రాత్రికిరాత్రే పల్నాడు వెళ్లా!

పల్నాడు... ఒకప్పుడు పౌరుషానికి మారుపేరు. తెలుగు రాష్ట్రాలకే తెలిసిన ఆ పేరు ఇప్పుడు దేశం మొత్తానికీ పరిచయమైంది.  అయితే అది అలనాటి చరిత్రను తెలియజేస్తూ కాదు... గొడవలు, అల్లర్లతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. వాటిని అదుపు చేయలేక ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు.

Updated : 08 Jun 2024 07:47 IST

పల్నాడు... ఒకప్పుడు పౌరుషానికి మారుపేరు. తెలుగు రాష్ట్రాలకే తెలిసిన ఆ పేరు ఇప్పుడు దేశం మొత్తానికీ పరిచయమైంది.  అయితే అది అలనాటి చరిత్రను తెలియజేస్తూ కాదు... గొడవలు, అల్లర్లతో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. వాటిని అదుపు చేయలేక ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు. ఆ తరవాత వచ్చారు మలికా గర్గ్‌. ‘మగవాళ్ల వల్లే కాలేదు. ఈమె ఏం చేయగలుగుతుంద’నుకున్న వాళ్ల నోళ్లను తన పనితనంతో మూయించి, అందరిచేతా ‘శభాష్’ అనిపించుకున్నారు. ఆవిడను ‘వసుంధర’ పలకరించింది...

  •  ఐఐటీ నుంచి సివిల్స్‌కెలా..?

మాది దిల్లీ. ఐఐటీ దిల్లీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదివా. ఆఖరి ఏడాది వరకూ తరవాతేంటన్నది తెలియలేదు. మానాన్న కూడా ఐపీఎస్‌ అధికారే. ఆయన స్ఫూర్తితో సివిల్స్‌ వైపు అడుగేశా. తొలి ప్రయత్నం విఫలమైనా రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌ సాధించా. 2015 బ్యాచ్‌ మాది. మొదటి పోస్టింగ్‌ బెంగాల్‌లో. అక్కడ మూడేళ్లు చేశాక కృష్ణా జిల్లాకి అడ్మిన్‌ ఏఎస్పీగా వచ్చా. అక్కడినుంచి ప్రకాశం జిల్లాకి ఎస్పీగా పదోన్నతిపై వెళ్లా. తిరుపతిలోనూ 20 రోజులు చేశా. వెనక ఏం జరిగిందో తెలియదు కానీ... బదిలీ అయ్యి, వేరే ప్రాంతానికి వెళ్లిపోయా.

  • పల్నాడుకి వెళ్లాలన్నప్పుడు...

ఓరోజు పల్నాడు ఎస్పీగా వెళ్లాలని ఆదేశాలొచ్చాయి. అప్పటికి నేను ఛండీగఢ్‌లో ఎన్నికల అబ్జర్వర్‌గా ఉన్నా. ఇంకా వారం పనిచేయాల్సి ఉంది. కానీ... వెంటనే బయల్దేరాలంటే రాత్రికిరాత్రి నరసరావుపేటకు వచ్చా. అప్పటికే ఇద్దరు ఎస్పీలు బదిలీ అయ్యారు. నేను చేయగలనా అన్న ఆలోచనా వచ్చింది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ముందుకెళ్ల్లాలన్న తత్వం నాది. అందుకే వెంటనే విధుల్లో చేరిపోయా.

  •  భాష ఇబ్బందేమైనా...

పల్నాడు నాకు ముందు నుంచీ పరిచయమే. ప్రకాశం జిల్లాలో చేస్తున్నప్పుడు కింది స్థాయి సిబ్బంది చాలావరకూ ఆ ప్రాంతంవారే. దాని గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అలాంటిచోట ఇలా గొడవలు జరగడం బాధించింది. ఆ అల్లర్లకు కారణాలపై కొంత అధ్యయనం చేశా. పెద్ద ఎత్తున హింస చెలరేగుతున్నా వీళ్లపై పోలీసులు కేసులు నమోదు చేయట్లేదు. రాజీ కుదిర్చి పంపేస్తున్నారు. అందుకే ఏమాత్రం భయపడట్లేదని అర్థమైంది. దాంతో ఇలా దాడులు, అల్లర్లకు పాల్పడుతున్నారు. అది గ్రహించాక ఈ అల్లరి మూకలపై కేసులు పెట్టించడం, ఎక్కడికక్కడ అరెస్టులుచేసి, రిమాండ్‌లకు పంపడం చేశా. బైండోవర్లు, రౌడీషీట్లూ తెరిపించా. దీంతో పరిస్థితి కొంత దారిలోకి వచ్చింది. అన్నట్టూ నాకు తెలుగు మాట్లాడటమే కాదు, రాయడం, చదవడం కూడా వచ్చు.  పైగా ఒత్తిళ్లకి తలొగ్గని నా స్వభావం కూడా ఇందుకు సాయపడింది.

