Moms Of Vadodara: అమ్మలకు అండగా.. ఆమె!

అమ్మతనం.. మహిళల జీవితాల్లో ఎన్నో సంతోషాలు మోసుకొస్తుందీ దశ. వాటితో పాటే శారీరక మార్పులు, బరువు పెరగడం, నిద్రలేమి, ఒత్తిడికి గురవడం.. వంటి సమస్యలతో చాలామంది తల్లులు డిప్రెషన్‌లోకి కూరుకుపోతుంటారు. దీనికి విరుగుడు మన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై స్వయంగా...

Published : 09 Feb 2023 21:01 IST

(Photos: Instagram)

అమ్మతనం.. మహిళల జీవితాల్లో ఎన్నో సంతోషాలు మోసుకొస్తుందీ దశ. వాటితో పాటే శారీరక మార్పులు, బరువు పెరగడం, నిద్రలేమి, ఒత్తిడికి గురవడం.. వంటి సమస్యలతో చాలామంది తల్లులు డిప్రెషన్‌లోకి కూరుకుపోతుంటారు. దీనికి విరుగుడు మన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై స్వయంగా శ్రద్ధ చూపడమే అంటున్నారు వదోదరకు చెందిన ప్రియాంక కపూర్‌. స్వయంగా ఈ సమస్యను ఎదుర్కొన్న ఆమె.. తనలాంటి తల్లులు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారని గ్రహించి వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనతోనే ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ప్రారంభించారు. ‘మహిళలే మహిళల్లో చైతన్యం తీసుకురాగలర’ని నమ్మే ఆమె.. ఈ వేదికగా కొత్తగా తల్లైన ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి రగిలిస్తున్నారు.

ప్రియాంక కపూర్‌ దిల్లీలో పుట్టి పెరిగారు. దిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ, పంజాబ్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ఆమె.. తన చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇంతలోనే వివాహం కావడంతో భర్తతో కలిసి వదోదరలో స్థిరపడ్డారామె.

స్వీయానుభవంతో రియలైజై..!

పెళ్లైన ఐదేళ్లకు పాపకు జన్మనిచ్చిన ప్రియాంక.. ప్రసవానంతర సెలవు తీసుకొని పాప ఆలనా పాలనలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత కూడా పాపను వదిలేసి ఉద్యోగం చేయలేక, చేసే వీల్లేక ఉద్యోగానికి రాజీనామా చేశారామె. ఇక తన పూర్తి సమయాన్ని పాపాయి కోసమే కేటాయించేవారు ప్రియాంక. ఈ బిజీలో పడిపోయి తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు. దీంతో బరువు పెరగడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఫిట్‌నెస్‌ కోల్పోవడం, ఒత్తిడికి గురవడం.. వంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు.

‘పాప పుట్టాక కొన్ని నెలల పాటు ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కొన్నా. నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని ఆలస్యంగా గ్రహించిన నేను.. ఎలాగైనా దీన్నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే ప్రసవానంతర ఒత్తిడికి సంబంధించిన పుస్తకాలు చదివా.. నాలాగే చాలామంది మహిళలు ఈ దశను మౌనంగా భరిస్తున్నట్లు నాకు అర్థమైంది. అయితే దీనివల్ల సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు.. పైగా ఇలాంటి వాటి గురించి నలుగురితో పంచుకుంటే మానసిక ఉపశమనం కలుగుతుంది.. సమస్యకు పరిష్కారమూ దొరకచ్చు.. అందుకే కొత్తగా తల్లైన మహిళలందరికీ తోడుగా నిలవాలనుకున్నా..’ అంటూ తన పోస్ట్‌ పార్టమ్‌ జర్నీ గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక.

మహిళకు మహిళే తోడు!

కొత్తగా తల్లైన మహిళలకు శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే ముఖ్యోద్దేశంతో ‘మామ్స్‌ ఆఫ్‌ వదోదర’ పేరుతో 2018లో ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ప్రారంభించింది ప్రియాంక. తొలుత 10 మందితో మొదలైన ఈ సోషల్‌ మీడియా కమ్యూనిటీలో ఇప్పుడు ఐదు వేలకు పైగా క్రియాశీల సభ్యులున్నారు. కొత్తగా తల్లైన మహిళలు తమ ప్రసవానంతర ఒత్తిళ్లు, ఇతర సమస్యల గురించి ఈ వేదికగా తోటి మహిళలతో పంచుకోవచ్చు.. తమకు తెలిసిన చిట్కాలు, పరిష్కార మార్గాల గురించీ వారికి వివరించచ్చు.

‘ఒక మహిళ సమస్య మరో మహిళకే అర్థమవుతుందనేది నా నమ్మకం. పైగా మహిళలే తోటి మహిళల్లో చైతన్యం తీసుకురాగలరు. మామ్స్‌ ఆఫ్‌ వదోదర కమ్యూనిటీ ముఖ్యోద్దేశమిదే! ప్రసవానంతర ఒత్తిళ్లను ఎదుర్కొనే తల్లులు తమ సమస్యల గురించి పంచుకోవడానికి మేం వివిధ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం. వారిలో ఉన్న ఈ సమస్యను దూరం చేయడానికి ఫిట్‌నెస్‌ యాక్టివిటీస్‌, సాహస క్రీడలు, మారథాన్లు.. వంటివి నిర్వహిస్తాం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో పలు సెషన్స్‌ ద్వారా అవగాహన కల్పిస్తాం. వారికి ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యోద్దేశంతో పలు స్వీయ ఉపాధి మార్గాల్నీ సూచిస్తున్నాం. మరోవైపు సమీరా రెడ్డి, నేహా ధూపియా.. వంటి స్ఫూర్తిదాయక సెలబ్రిటీలతో ఉపన్యాసాలూ ఇప్పిస్తుంటాం.. ఆయా సమస్యలు, సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి నిపుణుల పరిష్కారాలూ అందిస్తున్నాం..’ అంటూ తన ఆన్‌లైన్‌ కమ్యూనిటీ సేవల గురించి చెప్పుకొచ్చారీ సూపర్‌ మామ్.

టీచర్‌గానూ..!

ఓవైపు తన కమ్యూనిటీ సేవలతో కొత్తగా తల్లైన మహిళలకు అండగా, స్ఫూర్తిగా నిలుస్తోన్న ప్రియాంక.. IELTS కోచ్‌గా, ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్‌గానూ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విదేశాల్లో చదువుకోవాలని సంకల్పించుకున్న విద్యార్థులకు కెరీర్‌ విషయంలో మార్గనిర్దేశనం చేస్తోంది. మరోవైపు ఫిట్‌నెస్‌పై మక్కువతో ‘ఫంక్షనల్‌ స్ట్రెంత్ ట్రైనింగ్‌’లో సర్టిఫికేషన్‌ పొందిన ఆమె.. మహిళలకు ఫిట్‌నెస్‌ పాఠాలూ నేర్పుతోంది. పవర్‌ గర్బా ఇన్‌స్ట్రక్టర్‌గానూ కొనసాగుతోన్న ఈ ఫిట్‌నెస్‌ మామ్‌.. మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఎంత ముఖ్యమో.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ అంతే ముఖ్యమంటోంది. ఇన్ని పనులతో తానెంత బిజీగా ఉన్నప్పటికీ.. తన కూతురితో గడపడానికి తగిన సమయం కేటాయిస్తానంటోంది ప్రియాంక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్