‘మగాళ్లెవరూ భాగస్వామిగా లేరా’ అని అడిగారు..!

‘మీకు పెళ్లైందా? పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్‌ చేసుకుంటున్నారు?’, ‘మీరొక్కరేనా? లేదంటే పురుష కో-ఫౌండర్‌ ఎవరైనా ఉన్నారా?’.. వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నప్పుడు రోమితా మజుందార్‌కు ఎదురైన ప్రశ్నలివి! ఇంట్లో తమ్ముడున్నా సమానత్వంతో పెరిగిన ఆమెకు.. సమాజంలో ఉన్న లింగ వివక్ష....

Published : 26 Jan 2023 14:29 IST

(Photos: Instagram)

‘మీకు పెళ్లైందా? పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్‌ చేసుకుంటున్నారు?’, ‘మీరొక్కరేనా? లేదంటే పురుష కో-ఫౌండర్‌ ఎవరైనా ఉన్నారా?’.. వ్యాపారం ప్రారంభిద్దామనుకున్నప్పుడు రోమితా మజుందార్‌కు ఎదురైన ప్రశ్నలివి! ఇంట్లో తమ్ముడున్నా సమానత్వంతో పెరిగిన ఆమెకు.. సమాజంలో ఉన్న లింగ వివక్ష గురించి అప్పుడే అర్థమైంది. అయినా ఇలాంటి మాటల్ని తాను పట్టించుకొని ఉంటే.. చేస్తోన్న ఉద్యోగం వదిలి తనకిష్టమైన వ్యాపారం వైపు అడుగు వేసేది కాదు.. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకునేది కాదు. స్వీయ నైపుణ్యాలపై నమ్మకముంచి.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఏ శక్తీ మన విజయాన్ని అడ్డుకోలేదంటోన్న రోమిత బిజినెస్‌ జర్నీ ఇది!

రాంచీలో పుట్టి పెరిగిన రోమితా మజుందార్‌.. క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె కుటుంబంలో అందరూ లాయర్లే.. కానీ ఆమెకేమో వ్యాపారమంటే మక్కువ. ఈ క్రమంలో తన ఇష్టానికి వాళ్లెవరూ అడ్డు చెప్పలేదు.. సరికదా.. ఇందులో రాణించేలా ప్రోత్సహించారు. ఇక తనకో తమ్ముడున్నా.. ప్రతి విషయంలోనూ ఇద్దరినీ సమానంగా పెంచారే తప్ప ఎందులోనూ వివక్ష చూపలేదు. ఇలాంటి సానుకూల వాతావరణంలో పెరిగిన ఆమెకు.. క్షేత్రస్థాయిలో తొలిసారి లింగ వివక్ష తాలూకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

ఆ అనుభవంతోనే..!

చదువు పూర్తయ్యాక అమెరికాలోని.. ప్రముఖ సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా పనిచేసిన రోమిత.. 2019లో ఇండియాకు తిరిగొచ్చింది. ‘ఏ91 పార్‌్ినర్స్‌’ సంస్థలో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా చేరిన తనకు.. భారత మార్కెట్లో వివిధ సౌందర్య ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయన్న విషయం అవగతమైందని చెబుతోంది రోమిత. అయితే అదే సమయంలో లింగ వివక్ష కూడా తనను వెనక్కి నెట్టాలని చూసిందంటోంది.

‘వెంచర్‌ క్యాపిటలిస్ట్‌గా ఉన్న క్రమంలో.. నాణ్యమైన సౌందర్య ఉత్పత్తుల ధరలు మన మార్కెట్లో ఆకాశాన్నంటుతున్నాయన్న విషయం నాకు అర్థమైంది. డబ్బున్న మహిళలే వాటిని కొనగలరు. అలాంటప్పుడు సామాన్యుల పరిస్థితేంటి? అన్న ఆలోచన వచ్చింది. నాణ్యత లేకుండా తక్కువ ఖర్చుతో తయారైన ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే అటు నాణ్యతలో రాజీ లేకుండా, ఇటు తక్కువ ధరలో సామాన్యులూ కొనగలిగేలా చర్మ సౌందర్య ఉత్పత్తులు తయారుచేసే వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. నిజానికి వ్యాపారంలో నాకు పూర్వానుభవం లేదు.. ఈ విషయంలో మార్గనిర్దేశనం చేసే వారూ లేరు. ప్రారంభంలో కాస్త ఇబ్బంది పడినా నిలదొక్కుకోగలిగా..’

