Hilda Baci: వంద గంటల పాటు ఆపకుండా వంట చేసింది!

అభిరుచుల్ని ఆస్వాదించేవారు కొందరైతే.. అవే అభిరుచులతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనుకుంటారు మరికొందరు. నైజీరియాకు చెందిన హిల్డా బాసి రెండో కోవకు చెందుతుంది. పాకశాస్త్రంపై మక్కువతో చెఫ్‌గా మారిన....

Published : 20 May 2023 12:36 IST

(Photos: Instagram)

అభిరుచుల్ని ఆస్వాదించేవారు కొందరైతే.. అవే అభిరుచులతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనుకుంటారు మరికొందరు. నైజీరియాకు చెందిన హిల్డా బాసి రెండో కోవకు చెందుతుంది. పాకశాస్త్రంపై మక్కువతో చెఫ్‌గా మారిన ఆమె.. తన ప్రావీణ్యంతో అరుదైన ప్రత్యేకతను సొంతం చేసుకోవాలనుకుంది. ఈ ఆలోచనతోనే వంద గంటల పాటు ఏకధాటిగా వంట చేసేందుకు సన్నద్ధమైంది. ఇటీవలే తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసిన హిల్డా.. ‘ఎక్కువ గంటల పాటు నిర్విరామంగా వంట చేసిన వ్యక్తి’గా గత గిన్నిస్‌ రికార్డును బద్దలుకొట్టింది. ప్రస్తుతం ఈ యువ చెఫ్‌ లక్ష్య ఛేదనను గిన్నిస్‌ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ప్రపంచ రికార్డును సొంతం చేసుకోనున్న హిల్డా చెఫ్‌ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

సోషల్‌ మీడియాలో ప్రసిద్ధి చెందిన హిల్డాకు చిన్న వయసు నుంచే వంట చేయడమంటే మక్కువ ఎక్కువ. పెరిగి పెద్దయ్యే క్రమంలో కిచెన్‌లో వంట చేసే తన తల్లిని చూసి స్ఫూర్తి పొందిందామె. తమ కోసం విభిన్న వంటకాలు వండి వార్చే తన తల్లి పాకశాస్త్ర నైపుణ్యాలను ఆమె కూడా ఒంటబట్టించుకోవాలనుకుంది. ‘ఈ ఇష్టంతోనే స్కూలు నుంచి తిరిగి రాగానే, సెలవు రోజుల్లో వంటింట్లో అమ్మకు సహకరించేదాన్ని. సరికొత్త వంటకాలు ప్రయత్నించేదాన్ని.. అమ్మ కూడా ఆయా వంటకాల్లోని మెలకువల్ని నాకు నేర్పించేది’ అంటోంది హిల్డా.

రుచులతో పాపులారిటీ!

ఎక్కువగా ఇంటి ఆహారాన్నే ఇష్టపడుతూ పెరిగిన హిల్డా.. భవిష్యత్తులో చెఫ్‌గా స్థిరపడాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ దిశగా రాణించింది. మడోనా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. అక్కడి ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన వంటల కార్యక్రమానికి వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. ఆపై చెఫ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన హిల్డా.. రోజూ సరికొత్త నైజీరియన్‌ రుచుల్ని అక్కడి ఆహార ప్రియులకు అందిస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక 2021లో ‘జోల్‌ఆఫ్‌ ఫేస్‌ఆఫ్‌’ అనే వంటల పోటీలో పాల్గొని గెలుపొందింది. ఆ దేశంలో ప్రసిద్ధి చెందిన ‘జోల్‌ఆఫ్‌ రైస్‌’ అనే వంటకాన్ని అత్యంత రుచిగా వండినందుకు గాను ఈ పోటీలో ‘ఉత్తమ చెఫ్‌’గా అవార్డు అందుకుందామె. తనలో ఉన్న ప్రత్యేకమైన పాకశాస్త్ర ప్రావీణ్యాలతో అరుదైన గుర్తింపు సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న హిల్డా.. ఇటీవలే వంద గంటల పాటు నిర్విరామంగా వంట చేయాలన్న సాహసానికి పూనుకుంది.

96 గంటలే అనుకున్నా.. కానీ!

ఆత్మవిశ్వాసం ఉన్న వారు లక్ష్యం ఎంత పెద్దదైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా.. సునాయాసంగా ఛేదిస్తుంటారు. హిల్డా కూడా అదే చేసింది. కొండంత లక్ష్యం కనిపిస్తున్నా.. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించిందీ యంగ్‌ చెఫ్.

