New Year: కెరీర్లో ‘కొత్త’గా దూసుకుపోదాం..!

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కష్టపడేది ఉన్నతి గురించే! ఈ క్రమంలో కంపెనీ మారడం, తమకు ఆసక్తి ఉన్న రంగాల్లోకి వెళ్లాలనుకోవడం, పనిలో కొన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకోవడం.. ఇలా ఎవరి ఆలోచనలు వారివి! అయితే కెరీర్‌లో ఎదగాలంటే పనితనమొక్కటే సరిపోదు.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

Updated : 01 Jan 2024 19:41 IST

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కష్టపడేది ఉన్నతి గురించే! ఈ క్రమంలో కంపెనీ మారడం, తమకు ఆసక్తి ఉన్న రంగాల్లోకి వెళ్లాలనుకోవడం, పనిలో కొన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకోవడం.. ఇలా ఎవరి ఆలోచనలు వారివి! అయితే కెరీర్‌లో ఎదగాలంటే పనితనమొక్కటే సరిపోదు.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అప్పుడే మన పనికి తగ్గ ప్రతిఫలంతో పాటు వృత్తిపరంగానూ ఓ మెట్టు పైకెక్కగలుగుతాం. మరి, ఈ కొత్త ఏడాదిలో కెరీర్‌ ఉన్నతి కోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

‘యస్‌’ చెప్పడం నేర్చుకోండి!

చాలామంది ఆఫీసుల్లో ‘నా పనేదో నాది’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అదనపు పనులు చేయాల్సి వచ్చినా, కొత్త అవకాశాలు తలుపు తట్టినా.. వాటిని స్వీకరించడానికి ఇష్టపడరు. ఇందుకు.. వాటిని సమర్థంగా చేయలేమేమోనన్న భయం ఓ కారణమైతే.. ‘ఆ పనితో నాకు సంబంధం లేదు.. నా వల్ల కాద’న్న నిర్లక్ష్య ధోరణి మరికొందరిలో ఉంటుంది. అయితే ఇది ఒక రకంగా మీ ఉన్నతిని మీరు దూరం చేసుకోవడమే అంటున్నారు నిపుణులు. కాబట్టి మనసులో మరో ఆలోచన లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ స్వీకరించడానికి సిద్ధపడితే.. ఈ కార్పొరేట్‌ ప్రపంచంలో ఎక్కడైనా, ఏ పనైనా అలవోకగా చేయగలిగే నైపుణ్యాలు మీ సొంతమవుతాయంటున్నారు. ఇవి మీ కెరీర్‌ ఉన్నతికి తోడ్పడడంతో పాటు.. మాంద్యం వంటి సంక్షోభ సమయాల్లోనూ మీ ఉద్యోగానికి భద్రత ఉంటుంది.

‘మెంటార్‌’ ఉండాల్సిందే!

‘ఈ సృష్టిలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదం’టుంటారు. అలాగని మనలో ఉన్న నైపుణ్యాలే అత్యుత్తమమని భావించి గిరిగీసుకొని కూర్చుంటే.. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా కెరీర్‌లో ఉన్నతి సాధించలేం. కాబట్టి మీకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపాలి.. మీ చుట్టూ జరిగే విషయాలు, మీ రంగంలో వస్తున్న కొత్త కొత్త మార్పుల గురించి అవగాహన ఏర్పర్చుకోవాలి. ఇందుకోసం ఓ మెంటార్‌ను నియమించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. మీకు తెలియకుండానే మీలో అంతర్గతంగా దాగున్న నైపుణ్యాల్ని వాళ్లు వెలికి తీయగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి.. కొత్త అవకాశాలు స్వీకరించేందుకు మిమ్మల్ని వారు సిద్ధం చేస్తారు. అంతేకాదు.. ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా మీకు దిశానిర్దేశం చేస్తారు. ఇలా మీరు వృత్తిపరంగా ఎదిగేలా తోడ్పాటునందించడంతో పాటు వ్యక్తిగతంగానూ పరిణతి సాధించేందుకు వారిచ్చే సలహాలు మీకు ఉపకరిస్తాయి.

‘పరిధి’ పెంచుకున్నప్పుడే..!

ఈ కార్పొరేట్‌ ప్రపంచంలో ఒంటరిగా ఎవరి పనులు వాళ్లు చేసుకుపోతే సరిపోదు.. బృందంగా కలిసి పనిచేయాల్సి రావచ్చు.. నలుగురితో మాట్లాడి పనులు పూర్తి చేయాల్సి రావచ్చు.. అంతేకాదు.. కొన్నిసార్లు ఇతరులకూ పనులు అప్పగించాల్సి రావచ్చు. ఈ క్రమంలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే మన నెట్‌వర్క్‌ పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటూ వెళ్లాలి. ఇందుకోసం.. కార్పొరేట్‌ స్థాయుల్లో జరిగే సమావేశాలు, ఇతర ఈవెంట్లకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపాలి. వీటివల్ల ఇతర సంస్థలకు చెందిన మరికొంతమంది నిపుణులతో పరిచయాలు పెరుగుతాయి. తద్వారా ఆయా పనులు పూర్తిచేసే క్రమంలో ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోగలుగుతారు. ఇది ప్రత్యక్షంగా మీ సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుంది. అలాగే మీ నెట్‌వర్క్‌ పరిధిని పెంచుకోవడం వల్ల మీ కెరీర్‌ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అంటే.. ఇది ఒక రకంగా మీ కెరీర్‌ ఉన్నతికి మీరు వేసుకున్న సోపానమే కదా!

ఆ సమన్వయం లోపించకుండా..!

ఆఫీస్‌లో పనుందని కుటుంబాన్ని మిస్సవ్వడం, కార్పొరేట్‌ మీటింగ్స్‌ పేరుతో ఫ్యామిలీ ఫంక్షన్లు వదులుకోవడం.. ఇవన్నీ పనిచేసే మహిళలకు కొత్త కాదు. కానీ నిజానికి ఈ త్యాగాలన్నీ తిరిగి మనపైనే ప్రతికూల ప్రభావం చూపుతాయి. ‘ఛీ ఛీ జీవితంలో సంతోషమే లేకుండా పోయింది..’ అనుకునేలా చేస్తాయి. అయితే ఇలాంటి మానసిక ఒత్తిళ్లను జయిస్తేనే.. ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా ఉన్నతి సాధించగలం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు. ఇల్లైనా, ఆఫీసైనా.. ప్రాధాన్యతను బట్టి పనుల్ని విభజించుకోవడం.. కుటుంబాన్ని, పిల్లల్ని మిస్సవకుండా చక్కటి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఈ రెండింటి మధ్య సమన్వయం లోపించకుండా జాగ్రత్తపడచ్చు. ఈ సంతృప్తితో మరింత ఉత్సాహంగా ఆఫీస్‌ పనులు పూర్తి చేస్తే.. చక్కటి ఉత్పాదకతను అందించచ్చు. పరోక్షంగా కెరీర్‌ ఉన్నతినీ అందుకోవచ్చు.

వీటితో పాటు మీ జాబ్‌ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, స్ఫూర్తిదాయక పుస్తకాలు-వ్యక్తుల జీవితాలు చదవడం.. ఇవన్నీ మిమ్మల్ని కెరీర్‌ పరంగా మరో మెట్టు ఎక్కేలా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్