ఆ ఆవేదనే.. వ్యాపార సోపానమైంది!

ఇంట్లోని చెత్తాచెదారం, పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు.. మొదలైనవన్నీ బయట పారేస్తుంటాం.. ఓపెన్ డ్రైనేజీలు ఉంటే వాటిలోకి విసిరేస్తుంటాం.. వీటివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందన్న కనీస ఆలోచన కూడా చాలామందికి ఉండదు. ఈ నిర్లక్ష్యమే కాలువలు, చెరువులు, నదుల్న...

Updated : 23 Dec 2022 17:02 IST

ఇంట్లోని చెత్తాచెదారం, పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు.. మొదలైనవన్నీ బయట పారేస్తుంటాం.. ఓపెన్ డ్రైనేజీలు ఉంటే వాటిలోకి విసిరేస్తుంటాం.. వీటివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందన్న కనీస ఆలోచన కూడా చాలామందికి ఉండదు. ఈ నిర్లక్ష్యమే కాలువలు, చెరువులు, నదుల్ని కలుషితం చేస్తుంది. అందులోని జలచరాలకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది. స్వీయానుభవంతో ఈ సమస్యను గుర్తించారు హైదరాబాద్‌కు చెందిన గీతా పద్మ. నాలాలు, కాలువల్లోని చెత్తను వేరుచేయడానికి ఓ రోబోటిక్‌ యంత్రాన్ని రూపొందించారామె. దీంతో మానవ ప్రమేయం లేకుండా మురుగునీటి వ్యవస్థలో చెత్తను వేరు చేసి.. అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారు. విదేశాల్లో లక్షలు ఆర్జించే ఉద్యోగం వదులుకొని.. గ్రీన్‌ ఇండియా కోసం నడుం బిగించిన పద్మ.. తన వ్యాపార ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

మాది హైదరాబాద్‌. ఎంసీఏ పూర్తయ్యాక.. దేశ విదేశాలకు చెందిన పలు ఐటీ కంపెనీల్లో పనిచేశాను. ఈ రంగంలో 20 ఏళ్లకు పైగా అనుభవం గడించాను. నాకున్న ఐటీ పరిజ్ఞానంతో సమాజానికి ఏదైనా చేయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో నా మనసులో నాటుకుపోయింది. అయితే దీన్ని ఆచరణలో పెట్టింది మాత్రం.. నా జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటన తర్వాతే!

అది చూసి చలించిపోయా!

చిన్నప్పుడు వారాంతం వచ్చిందంటే చాలు, నాన్న.. నన్ను, అన్నయ్యను మా ఇంటికి దగ్గర్లోని సరస్సుకు తీసుకెళ్లేవారు. అక్కడి నీటిలోని చేపల్ని చూస్తే భలే ముచ్చటేసేది. పచ్చదనం, పక్షుల కిలకిలారావాలతో అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని పంచేది. కానీ క్రమంగా ఇది కనుమరుగైందని కొన్నేళ్ల తర్వాత తెలుసుకున్నా. విదేశాల నుంచి తిరిగొచ్చాక ఓసారి ఆ సరస్సు దగ్గరకు వెళ్లి చూస్తే.. చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి, ప్లాస్టిక్‌ కవర్లతో కలుషితంగా కనిపించింది. చుట్టుపక్కల ఉన్న ఇళ్ల నుంచి మురికి నీరు ఈ సరస్సులోకి చేరి చూడ్డానికి మురికి కాలువలా తయారైంది. అది చూసి నా మనసు చలించిపోయింది. ఎలాగైనా ఈ దుస్థితిని మార్చాలనుకున్నా. ఈ ఆలోచనకు నా ఐటీ పరిజ్ఞానాన్ని జోడించి.. కాలువలు, సరస్సులు, చెరువులు కలుషితం కాకుండా కాపాడాలని నిర్ణయించుకున్నా. ఇదే రోబోటిక్‌ పరికరాల తయారీ సంస్థకు (ENVI Robotics) తెరతీసింది. మురుగునీటి వ్యవస్థల్లోని చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలు వేరు చేసేందుకు రోబోటిక్‌ యంత్రాల్ని తయారుచేయడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. ఇది పర్యావరణహితం కోరి చేస్తోన్న ప్రయత్నం కాబట్టి మా సంస్థకు ఈ పేరు పెట్టాం.

ఎలా పనిచేస్తుందంటే..?