  • కౌన్సెలింగ్‌ ఆలోచనెలా?

కేసులు, రిమాండ్‌లు యువతకు హీరోయిజంలా తోచినా వాటివల్ల జరిగే నష్టమెంతో. వారికి ఆ విషయం తెలియజెప్పాలని అన్ని ప్రధాన పట్టణాల్లో బహిరంగ సభలు పెట్టి, కౌన్సెలింగ్‌ ప్రారంభించాం. బైండోవర్‌ చేసేటప్పుడు రూ.లక్ష నుంచి 2లక్షల వరకూ తహశీల్దార్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇదెంత భారం? అనవసరమైన గొడవల్లో ఇరుక్కుని ఇలా డబ్బుల్ని పోగొట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిరగడం అవసరమా? అని ప్రశ్నించేదాన్ని. కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనమైపోతుందని కౌన్సెలింగ్‌ చేశాం. ఒకేరోజు మూడు పట్టణాల్లో కౌన్సెలింగ్‌ సభలూ, పోలీసులు, సాయుధ బలగాలతో ర్యాలీలూ నిర్వహించా. ఇంటికెళ్లేసరికి రాత్రి 2 అయ్యేది. తిరిగి ఉదయం 6 కల్లా విధులకు హాజరయ్యేదాన్ని. ఇంత కష్టపడ్డాం కనుకే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇందులో నా సిబ్బంది సహకారాన్నీ మర్చిపోలేను.

  • అమ్మ బాధ్యతనెలా..?

నాకు నాలుగేళ్ల బాబు. రాత్రి ఇంటికెళ్లేసరికి పడుకునేవాడు, నేను బయల్దేరే సమయానికి లేచేవాడు కాదు. కౌంటింగ్‌ ముగిసిన మరుసటిరోజు అంటే 20రోజులకు వాడిని దగ్గరకు తీసుకుని ముద్దాడగలిగా. జిల్లాలో ఉన్న పరిస్థితులు, డ్యూటీ కారణంగా కుటుంబానికి దూరమవ్వక తప్పదు. మా అత్తగారు ఉండటంతో బాబు బెంగలేదు. మావారు వకుల్‌ జిందాల్‌ బాపట్ల జిల్లా ఎస్పీ. ఈ ప్రయాణంలో ఆయన సలహాలూ నాకు సాయపడ్డాయి.

  •  భవిష్యత్తులో...

పల్నాడులో ప్రజలు పోలీసుస్టేషన్‌ గడప తొక్కడానికే భయపడుతున్నారు. పోలీసులు సరిగా స్పందించకపోవడమూ ఇందుకు కారణమే అని గ్రహించా. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పెరగాలి. స్థానికంగానే ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ఎస్పీ కార్యాలయం వరకూ వాళ్లు రాకూడదు. అలాగైతే పోలీసులు ఫెయిలైనట్లే. ఇక్కడే ఉంటే ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. ఇది ఒక్కరోజులోనో నెలలోనో రాదు. కొంత సమయం పడుతుంది. కాకపోతే అధికారులు మారిపోతూ ఉంటారు. దీంతో పరిస్థితి మొదటికొస్తుంది. అయితే దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన పల్నాడులో చాలావరకూ అల్లర్లను అడ్డుకట్ట వేయడం ఆనందంగా ఉంది. ఇక్కడి అనుభవం మరోచోటా పనికొస్తుందని చెప్పగలను. ఆడవాళ్లం ఎంత ప్రతిభ ఉన్నా భయంతో ముందడుగు వేయం. అప్పగిస్తే చేసేవారుంటారు. అలాకాకుండా ‘నేను చేయగలను’ అని ధైర్యంగా ముందుకు రండి. మీ సత్తా మీకే తెలుస్తుంది... ఈ తరానికి నా సలహా ఇది.

భూపతి సత్యనారాయణ, నరసరావుపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్