Pragya Misra : ఆ సంస్థలో తొలి ఉద్యోగి!

చాట్‌జీపీటీ.. కృత్రిమ మేధతో పనిచేసే ఈ చాట్‌బాట్‌ గురించి తెలియని వారుండరు. దీని మాతృక సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ మన దేశంలోనూ తమ కార్యకాలాపాల్ని విస్తరించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే భారత్‌లో తమ తొలి నియామక ప్రక్రియను చేపట్టిందీ సంస్థ. 

Updated : 20 Apr 2024 19:24 IST

(Photos: Instagram)

చాట్‌జీపీటీ.. కృత్రిమ మేధతో పనిచేసే ఈ చాట్‌బాట్‌ గురించి తెలియని వారుండరు. దీని మాతృక సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ మన దేశంలోనూ తమ కార్యకాలాపాల్ని విస్తరించాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే భారత్‌లో తమ తొలి నియామక ప్రక్రియను చేపట్టిందీ సంస్థ. ఈ రిక్రూట్‌మెంట్‌లో భారత్‌లో ‘ఓపెన్‌ ఏఐ’కి తొలి ఉద్యోగిగా ఎంపికయ్యారు 39 ఏళ్ల ప్రగ్యా మిశ్రా. పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌గా, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్య.. తాజాగా ఓపెన్‌ ఏఐ సంస్థలో అరుదైన అవకాశం అందుకొని మరోసారి పాపులరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ తొలి మహిళ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

చేసే పనిలో ఎదురయ్యే సవాళ్లు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాసే తన కెరీర్‌కు ఆజ్యం పోస్తుంటాయని చెబుతున్నారు ప్రగ్య. దిల్లీకి చెందిన ఆమె.. ‘దిల్లీ యూనివర్సిటీ’లో కామర్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేశారు. ‘లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌-పొలిటికల్‌ సైన్స్‌’ నుంచి ‘బార్గెయినింగ్‌-నెగోషియేషన్‌’ విభాగంలో డిప్లొమా చదివారు. చదువు పూర్తయ్యాక ‘ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా’ కంపెనీలో ఏడాది పాటు మార్కెటింగ్‌ టీమ్‌కి అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేసిన ఆమె.. దిల్లీలోని ‘రాయల్‌ డానిష్‌ ఎంబసీ’లో మరికొన్నాళ్లు విధులు నిర్వర్తించారు. మూడేళ్ల పాటు వాట్సప్‌లో కమ్యూనికేషన్స్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రగ్య.. 2021 నుంచి ‘ట్రూకాలర్‌’ సంస్థలో ‘ప్రభుత్వ సంబంధాల విభాగా’నికి డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

తొలి ఉద్యోగిగా..!

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ ఏఐ భారత్‌లోనూ తన కార్యకలాపాల్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే గతేడాది ఈ సంస్థ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే ఈ సంస్థ తాజాగా భారత్‌లో తమ తొలి నియామక ప్రక్రియను చేపట్టింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భారత్‌లో ఓపెన్‌ ఏఐకి తొలి ఉద్యోగిగా ఎంపికయ్యారు ప్రగ్య. ఈ సంస్థ ‘ప్రభుత్వ సంబంధాల విభాగా’నికి హెడ్‌గా ఆమెను నియమించింది. దీంతో ఈ నెల చివర్లో ఓపెన్‌ ఏఐతో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు ప్రగ్య.

‘ఇన్నేళ్ల నా కెరీర్‌ అనుభవం నాకెంతో నేర్పింది. టెక్నాలజీ రంగంలో అనునిత్యం ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ నన్ను నేను మెరుగుపరచుకునేందుకు, నా నెట్‌వర్క్‌ పరిధిని విస్తరించుకునేందుకు దోహదం చేసింది. దేశవ్యాప్తంగా డిజిటల్‌ సాంకేతికతను విస్తరించడానికి నా వంతు పాత్ర పోషించడం నాకు సంతృప్తినిచ్చింది. వృత్తిలో భాగంగా నిత్యం నేనెదుర్కొనే సవాళ్లు, కొత్త విషయాలు నేర్చుకొనే తత్వం, తపన.. ఇవన్నీ నన్ను వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎదిగేలా చేస్తున్నాయి..’ అంటున్నారామె.

ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌!

ప్రస్తుతం దేశంలోని ఓపెన్‌ ఏఐకి తొలి ఉద్యోగిగా నియమితురాలైన ప్రగ్య.. పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌గా, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇదివరకే భారతీయులకు సుపరిచితం. ధ్యానాన్ని బాగా నమ్మే ఆమె.. దీని వల్ల కలిగే ప్రయోజనాల్ని సోషల్‌ మీడియా వేదికగా అందరికీ తెలియజేస్తుంటారు. ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాన సంపద, జీవిత పరమార్థం.. తదితర అంశాల్లో సంబంధిత నిపుణులతో కలిసి పాడ్‌కాస్ట్‌లు కూడా నిర్వహిస్తుంటారు ప్రగ్య. ఇందులో భాగంగానే ‘ప్రగ్యాన్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌నూ నడుపుతున్నారామె. ప్రగ్య గోల్ఫ్‌ క్రీడాకారిణి కూడా! 1998 నుంచి 2007 వరకు దేశం తరఫున ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గోల్ఫ్‌ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్