‘అవకాశం, ఆదరణ లభిస్తే యువత కూడా తాము అనుకున్న లక్ష్యాల్ని సునాయాసంగా చేరుకోవచ్చని నిరూపించడానికే ఈ సాహసానికి పూనుకున్నా.. మరోవైపు లక్ష్యాన్ని చేరుకొని దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలనుకున్నా. ఒక్క ప్రయత్నంతో రెండు కోరికలు నెరవేరాయి. అయితే తొలుత 96 గంటలే వంట చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నా.. కానీ నా వంటకాల రుచి చూడడానికి, నన్ను ప్రోత్సహించడానికి వందల మంది బయట క్యూ కట్టారు.. ఈ ఉత్సాహం మరో నాలుగ్గంటల పాటు నన్ను కిచెన్‌కే పరిమితం చేసింది.. తద్వారా వంట సమయం వంద గంటల మార్క్‌ దాటింది..’ అంటూ చెప్పుకొచ్చింది హిల్డా.

55 రెసిపీలు.. 100 భోజనాలు!

వంటింట్లో గంట అటూ ఇటూ అయితేనే.. ఆ వేడికి భరించలేం. అలాంటిది నిర్విరామంగా వంద గంటలు వంట చేయడమంటే మాటలు కాదు.. ఈ క్రమంలో ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నానంటోంది హిల్డా.

‘మే 11 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నా కుకింగ్‌ మారథాన్‌ ప్రారంభమైంది. మే 15 సోమవారం సాయంత్రానికి వంద గంటలు పూర్తి కావడంతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోగలిగా. ఈ క్రమంలో 55కి పైగా ప్రత్యేక వంటకాలు తయారుచేశా. వంద మందికి పైగా సరిపడా భోజనం ప్రిపేర్‌ చేశా. ఇక్కడి పాపులర్‌ వంటకం జోల్‌ఆఫ్‌ రైస్‌తో పాటు బియ్యం, పాస్తాలతో విభిన్న రెసిపీలు, అకారా అనే పాపులర్‌ స్ట్రీట్‌ఫుడ్‌.. వంటివి నా రెసిపీల్లో హైలైట్‌గా నిలిచాయి. ఇలా స్థానిక రుచులతో పాటు పలు విదేశీ వంటకాలూ ప్రయత్నించా. గంటగంటకూ ఐదు నిమిషాల పాటు బ్రేక్‌ తీసుకున్నా. ఈ సమయంలో నాకు సహాయం చేయడానికి ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే ఆహ్వానించేదాన్ని. ఇక ఈ బ్రేక్‌ సమయంలో.. వేడి నుంచి ఉపశమనం పొందడానికి తలపై కోల్డ్‌ కంప్రెషన్స్‌ అప్లై చేసుకోవడం, పాదాలు మర్దన చేయించుకోవడం.. వంటి చిన్న చిన్న చిట్కాలు పాటించాను..’ అంటూ చెప్పుకొచ్చిందీ ట్యాలెంటెడ్ చెఫ్.


మన రికార్డు బద్దలు!

వంద గంటల పాటు వంట చేసి అసాధారణ గుర్తింపు సంపాదించుకున్న హిల్డా.. తన కుకింగ్‌ మారథాన్‌తో గత గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టింది. 2019లో ‘ఎక్కువ గంటల పాటు నిర్విరామంగా వంట చేసిన వ్యక్తి’గా మన దేశానికి చెందిన లతా టాండన్‌ గిన్నిస్‌లో చోటు సంపాదించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆమె.. ఆ సమయంలో 87 గంటల 45 నిమిషాలతో ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక తాజాగా హిల్డా దీన్ని అధిగమించింది. అయితే హిల్డా తాజా ఫీట్‌కు సంబంధించిన వీడియోలు, సాక్ష్యాధారాల్ని ప్రస్తుతం గిన్నిస్‌ వారు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ‘లాంగెస్ట్‌ కుకింగ్‌ మారథాన్‌ (వ్యక్తిగత)’ విభాగంలో గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించనుందీ నైజీరియన్‌ చెఫ్.

‘నైజీరియా రుచులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఇక్కడి వంటకాల్లో చాలావరకు సులభంగా తయారుచేసుకునేలా ఉంటాయి. ఒకసారి చూస్తే చాలు వాటిని ఇట్టే ప్రయత్నించచ్చు..’ అంటోందీ కుకింగ్‌ లవర్‌. ప్రస్తుతం ‘మై ఫుడ్‌ బై హిల్డా’ పేరుతో ఓ రెస్టరంట్‌ నడుపుతోన్న ఆమె.. పాకశాస్త్రానికి సంబంధించిన మెలకువలు, కొత్త కొత్త రెసిపీల్ని వీడియోల రూపంలో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ డిజిటల్‌ క్రియేటర్‌గానూ పేరు సంపాదించుకుంది. ఆమె ఇన్‌స్టా ఖాతాకు 12 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్