ప్రసవానంతరం.. ఇలా ఫిట్‌గా మారిపోదాం!

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే.. ప్రసవానంతరం కూడా ఈ ఎక్సర్‌సైజ్‌ రొటీన్‌ను కొనసాగిస్తే శారీరకంగా, మానసికంగా మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు.

Published : 07 Dec 2023 20:31 IST

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే.. ప్రసవానంతరం కూడా ఈ ఎక్సర్‌సైజ్‌ రొటీన్‌ను కొనసాగిస్తే శారీరకంగా, మానసికంగా మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. ప్రసవానంతర ఒత్తిడి నుంచీ బయటపడచ్చంటున్నారు. ఈక్రమంలో బిడ్డ పుట్టిన తర్వాత వ్యాయామాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

వైద్యుల సలహా తప్పనిసరి!

బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొందరు మహిళలు స్వయంగా తిరిగి తమ వ్యాయామ రొటీన్‌ని మొదలుపెడుతుంటారు. పొట్ట త్వరగా తగ్గించుకోవడానికి కాస్త కఠినమైన వ్యాయామాలు చేసే వారూ లేకపోలేదు. అయితే దీనివల్ల సత్ఫలితాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే ప్రసవానంతరం వ్యాయామాలు మొదలుపెట్టాలనుకుంటే మాత్రం.. ఎప్పుడు మొదలుపెట్టాలి? ఏయే వ్యాయామాలు చేయాలి? ఎంతసేపు చేయాలి? తదితర విషయాల్లో డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.

ప్రయోజనాలెన్నో!

ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మహిళలు బరువు పెరగడం సహజం. కాబట్టి వ్యాయామం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రసవానంతరం శరీరంలోని అవయవాలు కాస్త బలహీనంగా, సున్నితంగా తయారవుతాయి. కాబట్టి బరువులెత్తడం, వేగంగా చేసే పనులు.. మొదలైనవి చేయకపోవడం మంచిది. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ఫిట్‌గా తయారవడానికి వాకింగ్ చేయడం ముఖ్యం. ఈ క్రమంలో వంగినట్లుగా కాకుండా నిటారుగా నడవాలి.

ప్రసవానంతరం చాలామంది మహిళల్లో శక్తిస్థాయులు క్షీణిస్తాయి. ఫలితంగా నీరసపడిపోతారు. మళ్లీ వారి శరీరానికి శక్తి అందాలంటే వ్యాయామం మంచి సాధనం.

తల్లైన తర్వాత చాలామంది అధిక బరువు, పొట్ట, నిద్రలేమి.. వంటి సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతుంటారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు సాధన చేయడం మంచిది.

వ్యాయామం వల్ల రాత్రుళ్లు నిద్ర బాగా పడుతుంది. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

ప్రసవానంతరం కొంతమంది మహిళల్లో నడుంనొప్పి, కాళ్ల నొప్పులు.. వంటి సమస్యలొస్తాయి. వీటికీ వ్యాయామం చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్