ఆమె కథ... పాఠ్య పుస్తకాల్లో!

‘శూర్పణఖలా ముక్కూచెవులూ కోసి పంపిస్తాం... వివస్త్రను చేసి ఊరంతా ఊరేగిస్తాం... ముక్కలు ముక్కలుగా నరికి నీ ఆనవాళ్లే కనిపించకుండా చేస్తాం’... ఇలాంటి బెదిరింపులే కాదు, ఎన్నో దాడులకూ గురయ్యారు డాక్టర్‌ కృతి భారతి. కానీ అవేమీ ఆమె యజ్ఞాన్ని ఆపలేకపోయాయి. కాబట్టే వేలమంది చిన్నారులు బాల్యవివాహాల నుంచీ, మరెంతోమంది నరకప్రాయమైన జీవితం నుంచీ బయటపడ్డారు.

Updated : 25 May 2024 07:54 IST

‘శూర్పణఖలా ముక్కూచెవులూ కోసి పంపిస్తాం... వివస్త్రను చేసి ఊరంతా ఊరేగిస్తాం... ముక్కలు ముక్కలుగా నరికి నీ ఆనవాళ్లే కనిపించకుండా చేస్తాం’... ఇలాంటి బెదిరింపులే కాదు, ఎన్నో దాడులకూ గురయ్యారు డాక్టర్‌ కృతి భారతి. కానీ అవేమీ ఆమె యజ్ఞాన్ని ఆపలేకపోయాయి. కాబట్టే వేలమంది చిన్నారులు బాల్యవివాహాల నుంచీ, మరెంతోమంది నరకప్రాయమైన జీవితం నుంచీ బయటపడ్డారు.

అర్ధరాత్రి... తలుపునెవరో దబదబా బాదుతున్నారు. ఎవరని అడిగితే సమాధానం లేదు. రెట్టించి అడిగితే ఎక్కిళ్లతో కూడిన ఏడుపు. కంగారుపడిన కృతి తలుపు తీస్తే... పదహారేళ్లమ్మాయి. లోపలికి తీసుకెళ్లి, ఆమె దుఃఖం ఆగేవరకూ అలాగే పొదివి పట్టుకున్నారామె. తేరుకున్నాక నెమ్మదిగా తన గురించి చెప్పిందా అమ్మాయి. ఏడాది వయసులో పెళ్లైందామెకు. పదహారేళ్లు వచ్చాయని తల్లిదండ్రులు ఆమెను అత్తారింటికి పంపాలనుకున్నారు. కట్టుకున్నవాడికి 69ఏళ్లు. నేను వెళ్లను, చదువుకుంటానంటే బెదిరించి మరీ పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కృతి గురించి తెలుసుకున్న ఆ చిన్నారి అర్ధరాత్రి ఇంటి నుంచి పారిపోయింది. చిమ్మ చీకటిలో ఎడారిలో కాలినడకన ప్రయాణించి కృతిని చేరుకుంది. ఆమె కథనంతా విన్న కృతి చలించిపోయారు. ఆమె తరఫున పోరాడి, ఆ వివాహం రద్దయ్యేలా చేశారు. ఆపై చదువు చెప్పించి, జీవితంలో స్థిరపడేవరకూ తోడు నిలిచారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు... ఎంతోమంది బాల్యవివాహాలు రద్దవ్వడానికి కారణమయ్యారీమె. ఇంత చేస్తున్న కృతిదీ విషాదగాథే!

పక్షవాతానికి గురై...

