ముఖానికి ఇవి వాడకూడదట..!

అందమంటే ముఖ్యంగా ముఖ సౌందర్యం పైనే శ్రద్ధ పెడుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో ఇటు ఇంటి చిట్కాలను, అటు బయట దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్ని వాడుతుంటారు. అయితే వీటిలో ముఖానికి వాడకూడని పదార్థాలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు.

Published : 17 Feb 2024 13:12 IST

అందమంటే ముఖ్యంగా ముఖ సౌందర్యం పైనే శ్రద్ధ పెడుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో ఇటు ఇంటి చిట్కాలను, అటు బయట దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్ని వాడుతుంటారు. అయితే వీటిలో ముఖానికి వాడకూడని పదార్థాలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు. ఆ విషయం తెలియక చాలామంది తమ ముఖ సౌందర్యాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నారని చెబుతున్నారు. మరి, ఇంతకీ అందాన్ని సంరక్షించుకునే క్రమంలో ముఖానికి వాడకూడదని ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం రండి..

బాడీ లోషన్

చర్మానికి తేమనందించడానికి బాడీ లోషన్‌ ఉపయోగించడం మనకు అలవాటే! అయితే కొంతమంది దీన్నే ముఖానికి కూడా వాడుతుంటారు. ఫలితంగా ఇందులోని జిడ్డుదనం ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరి.. క్రమంగా మొటిమలు రావడానికి దారితీస్తుంది. ఇక దీనిలో ఉండే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బ్యూటీ ఉత్పత్తులు.. అది కూడా పారాబెన్‌.. వంటి రసాయనం లేనివి ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని కొనేముందు ఓసారి లేబుల్‌ పరిశీలించడం మర్చిపోవద్దు.

నిమ్మకు బదులు..!

ముఖానికి ఉపయోగించే స్క్రబ్స్‌, ఫేస్‌ప్యాక్స్‌.. వంటి వాటిలో నిమ్మను ఉపయోగించడం సహజమే. కొంతమందైతే నిమ్మచెక్కను నేరుగా ముఖంపై రుద్దుకుంటుంటారు. అయితే ఇందులోని కొన్ని సమ్మేళనాలు కొంతమందిలో ముఖ చర్మాన్ని మరింత సున్నితంగా మార్చుతాయి. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం ఇరిటేషన్‌కి గురై దురద, మంట.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి దీనికి బదులుగా బంగాళాదుంప, టొమాటో.. వంటి ప్రత్యామ్నాయ మార్గాలైతే మంచివంటున్నారు నిపుణులు.

టూత్‌పేస్ట్‌ వద్దు!

మొటిమలున్న చోట టూత్‌పేస్ట్ రాయమని సలహా ఇస్తుంటారు చాలామంది. కానీ వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది అప్లై చేసిన చోట చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కొంతమందిలో ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు, రంగు మారడం.. వంటి సమస్యలొచ్చే అవకాశం ఉంటుందట. అలాగే ఇందులోని గాఢమైన పదార్థాల వల్ల కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలు కూడా రావచ్చట!

వ్యాక్స్‌ చేస్తున్నారా?

ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి చాలామంది అనుసరించే పద్ధతి వ్యాక్స్‌ చేసుకోవడం. ఇందుకు అనుగుణంగానే వ్యాక్స్‌ స్ట్రిప్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు రావడం, ముడతలు పడడంతో పాటు చర్మం మరింత సున్నితంగా మారుతుంది. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు కందిపోవడం, ర్యాషెస్‌.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి ఫేషియల్‌ వ్యాక్స్‌ ఎంచుకునే ముందు చర్మతత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం, ఇంట్లో తయారుచేసుకున్న వ్యాక్స్‌ అయినా.. బయటి నుంచి తెచ్చిన స్ట్రిప్‌ అయినా.. అప్లై చేసుకునే ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్