స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?

గర్భం దాల్చిన మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ రావడం సహజం. అధిక బరువున్న మహిళల్లోనూ ఇవి కనిపిస్తాయి. చర్మం సాగిపోవడం కారణంగా ఏర్పడే వీటిని తగ్గించుకోవడానికి మహిళలు చాలానే శ్రమ పడుతుంటారు.

Published : 16 Mar 2024 13:50 IST

గర్భం దాల్చిన మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ రావడం సహజం. అధిక బరువున్న మహిళల్లోనూ ఇవి కనిపిస్తాయి. చర్మం సాగిపోవడం కారణంగా ఏర్పడే వీటిని తగ్గించుకోవడానికి మహిళలు చాలానే శ్రమ పడుతుంటారు. అయితే సహజ పద్ధతుల్లో వీటిని కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

గర్భం దాల్చిన తర్వాత పొట్ట క్రమంగా పెరగడం మొదలవుతుంది. ఈ సమయంలో పొట్ట కండరాలతో పాటు చర్మం కూడా సాగుతుంది. ఈ క్రమంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడడం క్రమంగా ప్రారంభమవుతుంది. కొన్ని సందర్భాల్లో హార్మోన్ల ప్రభావం, బరువు పెరగడం కూడా ఇందుకు కారణం కావచ్చు.

సహజ పద్ధతుల ద్వారా..

చర్మంపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా కనుమరుగు కావంటున్నారు నిపుణులు. అయితే కొన్ని సహజ చిట్కాల్ని ఉపయోగించి వాటిని కొంతవరకు కనిపించకుండా చేయచ్చంటున్నారు.

⚛ నిమ్మరసంలో కొద్దిగా పంచదార, కొన్ని చుక్కల కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని పొట్టపై రాసి కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మకణాలకు రక్తప్రసరణ జరిగి అక్కడి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తద్వారా స్ట్రెచ్ మార్క్స్ కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ చిట్కాను ప్రతిరోజూ పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందచ్చు.

⚛ కలబంద సైతం స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి సాయం చేస్తుంది. ఇందుకోసం కలబంద గుజ్జుని చర్మానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేయడం ద్వారా చర్మంపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ నెమ్మదిగా తగ్గిపోవడం గమనించచ్చు.

⚛ ఆలివ్‌నూనెను ఉపయోగించడం ద్వారా కూడా పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్‌ని క్రమంగా దూరం చేసుకోవచ్చు. దీన్ని కొద్దిగా వేడి చేసి మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట సమయం అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరగడంతో పాటు విటమిన్ 'ఎ', 'డి', 'ఇ' చర్మంలోకి బాగా ఇంకుతాయి. దీనివల్ల కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గే అవకాశం కొంత వరకు ఉంటుందంటున్నారు నిపుణులు.

⚛ కొద్దిగా ఆముదంతో పొట్ట భాగాన్ని ఐదు నుంచి పది నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత పలుచని కాటన్ వస్త్రంతో కప్పాలి. ఆపై హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీరు నింపిన వాటర్‌బాటిల్‌తో పొట్టపై కప్పిన వస్త్రంపై కాపడం పెట్టినట్లుగా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు చేస్తే కొంతవరకు ఫలితం కనిపిస్తుంది.
ఈ చిట్కాలు పాటించడంతో పాటు అవసరమైతే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల క్రీమ్స్‌, లోషన్స్‌ కూడా ఉపయోగించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్