పేద పిల్లలకు ఉచిత విద్యనందిస్తూ..

చదువు విలువ ఆ దంపతులకు బాగా తెలుసు. అందుకే దానికి దూరమవుతున్న వారిని చూసి వాళ్ల మనసు చలించి పోయింది.  వాళ్లకి విద్యను చేరువ చేయడానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న దీపక్‌, సీతారాణిల స్ఫూర్తి కథనమిది.

Updated : 13 Feb 2023 14:19 IST

చదువు విలువ ఆ దంపతులకు బాగా తెలుసు. అందుకే దానికి దూరమవుతున్న వారిని చూసి వాళ్ల మనసు చలించి పోయింది. వాళ్లకి విద్యను చేరువ చేయడానికి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న దీపక్‌, సీతారాణిల స్ఫూర్తి కథనమిది.

దీపక్‌, సీతారాణిలది ఒడిశాలోని కాలాహంది. వీరు నివసించే ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారంతా దాదాపు భవన కూలీలే. ఆ కుటుంబాలకు చెందిన పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటారు. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌, స్మార్ట్‌ఫోన్‌కు చదువు పరిమితమైంది. ఈ ప్రాంత చిన్నారులు ఫోన్‌ సౌకర్యం లేక విద్యకు దూరమవడాన్ని దీపక్‌, సీతారాణి గుర్తించారు. వీరందరినీ చదువుకు దగ్గర చేద్దామనుకున్నారీ దంపతులు.

పేదకుటుంబానికి చెందిన దీపక్‌ మెట్రిక్యులేషన్‌ పూర్తిచేశారు. ‘మావారికి చదువుకోవాలని ఆసక్తి ఉన్నా.. తగిన ఆర్థికస్థోమత లేకపోవడంతో ఉన్నతవిద్యాభ్యాసం కలగానే మిగిలింది. పెళ్లి అయ్యే సమయానికి డిగ్రీ సగంలో ఉన్న నన్ను దీపక్‌ ప్రోత్సహించి పీజీ పూర్తిచేయించారు. ఇద్దరం మూడు రెస్టారెంట్ల నిర్వహణతోపాటు క్యాటరింగ్‌ సర్వీస్‌ చేస్తుంటాం. పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్థుల కోసం 2019లో పబ్లిక్‌ లైబ్రరీ తెరిచాం. అప్పటి నుంచి పుస్తకాలుసహా కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించినవన్నీ అందుబాటులో ఉంచుతున్నాం. ఆ తర్వాత కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల నిర్వహణ మొదలైంది. ఫోన్స్‌ సౌకర్యం లేని చిన్నారులు చదువులో వెనకబడటం గుర్తించాం. అటువంటివారందరికీ సాయం చేద్దామనిపించింది.అలా గ్రామాలన్నీ పర్యటించి కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ వంటివన్నీ ఉచితంగా పంపిణీ చేసేవాళ్లం. ఈ పిల్లలందరికీ పాఠ్యాంశాలు బోధిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన రావడంతో 2021లో కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభించాం. మాతోపాటు బోధనకు మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాం. ఇక్కడ ప్రస్తుతం 105 మంది ప్రాధమిక స్థాయి నుంచి పదోతరగతి విద్యార్థుల వరకు ఉచితంగా చదువుకుంటున్నారు. డ్రాయింగ్‌, డిబేట్స్‌, క్రీడలు వంటివి కూడా ఇక్కడ ఉంటాయి. స్కూళ్లు తెరిచినప్పటికీ ట్యూషన్‌కు పిల్లలు ఇక్కడకొస్తున్నారు.

500మందికి సరిపోయేలా కోచింగ్‌ సెంటర్‌ కోసం ఒక శాశ్వతభవనాన్ని నిర్మిస్తున్నాం. త్వరలో దాన్ని కూడా ప్రారంభించి మరింత ఎక్కువమంది పేద పిల్లలకు విద్య అందేలా చేయాలన్నది మా కోరిక’ అంటున్నారు సీతారాణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్