పల్లెల్ని పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది!

సాధారణంగా పర్యటనలనగానే మహా నగరాలు, విదేశీ టూరిస్టు ప్రదేశాలే గుర్తొస్తాయి. పట్టణాల్లో స్థిరపడ్డ వాళ్లే కాదు.. పల్లెల్లో నివసించే వారూ టూర్‌ అనగానే సిటీల వైపే ఆసక్తి చూపుతుంటారు. దీంతో సహజసిద్ధంగానే ప్రకృతి రమణీయతకు నెలవైన పల్లెలు వెలవెలబోతున్నాయి. అక్కడి సాంస్కృతిక కళలు కనుమరుగైపోతున్నాయి. ప్రత్యక్షంగా ఈ దుస్థితిని చూసిన రష్మీ సావంత్‌కు ఇది మింగుడు పడలేదు....

Published : 29 Mar 2024 13:13 IST

(Photos : Facebook)

సాధారణంగా పర్యటనలనగానే మహా నగరాలు, విదేశీ టూరిస్టు ప్రదేశాలే గుర్తొస్తాయి. పట్టణాల్లో స్థిరపడ్డ వాళ్లే కాదు.. పల్లెల్లో నివసించే వారూ టూర్‌ అనగానే సిటీల వైపే ఆసక్తి చూపుతుంటారు. దీంతో సహజసిద్ధంగానే ప్రకృతి రమణీయతకు నెలవైన పల్లెలు వెలవెలబోతున్నాయి. అక్కడి సాంస్కృతిక కళలు కనుమరుగైపోతున్నాయి. ప్రత్యక్షంగా ఈ దుస్థితిని చూసిన రష్మీ సావంత్‌కు ఇది మింగుడు పడలేదు. ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చాలనుకున్న ఆమె.. గ్రామాల్ని అందమైన పర్యటక ప్రదేశాలుగా మార్చాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే ఓ టూరిజం సంస్థను ప్రారంభించిన ఆమె.. ఈ వేదికగా పల్లెల్ని టూరిస్టు ప్రదేశాలుగా అభివృద్ధి చేయడంతో పాటు.. అక్కడి మహిళల్లోని నైపుణ్యాల్ని వెలికి తీస్తూ వారికి ఉపాధి మార్గాల్నీ చూపుతోంది. ‘గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. వాటి అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమం’టోన్న రష్మికి.. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో అడిగి తెలుసుకుందాం రండి..

రష్మిది మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా. ఆమెకు పర్యటనలంటే చిన్నతనం నుంచే మక్కువ. ఈ ఇష్టంతోనే ముంబయి యూనివర్సిటీ నుంచి ‘టూరిజం మేనేజ్‌మెంట్‌’లో మాస్టర్స్‌ పూర్తిచేసిన ఆమె.. పలు టూరిజం సంస్థల్లో పనిచేసింది. అయితే పెళ్లై, పిల్లలు పుట్టాక ఎక్కువ సమయం ఇంటికే పరిమితమైన రష్మి.. ఈ క్రమంలోనే తన సొంతూరి గురించి మరింత లోతుగా తెలుసుకున్నానంటోంది.

వాళ్ల మాటలు విన్నాక..!
‘సింధుదుర్గ్‌లోని ఓ చిన్న గ్రామం మాది. పెళ్లై, పిల్లలు పుట్టాక కెరీర్‌ విరామం తీసుకొని కొన్నేళ్ల పాటు ఇంటికే పరిమితమయ్యా. అటు పిల్లల ఆలనా పాలనను చూసుకుంటూనే.. ఇటు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలు, ఇక్కడ ప్రసిద్ధి చెందిన కళల గురించి మరింత లోతుగా తెలుసుకున్నా. ఈ క్రమంలోనే ప్రాచీన కళలు అంతరించిపోతున్నట్లు గుర్తించా. ఇక్కడ తోలుబొమ్మలాట బాగా ఫేమస్‌. కానీ గ్రామం మొత్తమ్మీద ఒకే ఒక్కరు ఈ కళను కొనసాగిస్తున్నట్లు.. అది కూడా తన వృద్ధాప్యంలో అని తెలుసుకొని ఆశ్చర్యపోయా. దీని వెనకున్న కారణాలను స్థానిక ప్రజల్ని అడిగి తెలుసుకున్నా. చాలామందికి ఊరంటే ఇష్టం ఉన్నా.. ఇక్కడ ఉపాధి కరువై పని కోసం మనసు చంపుకొని పట్టణాలకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది విన్నాక బాధేసింది. ఎలాగైనా ఈ పరిస్థితిని మార్చాలనుకున్నా. ఇలా ఆలోచిస్తున్నప్పుడే గ్రామీణ పర్యటకానికి సంబంధించిన ఆలోచన తట్టింది. పల్లెల్నే చిన్న పాటి పర్యటక ప్రదేశాలుగా మార్చితే బాగుంటుందనిపించింది. ఇలాంటప్పుడు స్థానికులు ఇల్లూ-వాకిలి వదిలి పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. అలాగే ఇక్కడి ప్రత్యేకతలతో స్వదేశీ, విదేశీ పర్యటకుల్నీ ఆకర్షించచ్చు..’ అంటూ రూరల్‌ టూరిజం ఆలోచన తనకెలా తట్టిందో చెబుతున్నారు రష్మి.