కృతిది రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌. కడుపులో పడగానే వాళ్లమ్మను నాన్న వదిలేశారు. అబార్షన్‌ చేయించుకొని మరో పెళ్లి చేసుకోమని ఎంతోమంది సలహాలిచ్చినా తల్లి వినలేదు. దీనికితోడు అనారోగ్యం తలెత్తి కృతికి ఏడో నెలలోనే జన్మనిచ్చారు. పుట్టకముందే తండ్రి దూరమయ్యాడు, తల్లి అనారోగ్యానికీ కారణమైందని ఆమెను అంతా నష్టజాతకురాలని పిలిచేవారు. కనిపిస్తే చీదరించుకునేవారు, అకారణంగా కొట్టేవారు. చాలదన్నట్టు నాలుగో తరగతిలో ఉండగా కృతికి పక్షవాతం వచ్చింది. వైద్యులు ఎవరో విషమిచ్చారన్నారు. అంతా బతకదన్నా వాళ్లమ్మ మాత్రం చిన్నారి కృతికి చేయించని వైద్యం లేదు. అలా బతికి బయటపడ్డారు కృతి. తనలా అందమైన బాల్యం లేనివాళ్లకు అండగా నిలవాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నారు. చదువుపై దృష్టిపెట్టి, సైకాలజీలో పీజీ, పీహెచ్‌డీ చేశారు. ఎన్‌జీఓలతో కలిసి కౌన్సెలింగ్‌ కూడా చేసేవారు. తొలికేసు రేప్‌కి గురైన 9 ఏళ్లమ్మాయిది. ఆ ట్రామా నుంచి బయటపడేస్తే సరిపోదు, న్యాయం అందించాలనుకున్నారామె. బెదిరింపులకు తలొగ్గకుండా నిలిచారు కూడా. తరవాత 2011లో ‘సారధి ట్రస్ట్‌’ ప్రారంభించి బాలకార్మికులు, రేప్‌కి గురైనవారు ఇలా ఎందరి తరఫునో పోరాడుతున్నప్పుడు ఆ చిన్నారి పెళ్లికూతురు ఈమె తలుపు తట్టింది.

అవగాహన కలిగిస్తూ...

పెళ్లిళ్లు రద్దు చేయడం కాదు... వాటిని జరగకుండా ఆపాలనుకున్నారామె. వలంటీర్లను ఏర్పాటు చేసుకొని వీటిపై పోరాడటం మొదలుపెట్టారు. ఈక్రమంలో ముక్కు, చెవులు కోసేస్తాం, చంపేస్తాం, గ్యాంగ్‌ రేప్‌ చేస్తామంటూ బోలెడు బెదిరింపులు. కొన్నిసార్లు దాడులూ జరిగాయి. అయినా ‘ఒక చిన్నారి జీవితం కంటే అవేమీ పెద్దవి కాదు’ అంటారామె. అయితే పెళ్లి ఆపడంతోనే సమస్య తీరదు అని గ్రహించారు కృతి. ‘ఆ అమ్మాయిని నష్టజాతకురాలు, పెళ్లి ఆగిపోయిందని హింసించేవారు. వెలేసేవారు కూడా. ఆ అమ్మాయిలకు కౌన్సెలింగ్‌ చేసి, చదువు, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ వంటివి ఇస్తున్నాం. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తున్నాం. మేమెళ్లి ఆపడం కాదు, తల్లిదండ్రులకే ఆ స్పృహ రావాలని అవగాహన కార్యక్రమాలతో బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నాం. ఓ హెల్ప్‌లైన్‌నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈక్రమంలో చావు అంచుల వరకూ వెళ్లినా కొనసాగుతున్నా’ అంటారు 37ఏళ్ల కృతి. వీధిబాలలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధిత చిన్నారులు, వ్యసనాలకు అలవాటుపడ్డ వారిని చేరదీసి, చదువు చెప్పించడం, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు వంటివెన్నో చేస్తున్నారు. తన సంపాదననీ దీనికి కేటాయిస్తున్నారామె. 2020లో సీబీఎస్‌ఈ ఈవిడ కథను పాఠంగా చేర్చింది. జెనీవా సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ నుంచి ‘గ్లోబల్‌ యూత్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఛాంపియన్‌’ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కృతి స్పీకర్‌ కూడా.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్