యోగా.. ఇవి గుర్తుపెట్టుకోండి!

ప్రస్తుతం చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు.

Published : 11 Feb 2024 13:14 IST

ప్రస్తుతం చాలామంది జీవితాల్లో యోగా ఓ భాగమైపోయింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలను పొందచ్చు. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయం. అయితే ప్రతిదానికీ ఓ లిమిట్‌ ఉన్నట్లే యోగాకు కూడా కొన్ని పరిమితులున్నాయి. ఈ క్రమంలో ఏ ఆసనం ఎప్పుడు, ఎలా చేయాలి? ఎలా చేయకూడదో కచ్చితంగా తెలిసుండాలంటున్నారు నిపుణులు. అంతేకాదు.. యోగా చేసే క్రమంలో కొన్ని విషయాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు. అవేంటంటే..!

అతి అనర్థమే!

‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నట్లు ఏదైనా అతిగా చేస్తే అనర్థాలు తప్పవు. యోగా విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మెరుగైన ఫలితాలు పొందాలని ఎక్కువసేపు యోగా చేయడం, శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఆసనాలు వేయడం వల్ల మొదటికే మోసం వస్తుందంటున్నారు నిపుణులు. అందుకే మీ శరీరానికి సౌకర్యవంతంగా ఉండే ఆసనాలనే ఎంచుకోమంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే యోగా ప్రారంభించే వారు ఇతరులను చూసి ఆసనాలు వేయడం కాకుండా.. ఓసారి యోగా నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లడం మంచిది.

అనువైన ప్రదేశం!

మరీ చల్లగా, అత్యంత వేడిగా ఉన్న ప్రాంతాలు, అధిక హ్యుమిడిటీతో నిండిన ప్రదేశాలు యోగాకు పనికి రావంటున్నారు నిపుణులు. ఇలా అనువుగాని ప్రదేశాల్లో యోగా చేస్తే లేని పోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లవుతుందంటున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాల్లో యోగా చేయడం అన్ని విధాలా అనుకూలం అని సూచిస్తున్నారు.

అప్రమత్తంగా..

యోగాలో భాగంగా వేసే కొన్ని ఆసనాల్లో కొన్ని సెకన్ల పాటు శ్వాసను బిగపట్టాల్సి రావచ్చు. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అసాధారణ ఆసనాలు వేయడం, సొంత నైపుణ్యాలు ప్రదర్శించడం కాకుండా నిపుణుల సలహాలు పాటించడం అత్యత్తమం.

ఆ సమయాల్లో..

నెలసరి సమయంలో కొన్ని రకాల ఆసనాలు వేయకూడదంటున్నారు నిపుణులు. అలాగే గర్భిణులు కచ్చితంగా నిపుణుల సలహాల మేరకే యోగ సాధన చేయాలి.

బిగుతు వస్త్రాలు వద్దు..

యోగా చేసే సమయంలో మరీ బిగుతుగా, శరీరానికి అతుక్కుపోయే లాంటి దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే వీటి వల్ల పక్కటెముకలు, ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు.

నీళ్లు మోతాదులో..

యోగా చేసే సమయంలో మరీ ఎక్కువ నీళ్లు తాగితే శరీరంపై భారం పడుతుంది. తద్వారా వ్యాయామాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి నీళ్లు మోతాదులో తాగడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్