ఆ మధుర జ్ఞాపకాలను నగల్లో బంధిస్తోంది!

మన జీవితంలో కొన్ని క్షణాలు ఎప్పటికీ మరపురాని మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అమ్మైన క్షణాలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈక్రమంలో ఉత్పత్తయ్యే చనుబాలు, బిడ్డ చిట్టిపొట్టి పాదాలు, బొడ్డు తాడు, సుతిమెత్తని జుట్టు.. ఇలా అమ్మకు ప్రతిదీ అపురూపమే! ఇలాంటి మధురానుభూతుల్ని....

Published : 23 Feb 2023 16:19 IST

(Photos: Instagram)

మన జీవితంలో కొన్ని క్షణాలు ఎప్పటికీ మరపురాని మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అమ్మైన క్షణాలూ ఇందుకు మినహాయింపు కాదు. ఈక్రమంలో ఉత్పత్తయ్యే చనుబాలు, బిడ్డ చిట్టిపొట్టి పాదాలు, బొడ్డు తాడు, సుతిమెత్తని జుట్టు.. ఇలా అమ్మకు ప్రతిదీ అపురూపమే! ఇలాంటి మధురానుభూతుల్ని మనసుకే పరిమితం చేయకుండా.. వాటికి భౌతిక రూపం ఇవ్వాలనుకుంది దిల్లీకి చెందిన ప్రీతి మ్యాగో. ఈ ఆలోచనతోనే ఆయా వస్తువులతో అందమైన నగల్ని తయారుచేయాలని సంకల్పించుకుంది. ఈ స్వీయ ప్రేరణే ‘మ్యాజిక్‌ ఆఫ్‌ మెమరీస్‌’ పేరుతో ఓ జ్యుయలరీ సంస్థను ప్రారంభించేలా చేసిందంటోంది ప్రీతి. ఇలా తన వినూత్న ఆలోచనతో ఎంతోమంది తల్లిదండ్రులకు అపురూప జ్ఞాపకాల్ని అందిస్తోన్న ఈ బిజినెస్‌ లేడీ.. ఇటీవలే ప్రముఖ వ్యాపార రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లోనూ సందడి చేసింది. అయితే ఈ వేదికగా నిధులు పొందలేకపోయినా.. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే అవకాశం దొరికిందంటోన్న ప్రీతి స్టార్టప్‌ జర్నీ మీకోసం..!

పంజాబ్‌ జలంధర్‌లో పుట్టిపెరిగింది ప్రీతి మ్యాగో. వృత్తి రీత్యా డాక్టర్‌ అయిన ఆమెకు ఆన్‌లైన్‌లో కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవడమంటే ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో ఓ జర్మనీ సంస్థ తయారుచేసిన తల్లిపాల నగలు ఆమె కంట పడ్డాయి. చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ నగలు ఆమెను ముగ్ధురాలిని చేశాయి. ఇలాంటి నగలు మన దేశంలోనూ అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనను ఆమెలో రేకెత్తించేలా చేశాయి. ఇదే 2019లో ‘మ్యాజిక్‌ ఆఫ్‌ మెమరీస్‌’ పేరుతో ఓ జ్యుయలరీ లైన్‌ను ప్రారంభించేందుకు దోహదం చేసిందని చెబుతోంది ప్రీతి.

ఆలోచనకు మంచి స్పందన!