తొలి దశలో భాగంగా ENVIROBO పేరుతో ఓ రోబోటిక్‌ యంత్రాన్ని తయారుచేశాం. కృత్రిమ మేధను ఉపయోగించి ఒక ఇనుప బుట్ట తరహాలో దీన్ని డిజైన్‌ చేశాం. ఇది ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ప్రవహించే నీటిలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాల్ని వడకట్టి.. పక్కనే ఉండే చెత్తడబ్బాలో వేసేస్తుంది. ఈ క్రమంలో కేవలం నీటిలో తేలే చెత్తను మాత్రమే కాదు.. నీటి అడుగున ఉన్న బరువైన చెత్తను కూడా ఇది వేరు చేస్తుంది. మా పరికరం ప్రత్యేకత ఇదే. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో మా సేవలందిస్తున్నాం.

త్వరలోనే రైతుల కోసం..!

ENVI Roboti అనే మర మనిషి తరహా రోబో యంత్రం కూడా మా వద్ద అందుబాటులో ఉంది. మ్యాన్‌హోల్స్‌, వీధి నాలాల్లో ఉన్న చెత్తను వేరు చేయడానికి దీన్ని రూపొందించాం. ఇక మ్యాన్‌హోల్స్‌పై ఉన్న బరువైన మూతల్ని ఎత్తడానికి ‘మ్యాన్‌హోల్‌ కవర్‌ లిఫ్టర్‌’ పేరుతో మరో రోబోటిక్‌ యంత్రాన్ని డిజైన్‌ చేశాం. ప్రస్తుతం ఈ రెండింటికీ సంబంధించిన ట్రయల్‌ రన్స్‌ పూర్తయ్యాయి. అలాగే భూగర్భ మురుగునీటి పైపుల్లో ఉండే చెత్తను వేరు చేయడానికి ‘మ్యాన్‌హోల్‌ కట్టర్‌’ పేరుతో మరో రోబోటిక్‌ పరికరాన్ని డిజైన్‌ చేస్తున్నాం. భవిష్యత్తులో రైతుల కోసం ఒక రోబో తయారుచేయాలన్న ఆలోచన కూడా ఉంది.


చక్కటి గైడెన్స్‌ దొరికింది!

వ్యాపారం ప్రారంభించే ముందు దాని గురించి సునిశితంగా తెలుసుకోవాలి. ఈ విషయంలో చక్కటి మార్గనిర్దేశనం చేసింది వీహబ్‌ సంస్థ. రెండేళ్ల క్రితం ఇందులో చేరాను. బిజినెస్‌కు సంబంధించిన ఎన్నో ప్రాథమిక విషయాలపై అవగాహన కల్పించడంతో పాటు నిధుల సమీకరణ, బ్యాంక్‌ రుణాలకు అప్లై చేయడం.. వంటి అంశాల్లోనూ మార్గనిర్దేశనం చేసిందీ సంస్థ. దీని ద్వారానే అంతర్జాతీయ మెరైన్ డెబ్రిస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం కూడా మాకు దక్కింది. మరోవైపు నాస్‌కామ్‌ సంస్థ నుంచీ మాకు సహకారం అందుతోంది.

ఇక మా రోబోటిక్‌ పరికరానికి మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ నుంచి ‘బెస్ట్‌ ఇన్నొవేషన్‌ అవార్డు’ దక్కింది. అలాగే ‘SME క్లైమేట్‌ హబ్‌’, ‘బిజినెస్‌ డిక్లేర్స్‌’, ‘గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఆన్‌ మెరైన్‌ లిట్టర్‌’, ‘యూఎన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రోగ్రామ్‌’, ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’.. వంటి ఎన్నో కార్యక్రమాల్లో భాగమయ్యాం. ఇక ఇటీవలే ENVIROBOకు సంబంధించిన పేటెంట్‌ హక్కులు కూడా పొందాం.


ఆ వివక్ష దాటితేనే..!

మనం కొత్తగా ఏదైనా చేస్తామంటే ఈ సమాజం అంగీకరించదు. వ్యాపారం ప్రారంభిస్తానన్నప్పుడు నాకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ‘విదేశాల్లో ఉద్యోగం, లక్షల కొద్దీ జీతం వదులుకొని.. ఎందుకీ రిస్క్‌ చేయడం?’ అన్న వాళ్లే ఎక్కువమంది! కానీ నేను నా శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి ముందుకు సాగా. ప్రతి మహిళా ఇలాంటి సవాళ్లను, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే విజయం సాధించగలదు. అలాగే కుటుంబ సభ్యుల తోడు, ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఇటు ఇంటిని, అటు వృత్తినీ సునాయాసంగా బ్యాలన్స్‌ చేయచ్చు. ఈ విషయంలో మావారు, నా పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల మద్దతు, సహకారం ఎంతో!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్