Navya Naveli: అలాంటి మహిళల కోసమే ‘ఆరా హెల్త్’!

సినిమా నేపథ్యం ఉన్న వారు తమ పిల్లల్ని కూడా ఇదే రంగంలోకి తీసుకురావాలనుకుంటారు. అలాగే సెలబ్రిటీ కిడ్స్‌ కూడా తమ తల్లిదండ్రుల స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోనే స్థిరపడాలనుకుంటారు. కానీ తన రూటే సెపరేటు అంటోంది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్యా నవేలీ నందా. మహిళల హక్కులు, వారికి సంబంధించిన అంశాలపై.....

Published : 08 Jul 2022 17:19 IST

(Photos: Instagram)

సినిమా నేపథ్యం ఉన్న వారు తమ పిల్లల్ని కూడా ఇదే రంగంలోకి తీసుకురావాలనుకుంటారు. అలాగే సెలబ్రిటీ కిడ్స్‌ కూడా తమ తల్లిదండ్రుల స్ఫూర్తితో చిత్ర పరిశ్రమలోనే స్థిరపడాలనుకుంటారు. కానీ తన రూటే సెపరేటు అంటోంది బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్యా నవేలీ నందా. మహిళల హక్కులు, వారికి సంబంధించిన అంశాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టే ఆమె.. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం ‘ఆరా హెల్త్‌’ అనే ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించింది. తన సంస్థ, దాని పనితీరు గురించి సందర్భం వచ్చినప్పుడల్లా పంచుకునే నవ్య.. తాజాగా ‘యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన ‘యంగ్‌ ఛేంజ్‌ మేకర్స్‌’ సెషన్‌లో తన హెల్త్ టెక్ సంస్థ గురించి పలు విషయాలు పంచుకుంది.

నవ్య నవేలీ నందా.. అమితాబ్‌ ముద్దుల కూతురు శ్వేతా నందా-అల్లుడు నిఖిల్‌ నందాల గారాలపట్టిగా ఈ ముద్దుగుమ్మకు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే. న్యూయార్క్‌లోని ఫోర్ధమ్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందిన ఈ చిన్నది.. ఇప్పటికే వారసత్వంతో జూనియర్‌ సెలబ్రిటీగా స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి ‘ఆరా హెల్త్‌’ అనే ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ ఆన్‌లైన్‌ వేదిక ద్వారా ఎన్నో శారీరక, మానసిక అనారోగ్యాలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తోందీ బచ్చన్‌ గ్రాండ్‌ డాటర్. అంతేకాదు.. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ ఉత్పత్తుల్ని ఎంతోమంది మహిళలకు చేరువ చేస్తోంది.

‘యంగ్‌ ఛేంజ్‌ మేకర్‌’గా..!

సందర్భం వచ్చినప్పుడల్లా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా తన సంస్థ, దాని కార్యకలాపాల గురించి పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే నవ్య.. తాజాగా హైదరాబాద్‌ వేదికగా ‘యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో భాగంగా తొలి సెషన్‌ ‘యంగ్‌ ఛేంజ్‌ మేకర్స్‌’లో తన స్టార్టప్‌ గురించి ఇలా చెప్పుకొచ్చిందీ బిగ్‌బీ మనవరాలు.

‘సాధారణంగానే మన దేశంలో మహిళలు తమ శరీరం, ఆరోగ్య సమస్యల గురించి బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఇది మరింత పెరిగింది. అదే సమయంలో దేశ ఆరోగ్య వ్యవస్థ కూడా దెబ్బతింది. అప్పుడే నేను నా ముగ్గురు స్నేహితురాళ్లు అహిల్యా మెహతా, మల్లికా సాహ్నే, ప్రగ్యా సాబూలతో కలిసి ఓ ఆలోచన చేశాను. పరిధులు, పరిమితులకు అతీతంగా, మూసధోరణుల్ని బద్దలుకొట్టేలా ఆరోగ్యాన్ని మహిళలకు చేరువ చేయడమెలా? అని! అంతెందుకు.. మేం నలుగురం ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినా ఆరోగ్యం గురించి బహిరంగంగా చర్చించుకోవడం, దానికి సంబంధించిన సమాచారం-ఉత్పత్తుల్ని పొందడం కష్టమని గ్రహించాం. ఈ ఆలోచనలే ‘ఆరా హెల్త్‌’కు ప్రాణం పోశాయి..

మహిళల నేస్తం!

మహిళలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఆన్‌లైన్‌ వేదిక ఇది. ఇక్కడ వాళ్లు తమ శరీరం, ఆరోగ్య సమస్యల గురించి నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడచ్చు. వాళ్ల అనారోగ్యాల గురించి నిపుణులతో చర్చించి తగిన పరిష్కారం పొందచ్చు. తమ అనారోగ్యాన్ని దూరం చేసే ఔషధాలు, ఆరోగ్యాన్ని పెంపొందించే సాంకేతిక ఉత్పత్తుల్నీ మా వేదికగా పొందచ్చు. 2020లో చిన్న కమ్యూనిటీగా ప్రారంభమైన మా సంస్థ ఇప్పుడు 70 వేల మందికి పైగా మహిళలకు సేవలందిస్తోంది. ఏదైనా ఆలోచన కంటే ఆచరణలో పెట్టినప్పుడే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. ఈ రెండున్నరేళ్ల కాలంలో మేమూ బోలెడన్ని పాఠాలు నేర్చుకున్నాం. మధ్యమధ్యలో కొన్ని ఒడిదొడుకుల్నీ ఎదుర్కొన్నాం. అయినా వెనక్కి తగ్గలేదు. మనం చేస్తోన్న పనిని ఆస్వాదించినప్పుడే మరింత ఉన్నతి సాధించగలం. మేమూ మా సంస్థ కార్యకలాపాల పరంగా రోజురోజుకీ నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్నాం. ఇదే మాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం Nyayri సంస్థ మాతో కలిసి పనిచేస్తోంది. ఈ వేదికగా మహిళలు ఉచితంగా న్యాయ సలహాలు, కౌన్సెలింగ్‌.. వంటివి పొందచ్చు.

నా తపన అది కాదు!

ఇక చాలామంది ‘మీకు మంచి సినీ నేపథ్యం ఉంది.. అందంగా ఉంటారు.. సినిమాల్లోకి రావచ్చుగా!’ అంటుంటారు. అయితే కుటుంబ నేపథ్యం కంటే వ్యక్తిగత తపనకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తిని నేను. సినిమా రంగంలో స్థిరపడాలన్న ఆసక్తి నాకు లేదు. మహిళా హక్కులు, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడం, వ్యాపారం.. ముందు నుంచీ నా ఆలోచనలన్నీ వీటి చుట్టూనే తిరుగుతుండేవి. అందుకే ఆంత్రప్రెన్యూర్‌గా సెటిలయ్యా. మనం ఏ పని చేసినా.. అందులో మనం ఎదుగుతూనే.. తోటి మహిళలకు ప్రోత్సాహం అందించడమే నిజమైన సాధికారత అని నేను నమ్ముతాను. ప్రస్తుతం నేను చేస్తోంది కూడా అదే..!’ అంటోంది నవ్య.


సిగ్గుపడకండి.. పంచుకోండి!

తన సంస్థ వేదికగా మహిళలకు ఆరోగ్య పాఠాలు చెప్పడమే కాదు.. మొన్నామధ్య తన యాంగ్జైటీ సమస్య గురించి ధైర్యంగా బయటపెట్టి మరోసారి స్ఫూర్తిగా నిలిచింది నవ్య. 
‘ఒకానొక సమయంలో నేను ప్రతికూల ఆలోచనలు చేసే వ్యక్తుల మధ్యే ఉండేదాన్ని. ప్రతి విషయంలోనూ వాళ్లు నెగెటివ్‌గానే ఆలోచించేవారు. అలాంటి ప్రతికూలతలు మనసుపై ఎంతలా ప్రభావం చూపుతాయో అప్పుడు నేను తెలుసుకోలేకపోయా. ఒక్కోసారైతే లోలోపలే కుమిలిపోయేదాన్ని. కానీ దానికి కారణమేంటో అర్థమయ్యేది కాదు. ఇది నా ఒక్కదానికి సంబంధించిన సమస్యే కాదు.. ప్రపంచమంతా పట్టి పీడిస్తోన్న మానసిక జబ్బు. మొదట్లో సమస్య తీవ్రత గ్రహించకపోయినా.. ఆ తర్వాత రియలైజ్‌ అయిన నేను.. ఇక అప్పట్నుంచి సానుకూల దృక్పథంతో మెలిగే వ్యక్తుల మధ్యే ఉండడం ప్రారంభించా. అంతేకాదు.. టీవీలో వచ్చే రియాల్టీ షోలు కూడా నా మానసిక సమస్యను తగ్గించడంలో దోహదం చేశాయి. అలాగే నా ఆందోళనల గురించి ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అదే నా సమస్యకు సరైన పరిష్కారం చూపించింది. అవును.. మనసులో బాధ ఇతరులతో చెప్పుకుంటేనే గుండె భారం దిగుతుంది.. నిజానికి అదే మానసిక సమస్యలకు సగం పరిష్కారం చూపుతుంది! ఇక మిగతా సగం నిపుణుల సహాయం తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. మీరూ సిగ్గుపడకుండా మీ మానసిక సమస్యల గురించి నలుగురితో పంచుకోండి.. నిపుణుల సహాయం తీసుకోండి..’ అంది నవ్య.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్