వాళ్ల మాటలు పట్టించుకోలేదు!

‘అయితే ఇందుకోసం నిధులు సమీకరించునే క్రమంలోనే ఈ సమాజంలో లింగ వివక్ష ఏ స్థాయిలో ఉందో నాకు అర్థమైంది. ఇంట్లో నన్ను, తమ్ముడితో పాటు అన్ని విషయాల్లో సమానంగా పెంచారు. వ్యాపారం వైపు వస్తానన్న నా ఇష్టాన్నీ ప్రోత్సహించారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తున్నప్పుడూ నా సహోద్యోగులు నన్ను ఎందులోనూ తక్కువ చేసి చూడలేదు. కానీ.. వ్యాపారం కోసం నిధులు సమకూర్చుకునే క్రమంలో.. ‘మీకు పెళ్లైందా? పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్‌ చేసుకుంటున్నారు?’, ‘మీరొక్కరేనా? లేదంటే పురుష కో-ఫౌండర్‌ ఎవరైనా ఉన్నారా?’.. ఇలా చాలామంది అడిగిన ప్రశ్నలు నన్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. అప్పటిదాకా అమ్మాయినన్న విషయమే మర్చిపోయిన నేను.. వాళ్ల మాటలు విన్నాక మరింత పట్టుదలగా ముందుకు సాగాను.. ఎలాగైనా నన్ను నేను నిరూపించుకొని ఈ వివక్షకు అడ్డుకట్ట వేయాలనుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది రోమిత.

మహిళల మనసు తెలుసుకున్నాకే..!

వ్యాపారమంటే తనకు కాసులు కురిపించడం కాదు.. మహిళల చర్మతత్వాలకు సరిపోయే నాణ్యమైన సౌందర్య ఉత్పత్తుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది రోమిత. ఈ క్రమంలో దేశంలో ఉన్న మహిళల చర్మతత్వాలపై ఓ చిన్నపాటి అధ్యయనమే చేసిందామె. వేలాది మంది మహిళలతో మాట్లాడి.. సౌందర్యం విషయంలో వారు ఎదుర్కొనే సమస్యలు-సవాళ్ల గురించి తెలుసుకుంది. మరోవైపు తాను తయారుచేసే సౌందర్యోత్పత్తి కాలాన్ని బట్టి మారే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలనుకుంది. ఈ ఆలోచనలన్నీ రంగరించి ‘ఫాక్స్‌టేల్‌’ పేరుతో చర్మ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించిందామె.

‘జిడ్డు చర్మతత్వం దగ్గర్నుంచి మొటిమలు-మచ్చలున్న చర్మం దాకా.. ఆయా చర్మతత్వాలను పరిగణనలోకి తీసుకొని విభిన్న సౌందర్యోత్పత్తుల్ని తయారుచేస్తున్నాం. విటమిన్‌ ‘సి’ సీరం, సన్‌స్క్రీన్‌, మాయిశ్చరైజర్‌, ఫేస్‌వాష్‌, మొటిమల్ని నివారించే జెల్‌తో పాటు ట్రావెల్‌ కిట్‌నీ ప్రత్యేకంగా అందిస్తున్నాం. వీటి తయారీ కోసం వాడే ముడి పదార్థాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల్లో పరీక్షించాకే ఉపయోగిస్తున్నాం. ఇక భవిష్యత్తులో ప్రతి మహిళ సౌందర్య అవసరాలు తీర్చే మరిన్ని పదార్థాల్ని, సరికొత్త ఉత్పత్తుల్ని రూపొందించాలన్న దిశగా యోచిస్తున్నాం..’ అంటోన్న రోమిత.. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగానూ ఆయా సౌందర్య సమస్యలకు నిపుణుల ద్వారా పరిష్కార మార్గాలు సూచిస్తోంది.

‘నా జెండర్‌ని గుర్తించాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు నేను ఒక మహిళా వ్యాపారవేత్తను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా..’ అంటోన్న రోమిత.. ప్రస్తుతం తన వ్యాపారంలో కోట్లు గడిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్