95 ఏళ్లలో మొదటి మహిళ.. ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్’!

‘పరుగుల రాణి’గా కీర్తి గడించిన పీటీ ఉష గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అసలు అమ్మాయిలు బయట అడుగుపెట్టడమే గగనం అనుకునే రోజుల్లో అథ్లెటిక్స్‌ సూట్‌ ధరించి.. ప్రపంచ వేదికలపై పరుగు పందెంలో పతకాలు సాధించి.. భారత పతకాన్ని....

Published : 29 Nov 2022 12:30 IST

(Photo: Twitter)

‘పరుగుల రాణి’గా కీర్తి గడించిన పీటీ ఉష గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అసలు అమ్మాయిలు బయట అడుగుపెట్టడమే గగనం అనుకునే రోజుల్లో అథ్లెటిక్స్‌ సూట్‌ ధరించి.. ప్రపంచ వేదికలపై పరుగు పందెంలో పతకాలు సాధించి.. భారత పతకాన్ని రెపరెపలాడించారు. పలు వేదికలపై జరిగిన ఆసియా క్రీడల్లో 23 పతకాలను సాధించారు. అంతేకాకుండా 1984 ఒలింపిక్స్‌లో వెంట్రుకవాసిలో పతకాన్ని కోల్పోయినా అథ్లెటిక్స్‌లో భారత్‌ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇలా పరుగు పందెంలో తనదైన పేరు లిఖించున్న ఈ పయ్యోలి ఎక్స్‌ప్రెస్.. 95 ఏళ్ల చరిత్ర ఉన్న భారత ఒలింపిక్‌ సంఘానికి మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక కాబోతున్నారు. కొత్త పాత్రలో తిరిగి తన పరుగును కొనసాగించబోతున్నారు.

భారత ఒలింపిక్‌ సంఘానికి అధ్యక్ష పదవితో పాటు కార్యవర్గ సభ్యుల నియామకం కోసం ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు నామినేషన్లు సమర్పించడానికి నవంబర్‌ 27 చివరి తేదీగా నిర్ణయించారు. అయితే అధ్యక్ష పదవి కోసం పీటీ ఉష ఒక్కరే నామినేషన్‌ వేసినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. దాంతో భారత ఒలింపిక్‌ సంఘానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష (58) ఎన్నిక లాంఛనమైంది. ఈ క్రమంలో మహరాజా యాదవీంద్ర సింగ్ (1934,  క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి క్రీడాకారిణిగా ఉష ఘనత సాధించబోతున్నారు.

వేగంగా నడవడంతో...

పీటీ ఉష 1964, జూన్‌ 27న కేరళలోని కూతలి అనే గ్రామంలో జన్మించారు. ఆమె పూర్తి పేరు పిలవుల్లకండి తెక్కెరపరంబిల్ ఉష. బక్కపలుచగా ఉండే ఉషకు వేగంగా నడవడం అలవాటు. అది ప్రఖ్యాత కోచ్‌ ఓఎం నంబియార్‌ దృష్టిని ఆకర్షించింది. దాంతో ఈ అమ్మాయికి శిక్షణ ఇస్తే మంచి స్ప్రింటర్ అవుతుందని భావించి, ఉషకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా 12 ఏళ్ల వయసులోనే ఉష తన పరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. కోచ్‌ నమ్మకాన్ని వమ్ము చేయని ఉష పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచి అనేక పతకాలను సాధించారు.

ఆసియా పతకాల రాణి...!

రాష్ట్ర స్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీల్లో అడుగుపెట్టారు ఉష. ఆ తర్వాత దేశం తరపున వివిధ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను సాధించారు. అయితే ఉషకు మాత్రం ఆసియా క్రీడలే ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఉష మొదటిసారి 1982 న్యూదిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు వెండి పతకాలను సాధించారు. అప్పటి నుంచి 1998 వరకు వివిధ దేశాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఆమె మొత్తం 23 పతకాలను సాధించి పరుగుల రాణిగా గుర్తింపు పొందారు. ఇందులో 14 బంగారు పతకాలు ఉండడం విశేషం. ఎన్నో పతకాలు సాధించిన ఉషకు 1986 సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడలు ప్రత్యేకమని చెప్పాలి. ఈ పోటీల్లో ఆమె ఏకంగా 4 బంగారు పతకాలతో పాటు ఒక వెండి పతకాన్ని గెలుపొందారు. ఈ క్రమంలో ‘పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌’గా గుర్తింపు పొందారు.

వెంట్రుకవాసిలో...

ఉష కెరీర్‌లో 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌ ఎంతో ప్రత్యేకం. అంతకుముందు మాస్కోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్లో 100.మీ, 200.మీ రేసుల్లో అంతగా రాణించకపోవడంతో.. 1983 ఏషియన్‌ ఛాంపియన్‌షిప్స్లో 400.మీ రేసులో పోటీ పడి బంగారు పతకాన్ని సాధించారు. ఆమె కోచ్‌ నంబియార్ ఒలింపిక్స్‌లో కూడా 400.మీ రేసులో ప్రయత్నించమని సూచించడంతో అదే కేటగీరీలో పోటీ పడ్డారు. టోర్నీ ఆద్యంతం చక్కటి ప్రదర్శన చేసిన ఉష ఫైనల్స్‌కు చేరుకున్నారు. అయితే ఫైనల్‌ ఈవెంట్లో మాత్రం వెంట్రుకవాసిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నారు. ఈ పోటీల్లో క్రిస్టియానా కొజోకరు (రొమేనియా) 55.41, ఉష 55.42 సెకన్లలో తమ పరుగును ముగించారు. దాంతో కేవలం 0.01 సెకను తేడాతో ఆమె ఒలింపిక్‌ పతకాన్ని కోల్పోయారు. ఇది సెకనులో వందో వంతు. ఆ తర్వాత జరిగిన ఒలింపిక్స్‌లో ఆశించిన మేరకు రాణించలేకపోయారు. చివరిగా 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో పాల్గొని రిటైర్మెంట్ ప్రకటించారు.

ఆగని పరుగు..!

2000 సంవత్సరంలో తన పరుగుని ఆపిన ఉష తన లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. ఒలింపిక్స్‌ పతకాన్ని వెంట్రుకవాసిలో చేజార్చుకున్న ఆమె.. దానిని భారత్‌ తరపున మరొకరైనా సాధించాలనే లక్ష్యంతో 2002లో ‘ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌’ను ప్రారంభించారు. ‘ఒక్క ఒలింపిక్‌ పతకం విషయంలో తప్ప నా కెరీర్‌లో నేను సాధించిన విజయాల పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నా విద్యార్థుల్లో ఒకరు దానిని నెరవేరుస్తారని ఆకాంక్షిస్తున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రెండు దశాబ్దాలుగా ఎంతోమంది అథ్లెట్లను తీర్చిదిద్దారు. వీరిలో టింటు లూకా, జిస్నా మాథ్యూ, అబితా మేరీ మాన్యుయేల్‌ వంటి ప్రపంచ స్థాయి అథ్లెట్లు ఉన్నారు.

ఉష 1991లో శ్రీనివాసన్‌ అనే వ్యక్తిని వివాహమాడారు. వీరికి ఒక కొడుకు. అథ్లెటిక్స్‌లో పలు రికార్డులు సాధించిన ఉషను అనేక అవార్డులు వరించాయి. ఉషకు కేంద్ర ప్రభుత్వం 1984లో అర్జున అవార్డు ఇవ్వగా 1985లో పద్మశ్రీతో సత్కరించింది. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్