జుట్టు ఆరోగ్యాన్ని పెంచే మసాజ్!

విపరీతంగా జుట్టు రాలుతోందా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పదే పదే వెంట్రుకలు పొడిబారిపోతున్నాయా? వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య వేధిస్తోందా?

Published : 02 Mar 2024 20:49 IST

విపరీతంగా జుట్టు రాలుతోందా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పదే పదే వెంట్రుకలు పొడిబారిపోతున్నాయా? వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య వేధిస్తోందా? అయితే ఇలాంటి కేశ సౌందర్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత సాధనం మసాజ్‌ అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారానికోసారి హెయిర్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని సైతం పెంపొందించుకోవచ్చని చెబుతున్నారు.

ఇంట్లోనే ఈజీగా..!

జుట్టు నిర్జీవంగా మారడం, పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి సమస్యలతో బాధపడే వారితో పాటు ఇతరుల్లోనూ జుట్టు విపరీతంగా రాలిపోవడం, చుండ్రు, అలొపేషియా (కుదుళ్లలో అక్కడక్కడా జుట్టు ప్యాచుల్లా రాలిపోవడం).. తదితర జుట్టు సమస్యలన్నీ కుదుళ్ల నుంచే మొదలవుతాయి. అందుకే ముందుగా దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో వారానికోసారి కుదుళ్లకు మసాజ్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగని అందుకోసం పార్లర్లు/స్పాలకే వెళ్లక్కర్లేదు. ఇంట్లోనే సులభంగా ఎవరికి వారు మసాజ్‌ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం ఈ ప్రత్యేకమైన నూనెను తయారుచేసుకోవాల్సి ఉంటుంది.


నూనె తయారీ ఇలా!

కావాల్సినవి

కొబ్బరినూనె - కప్పు

కరివేపాకు రెబ్బలు - గుప్పెడు

మెంతులు - టీస్పూన్

అలీవ్‌ గింజలు - టీస్పూన్

మందార పువ్వు - ఒకటి

తయారీ

ముందుగా ఒక ఇనుప పాత్రలో కొబ్బరి నూనె తీసుకొని వేడి చేయాలి. ఇప్పుడు స్టౌ కట్టేసి అందులో కరివేపాకు, మెంతులు, అలీవ్‌ గింజలు, మందార పువ్వు వేసి మూత పెట్టేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాల్లోని పోషకాలన్నీ కొబ్బరి నూనెలోకి బాగా ఇంకుతాయి. ఉదయాన్నే నూనెను వడకట్టుకొని ఒక సీసాలో భద్రపరచుకోవచ్చు. దీన్ని మరుసటి రోజు తలస్నానం చేస్తామనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి తలకు పట్టించి మసాజ్‌ చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.


జుట్టు సమస్యలకు చెక్!

కొంతమందికి కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, జుట్టు పొడిబారిపోవడం, అలొపేషియా (కుదుళ్ల వద్ద జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం), చుండ్రు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటన్నింటికీ ఒకేసారి చెక్‌ పెట్టాలంటే అందుకు మసాజ్‌ చక్కటి పరిష్కారం.

నిర్జీవమైన జుట్టును తిరిగి ప్రకాశవంతంగా, పట్టులా మెరిపించేలా చేస్తుందీ ప్రక్రియ.

జుట్టు చివర్లు చిట్లిపోవడం, కేశాలు ఎక్కువగా రాలిపోవడం.. వంటి సమస్యలనూ మసాజ్‌తో దూరం చేసుకోవచ్చు.

జుట్టు సమస్యలకు ఒత్తిడి, ఆందోళనలు కూడా కారణం కావచ్చు. మరి, ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే మసాజ్‌ను మించింది లేదు.

మసాజ్‌ చేసే క్రమంలో కుదుళ్ల చర్మానికి రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. తద్వారా కుదుళ్ల ఆరోగ్యం మెరుగుపడి జుట్టు బాగా పెరిగేందుకు దోహదం చేస్తుంది.

చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోయి బాధపడుతున్న వారూ ఈ మసాజ్‌ ప్రక్రియతో ఉపశమనం పొందచ్చు.

ఇక ఈ మసాజ్‌ కోసం మనం ఉపయోగించిన అలీవ్‌ గింజల్లో ఫోలికామ్లం, ఐరన్‌తో పాటు కుదుళ్ల ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

మెంతుల్లో ఉండే ప్రొటీన్‌, నికోటినిక్ యాసిడ్ మొదలైనవి ఇటు కుదుళ్లు, అటు జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.

కొబ్బరి నూనె కుదుళ్లకు తేమనందించి, జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

మందార పువ్వు కుదుళ్ల పీహెచ్‌ స్థాయుల్ని బ్యాలన్స్‌ చేయడంతో పాటు కుదుళ్లు జిడ్డుగా మారకుండా, తెల్లజుట్టు రాకుండా కాపాడుతుంది.

కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు.. ఫ్రీ రాడికల్స్‌ నుంచి కుదుళ్లను కాపాడి.. జుట్టుకు పటుత్వాన్ని అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్