‘ఓ జర్మన్ కంపెనీ తయారుచేసిన తల్లి పాల నగల్ని సోషల్‌ మీడియాలో చూసి ముందు ఆశ్చర్యపోయా. ఇదెలా సాధ్యమనిపించింది. కానీ అవి నాకు చాలా నచ్చాయి. అందుకే ఇదే ఆలోచనను మన దగ్గరా అమలు చేయాలనిపించింది. కానీ అదంత సులభం కాదని కాస్త లోతుగా పరిశోధిస్తే కానీ నాకు అర్థం కాలేదు. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టే క్రమంలో నా సోషల్‌ మీడియా పేజీలతో అనుసంధానమై ఉన్న తల్లులతో నా ఆలోచనను పంచుకున్నా. చాలామందికి నచ్చడంతో నగలు చేసివ్వమనేవారు. అవి నచ్చిన వారు మరిన్ని కావాలనేవారు. ఇలా బయటి నుంచి ఆర్డర్స్‌ రావడం మొదలయ్యాక.. మ్యాజిక్‌ ఆఫ్‌ మెమరీస్‌ సంస్థకు తెరతీశా. నాది వైద్య విద్యా నేపథ్యం కాబట్టి భౌతిక, రసాయన శాస్త్రాలపై మంచి పట్టుంది. ఆయా పదార్థాల్ని/వస్తువుల్ని చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచడమెలా అన్న విషయంలోనూ అవగాహన ఉంది..’ అంటూ చెప్పుకొచ్చింది ప్రీతి.

వారి అభిరుచులకు అనుగుణంగానే..!

చనుబాలు, పాపాయి జుట్టు, బొడ్డు తాడు.. వంటి వాటితో ఉంగరాలు, పెండెంట్స్‌, బ్రేస్‌లెట్స్‌.. వంటి విభిన్న రకాలైన నగలు తయారుచేస్తోంది ప్రీతి. ఈ క్రమంలో వినియోగదారుల అభిరుచులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నానంటోంది.
‘ఆయా వస్తువుల్ని వివిధ పద్ధతుల్లో డీహైడ్రేట్‌ చేసి.. వాటితో విభిన్న నగలు తయారుచేస్తున్నా. ఈ క్రమంలో కొత్తగా తల్లిదండ్రులైన వారి అభిరుచులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నా. మరికొంతమంది తమ చిన్నారి కోసమూ వీటితో ప్రత్యేకించి నగలు చేయించుకుంటున్నారు. ఇలా వీరికే కాదు.. పెట్‌ పేరెంట్స్‌కీ వివిధ రకాల జ్యుయలరీని తయారుచేసిస్తున్నా. ప్రస్తుతం చనుబాలతో తయారుచేసే జ్యుయలరీకే ఎక్కువ డిమాండ్‌ ఉంది..’ అంటోంది ప్రీతి.

‘షార్క్‌ ట్యాంక్‌’తో కలిసొచ్చింది!

తన ప్రత్యేకమైన జ్యుయలరీ డిజైన్లతో ఆకట్టుకుంటూనే.. కొత్తగా తల్లైన వారికి అపురూప జ్ఞాపకాల్ని పంచుతోన్న ప్రీతి.. ఇటీవలే ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లో పాల్గొంది. అయితే తన వ్యాపార ఆలోచనతో షార్క్స్‌ (పెట్టుబడిదారులు/న్యాయనిర్ణేతలు)ని ఆకట్టుకున్నప్పటికీ నిధులు గెలుచుకోలేకపోయిన ఆమె.. ఈ కార్యక్రమం ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలిగానంటోంది.

‘నా వ్యాపారానికి మంచి ఆదరణ లభిస్తోన్నా.. ఈ కాన్సెప్ట్‌పై సమాజంలో కొన్ని అపోహలున్నాయి. అయినా నా వ్యాపార ఆలోచన ఈ రియాల్టీ షోకు ఎంపికవుతుందని నేను ఊహించలేదు. ఏదేమైనా ఈ షో నా వ్యాపారాన్ని మరింతమందికి చేరువ చేసింది. మరిన్ని నిధులు సమకూర్చుకొని నా టీమ్‌ను, వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. తద్వారా ఎంతోమందికి ఈ అపురూప జ్ఞాపకాల్ని చేరువ చేయచ్చు..’ అంటోన్న ప్రీతి ప్రస్తుతం ఓవైపు తన వ్యాపారంలో రాణిస్తూనే.. మరోవైపు ఓ బిడ్డకు తల్లిగా అమ్మతనాన్నీ ఆస్వాదిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్