మీది జిడ్డు చర్మమా?

జిడ్డు చర్మతత్వంతో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు. కానీ ఈ రకమైన చర్మతత్వం ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తరహా చర్మతత్వం ఉన్నవారు ఎప్పుడూ తమ చర్మం పొడిగా ఉండేలా చూసుకోవాలని ఆరాటపడుతుంటారు....

Published : 15 Feb 2024 13:06 IST

జిడ్డు చర్మతత్వంతో చాలామంది అసౌకర్యానికి గురవుతుంటారు. కానీ ఈ రకమైన చర్మతత్వం ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తరహా చర్మతత్వం ఉన్నవారు ఎప్పుడూ తమ చర్మం పొడిగా ఉండేలా చూసుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే జిడ్డును తగ్గించే క్రీములు వాడడం, పౌడర్ సాయంతో చర్మం పొడిగా కనిపించేలా చేయడం.. వంటివి చేస్తుంటారు. కానీ దీనివల్ల తమ సమస్యను వారు మరింత పెంచుకుంటున్నట్లే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జిడ్డు చర్మతత్వం కలిగిన వారికి ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలేంటో తెలుసుకుందాం రండి..

సన్‌స్క్రీన్ అవసరమే...
‘అసలే చర్మం జిడ్డుగా ఉంది... దీనికి తోడు సన్‌స్క్రీన్ రాసుకుంటే ఇంకా జిడ్డుగా తయారవుతుంద’ని కొంతమంది సన్‌స్క్రీన్ రాసుకోవడం మానేస్తారు. కానీ ఇది సరికాదు. ఎందుకంటే మన చర్మానికి విటమిన్ ‘డి’ అందాలంటే సూర్యకాంతి శరీరానికి తగలాలి. సన్‌స్క్రీన్‌కి దూరంగా ఉంటే సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావం నేరుగా చర్మంపై పడుతుంది. తద్వారా చర్మం నల్లబడడం, ముడతలు పడడం వంటి సమస్యలొస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఇది అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా అడ్డుగోడగా నిలుస్తుంది.

మాయిశ్చరైజర్ మానద్దు!
జిడ్డు చర్మం ఉన్న వారిలో చాలామంది తమ చర్మం సహజసిద్ధమైన నూనెల్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు బయటి నుంచి మాయిశ్చరైజర్ అందించాల్సిన అవసరమేముందని అనుకుంటారు. కానీ ఇది పొరపాటు! ఎలాంటి చర్మానికైనా మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. అయితే ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాత్రం ఆయిల్ బేస్డ్ కాకుండా నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఇది అప్లై చేయడానికి ముందుగా టోనర్‌తో చర్మాన్ని శుభ్రపర్చుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి. దీనివల్ల చర్మానికి తగిన పోషణ అందడమే కాదు.. జిడ్డుగా కనిపించకుండానూ ఉంటుంది.

పౌడర్‌తో సమస్యే!
జిడ్డు చర్మతత్వం ఉన్న వారు తమ చర్మం ఉత్పత్తి చేసే అధిక నూనెల్ని పౌడర్‌తో కవర్‌ చేసుకోవాలనుకుంటారు. అయితే దీనివల్ల సమస్యకు తాత్కాలిక పరిష్కారం దొరికినా.. ఈ పౌడర్ చర్మ రంధ్రాలను మూసేయడం వల్ల మొటిమల సమస్య తలెత్తుతుంది. చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. అందుకే పౌడర్‌ని ఉపయోగించడం కంటే సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి జిడ్డుదనాన్ని కాస్త తగ్గించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్