‘బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌’ కాన్సెప్టే.. కానీ!
పల్లె వాతావరణం సహజంగానే ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంటుంది. అక్కడి పచ్చటి చెట్లు, పక్షుల కిలకిలారావాలు, పొలం గట్లు, సాహస కృత్యాలు.. వంటివన్నీ మనసుకు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. వీటన్నింటినీ స్వదేశీ, విదేశీ టూరిస్టులకు పరిచయం చేయాలన్న ముఖ్యోద్దేశంతోనే ‘కల్చర్‌ ఆంగన్‌’ పేరుతో ఓ టూరిజం సంస్థను స్థాపించారు రష్మి. గత 8 ఏళ్లుగా సింధుదుర్గ్‌లోని ఆయా గ్రామాల్లో స్థిరమైన గ్రామీణ పర్యటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందీ సంస్థ.
‘బెడ్‌ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కాన్సెప్ట్‌ (టూరిస్టులకు ఒక ప్రైవేట్‌ భవంతిలో రాత్రి పూట బస చేయడానికి అవసరమైన వసతి సౌకర్యాలు, ఉదయాన్నే అల్పాహార వసతి కల్పించడం..) మన దేశంలో చాలా చోట్ల ఉంది. సింధుదుర్గ్‌లో గ్రామీణ పర్యటకాన్ని అభివృద్ధి చేయడానికి నేనూ ఈ కాన్సెప్ట్‌నే స్ఫూర్తిగా తీసుకున్నా. అయితే ఇక్కడ టూరిస్టులకు స్థానికుల ఇళ్లలోనే ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించాలనుకున్నా. ఎందుకంటే.. స్థానిక ప్రజలతో వాళ్లు మమేకమవడం వల్ల వారికి ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ప్రత్యేకతలు అవగతమవుతాయి. అలాగే ఇక్కడ మేం సమకూర్చే వసతుల్లో టీవీ, ప్లేస్టేషన్‌.. వంటివేవీ ఉండవు. తద్వారా ఒకరితో ఒకరు మరింతగా మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువ. ఇక పిల్లలూ స్థానిక చిన్నారులతో ఆడుకోవడాన్ని మేం ప్రోత్సహిస్తుంటాం. దీనివల్ల ఒకరికి తెలిసిన విషయాలు, భాషా నైపుణ్యాలు మరొకరితో పంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విహారయాత్రలే కాదు.. వైజ్ఞానిక యాత్రల కోసమూ స్కూల్‌ తరఫున కొంతమంది విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి వారికి వ్యవసాయ క్షేత్రాల్ని సందర్శించే అవకాశం కల్పించడం, స్థానిక కళాకారుల్ని కలుసుకునే ఏర్పాటుచేయడం.. వంటివీ మా సంస్థ ప్రోత్సహిస్తోంది. తద్వారా ఇక్కడి సంస్కృతులు, కళలు బయటి ప్రపంచానికి తెలుస్తాయి..’ అని చెబుతున్నారు రష్మి.

మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ!
ప్రస్తుతం సింధుదుర్గ్‌లోనే కాదు.. ముంబయిలోని అలీబాగ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ గ్రామీణ పర్యటక అభివృద్ధిపై దృష్టి పెట్టారు రష్మి. అక్కడి ప్రాంతాల్లోని ప్రత్యేకతల్ని, కళల్ని తెరమీదకు తీసుకొస్తూ.. ఎంతోమంది దేశ, విదేశీ పర్యటకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారామె. ఇలా ఆయా గ్రామాల్ని అందమైన పర్యటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడమే కాదు.. అక్కడి మహిళలకూ ఉపాధి మార్గాలు చూపుతున్నారు. ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల్లో భాగమైన మహిళల్లో దాగున్న ప్రత్యేకమైన నైపుణ్యాల్ని వెలికి తీస్తూ.. వాటి ద్వారా వారు ఆర్థిక సాధికారత సాధించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారామె.
‘గ్రామీణ మహిళల్ని ఆర్థిక సాధికారత దిశగా నడిపించేందుకు పలు అంశాలపై వర్క్‌షాప్స్‌, శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటుచేస్తున్నాం. ఈ క్రమంలో మహిళలతో బోటింగ్‌ ట్రిప్స్‌ ఏర్పాటుచేయించడం, టూరిస్టులకు చక్కటి అతిథి సత్కారాలు కల్పించేలా శిక్షణ ఇవ్వడం, వివిధ క్రాఫ్ట్స్, పచ్చళ్లు, గాజుల తయారీ.. వంటివెన్నో ఉన్నాయి. అలాగే తోలుబొమ్మలాటకు సంబంధించిన ప్రత్యేకమైన షోస్‌ కూడా స్థానికులు ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు.. అతిథులకు ఇక్కడి సంప్రదాయ వంటకాల్ని పరిచయం చేయడం, శారీరక/మానసిక విశ్రాంతి కోసం ప్రత్యేకమైన యోగా-ధ్యాన తరగతులు, మసాజ్‌ థెరపీ.. వంటివీ అందించే ఏర్పాటుచేస్తున్నాం..’ అంటున్నారు రష్మి.

ప్రస్తుతం తన వెబ్‌సైట్‌ వేదికగా ఆయా గ్రామీణ ప్రాంతాలకు హాలిడే బుక్‌ చేసుకొనే వెసులుబాటు కూడా కల్పిస్తోన్న రష్మి.. దేశంలోని ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తూ.. అక్కడి కళల్ని కాపాడడమే తన భవిష్యత్‌ లక్ష్యం అంటున్నారు. ఇలా దేశ గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న రష్మి టూరిజం సంస్థకు జాతీయ పురస్కారంతో పాటు పలు అవార్డులు-రివార్డులు దక్కాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్