అవార్డూ’ మాకు దక్కింది. ఇక మెషినరీకి సంబంధించిన గైడెన్స్‌ విషయంలో వీ-హబ్‌ అందించిన సహాయ సహకారాల్ని మరువలేం. మా ఉత్పత్తుల్ని బయో ఏషియా సదస్సు, వివిధ రకాల ఎగ్జిబిషన్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కమ్యూనిటీల్లో ప్రదర్శించాం. తద్వారా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం.. వంటి అంశాలపై అవగాహన తెచ్చే ప్రయత్నం చేశాం. ఇక భవిష్యత్తులో పర్యావరణహితమైన కప్స్, స్ట్రాలు, ప్లేట్లు, డబ్బాలు.. వంటి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ మరింతమంది మహిళలకు ఉపాధి కల్పించాలని ఆశిస్తున్నా.

అది అందరి బాధ్యత!

కొన్ని సమస్యలు సమూలంగా అంతం కావాలంటే సమష్టి కృషి అవసరమవుతుంది. ప్లాస్టిక్‌ భూతాన్ని నిర్మూలించాలన్నా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూనే.. పర్యావరణహిత వస్తువుల వినియోగం క్రమంగా పెంచుకోగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. అయితే మంచి చెప్పినా, చేసినా సమాజం నుంచి విమర్శలు తప్పవు. ప్లాస్టిక్‌పై యుద్ధం ప్రకటించాక నాకూ ఇలాంటి సవాళ్లెన్నో ఎదురయ్యాయి. అలాగని భయపడి అక్కడే ఆగిపోతే మనల్ని మనం నిరూపించుకోలేం. అందుకే మనపైన మనకు నమ్మకంతో ముందుకు సాగాలి. మొదలుపెట్టిన ఏ పనైనా దశల వారీగా విభజించుకొని.. ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోగలిగితే ఒత్తిడీ ఉండదు.. అనుకున్న సమయంలో లక్ష్యాన్నీ చేరుకోగలుగుతాం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్