ఆ ఆలస్యం.. మరొకరికి శాపమవొద్దనీ!

నాన్న క్యాన్సర్‌ నుంచి బయటపడ్డారు. ప్రాణాంతక వ్యాధిని జయించారని ఆనందించేలోపే ఏదో సమస్య! అదేంటో తెలుసుకునేలోపే ఆయన చనిపోయారు. ఇన్ఫెక్షన్‌ను గుర్తించే పరీక్షల్లో ఆలస్యం.. నాన్నని దూరం చేయడాన్ని పూజా గోస్వామి తట్టుకోలేకపోయారు.

Published : 01 Mar 2023 00:05 IST

నాన్న క్యాన్సర్‌ నుంచి బయటపడ్డారు. ప్రాణాంతక వ్యాధిని జయించారని ఆనందించేలోపే ఏదో సమస్య! అదేంటో తెలుసుకునేలోపే ఆయన చనిపోయారు. ఇన్ఫెక్షన్‌ను గుర్తించే పరీక్షల్లో ఆలస్యం.. నాన్నని దూరం చేయడాన్ని పూజా గోస్వామి తట్టుకోలేకపోయారు. మరొకరికి అలాంటి పరిస్థితి రాకూడదన్న పట్టుదలతో దానికో పరిష్కారాన్ని కనిపెట్టారు. ‘బయో ఏషియా’ సదస్సులో ప్రదర్శించి, విజేతగానూ నిలిచిన 38 ఏళ్ల పూజని వసుంధర పలకరించింది..
నాన్న రమేష్‌ బయాలజిస్ట్‌. అమ్మ రాజధాని గురుస్వామి.. సామాజిక సేవా సంస్థ ప్రారంభించి 40 ఏళ్లుగా పేద బాలికలకు ఉచిత విద్యను, హస్తకళల్లో శిక్షణిచ్చి మహిళలకు ఉపాధి అందిస్తోంది. మాది పంజాబ్‌లోని ఫతేగఢ్‌. నలుగురు పిల్లలం. నాకు చిన్నప్పట్నుంచీ పరిశోధనలంటే ఆసక్తి. అందుకే డిగ్రీ తర్వాత దిల్లీ- ఎయిమ్స్‌లో పీజీ, పీహెచ్‌డీ పూర్తిచేశా. ఎయిమ్స్‌లోనే కొన్నేళ్లు క్లినికల్‌ సైంటిస్ట్‌గా డ్రగ్‌ డెలివరీ సిస్టం, ట్యూబర్‌క్యులోసిస్‌, ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ వంటి అంశాలపై అధ్యయనం చేశా. అప్పుడే నాన్నకు పేగు క్యాన్సర్‌ అని తేలింది. నేనే దగ్గరుండి చికిత్స చేయించా. రెండేళ్లలోనే దాన్నుంచి బయటపడ్డప్పుడు.. మా ఆనందానికి అవధుల్లేవు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేంతలో మళ్లీ అనారోగ్యం. సంబంధిత పరీక్షలు చేయించి, నివేదిక వచ్చేలోపే ఆయన 2014లో మాకు దూరమయ్యారు. నేనది భరించలేకపోయా. ఏదో ఇన్ఫెక్షన్‌.. దాన్ని గుర్తించడానికే దాదాపు 3 రోజులు పట్టింది. దీంతో చికిత్స ఆలస్యమై నాన్న దూరమయ్యారు. ఈ విషయం గ్రహించాక చాలా బాధేసింది. అప్పుడే ఇలాంటి పరిస్థితి మరొకరికి రానివ్వొద్దనుకున్నా.


ఇబ్బందులెన్నో..

ఏ ఇన్ఫెక్షన్‌ అయినా త్వరగా గుర్తిస్తేనే.. చికిత్సా వేగంగా మొదలవుతుంది. దాన్ని సాధ్యం చేయాలనే మెడ్‌టెక్‌ స్టార్టప్‌ని నాన్న పేరు, నాది కలిసేలా ‘రామ్‌జా జీనోసెన్సార్‌ ప్రై.లి.’ ప్రారంభించా. నాలుగేళ్ల కష్టానికి గుర్తింపు దక్కింది. మా సెన్సార్‌తో నిమిషాల వ్యవధిలోనే సమస్యను గుర్తించొచ్చు. కొన్ని వైరస్‌లు కొన్ని మందుల నుంచి నిరోధకత సాధిస్తాయి. దాన్నీ మా సెన్సార్‌తో గంటన్నరలోపే గుర్తించేయొచ్చు. దీంతో చికిత్స మరింత సులువు అవుతుంది. అయితే ఇదంతా సులువుగా సాగలేదు. ప్రారంభ పెట్టుబడి నాదే! క్లినికల్‌ రిసెర్చ్‌, తదనంతర పరిశోధనకు వచ్చేసరికి నిధుల సేకరణ కష్టమైంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బైరాక్‌) ముందుకొచ్చింది. ఎక్కడ స్టార్టప్‌ పోటీలు, గ్రాండ్‌ ఛాలెంజెస్‌ నిర్వహిస్తున్నా పాల్గొనేదాన్ని. ఎన్నిసార్లు విజేతగా నిలిచానో! దీంతో ఫైజర్‌, సిడ్బి నుంచి ‘స్వాలంబన్‌ ఛాలెంజ్‌’, ‘ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ గ్రాంట్‌’లందుకున్నా. ‘ఐఎస్‌జీ విన్‌ మెడికేర్‌’, బెస్ట్‌ రిసెర్చి పేపర్‌గా ‘ప్రొఫెసర్‌ కేసీ బసుమల్లిక్‌’ పురస్కారాలూ దక్కాయి. 2022లో పేటెంట్‌ హక్కులనూ పొందాం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2.5 కోట్ల వరకు నిధులందాయి. ఏడాదిపాటు క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి.. 84 శాతానికిపైగా సత్ఫలితాలు సాధించాం. ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌ గుర్తింపు సమయాన్ని మరింత  కుదించే ప్రయత్నంలో ఉన్నా.

భారత్‌లోనే తొలిసారి..

సెన్సర్‌నే కాదు.. 2020లో ‘నానోషాట్‌’ స్ప్రేనీ రూపొందించా. కొవిడ్‌లో శానిటైజర్‌ వాడకం తప్పనిసరైంది. ఇవీ పలు ఇన్ఫెక్షన్లకు దారితీయడం గుర్తించా. నానోషాట్‌ స్ప్రే దుష్ప్రభావాలను కలిగించకుండానే 30 సెకన్లలో సూక్ష్మజీవులను నాశనం చేయగలదు. నాలుగు రోజులవరకూ తిరిగి వ్యాపించదు కూడా. భారత్‌లోనే ఇది తొలి నానోటెక్నాలజీ ఆధారిత స్ప్రే. మార్కెట్‌లోకీ విడుదల చేశాం. మావారు డాక్టర్‌ రాఘవేంద్ర కుమార గిరి, అమ్మ ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధించగలుగుతున్నా.

ఏదైనా సాధించే క్రమంలో వైఫల్యాలు ఎదురవడం సహజమే! పట్టుదలగా వాటన్నింటినీ దాటుకొని వెళ్లినప్పుడే విజయం దక్కుతుందని నమ్ముతా, ఆచరిస్తా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్