Aditi Rao Hydari: అందం నా జీన్స్‌లో లేదు.. ఈ చిట్కాల్లో ఉంది!

వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోవడం కామన్‌. కానీ వయసుతో పాటు అందాన్నీ ద్విగుణీకృతం చేసుకుంటారు కొందరు. ఇది చూసి అందం వారి జీన్స్‌లోనే ఉందేమో అనుకుంటాం. ఇటీవలే బాలీవుడ్‌ బ్యూటీ అదితీ రావ్ హైదరీకి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. రాజకుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె.. అందాన్నీ వారసత్వంగా తెచ్చుకుందేమో అనుకున్నారంతా!

Updated : 06 Jun 2024 21:53 IST

(Photos: Instagram)

వయసు పెరిగే కొద్దీ అందం తరిగిపోవడం కామన్‌. కానీ వయసుతో పాటు అందాన్నీ ద్విగుణీకృతం చేసుకుంటారు కొందరు. ఇది చూసి అందం వారి జీన్స్‌లోనే ఉందేమో అనుకుంటాం. ఇటీవలే బాలీవుడ్‌ బ్యూటీ అదితీ రావ్ హైదరీకి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. రాజకుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె.. అందాన్నీ వారసత్వంగా తెచ్చుకుందేమో అనుకున్నారంతా! కానీ బామ్మల కాలం నాటి చిట్కాలు, ఆహార అలవాట్లే తన అపురూప లావణ్యానికి కారణమంటూ తన సౌందర్య రహస్యాల గురించి చెప్పుకొచ్చింది అదితి. మరి, ఈ ‘హీరామండి’ నటి సౌందర్యం వెనకున్న ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

గ్లూటెన్‌కు దూరంగా!

మన ఆహారపుటలవాట్లు ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ ప్రభావితం చేస్తాయి. చర్మ ఛాయ మెరుగుపడాలంటే పోషకాహారం తప్పనిసరి! నేనూ ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. ఇప్పటికీ చాలామంది పదే పదే నన్నో ప్రశ్న అడుగుతుంటారు? ‘మీ సౌందర్య రహస్యం మీ జన్యువుల్లోనే ఉందా?’ అని! కాదు.. నేను తీసుకునే ఆహారంలో ఉందని చెబుతా. ముఖ్యంగా గ్లూటెన్‌ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటా. ఎందుకంటే ఇది చర్మాన్ని పొడిగా మారుస్తుంది. శరీరంలో వాపుకి కారణమవుతుంది. దీని ప్రభావం చర్మం పైనా కనిపిస్తుంది. కాబట్టి గ్లూటెన్‌ ఉన్న పదార్థాలు, పాల పదార్థాలకు బదులుగా కాయగూరలు, ఆకుకూరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పండ్లు, బ్రౌన్‌రైస్‌, పప్పులు, డ్రైఫ్రూట్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకుంటా. అలాగే రోజుకో టీస్పూన్‌ నెయ్యి తీసుకోవడం నాకు ముందు నుంచే అలవాటు. ఇదే నా చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.

మొటిమలకు.. అమ్మ చిట్కా!

ముఖంపై మొటిమలొస్తే చాలామంది అమ్మాయిలు హైరానా పడుతుంటారు. దాన్ని తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్‌లు, లోషన్లు అప్లై చేస్తుంటారు. నేనైతే మా అమ్మ, అమ్మమ్మ చెప్పిన ఓ చిట్కా పాటిస్తుంటా. గంధపు చెక్క నుంచి అరగదీసిన చందనం పేస్ట్‌ను మొటిమలపై అప్లై చేస్తా. ఓ అరగంటయ్యాక శుభ్రం చేసుకుంటా. చందనంలోని యాంటీసెప్టిక్‌ గుణాలు మొటిమల్ని, వాటి వల్ల చర్మంపై వచ్చిన వాపును దూరం చేస్తాయి. తద్వారా సమస్య పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

తేమ కోసం.. ఈ నూనె!

నేను సాధారణంగానే నీళ్లు ఎక్కువగా తాగుతుంటా. ఈ అలవాటు శరీరాన్నే కాదు.. చర్మాన్నీ తేమగా ఉంచుతుంది. దీంతో పాటు నిర్ణీత సమయాల్లో.. నీటిలో దూదిని ముంచి దాంతో ముఖంపై అద్దడం నాకు అలవాటు! ఫలితంగా ముఖం తేమను కోల్పోకుండా ఉంటుంది. అయితే వేసవి, చలికాలంతో పాటు హ్యూమిడిటీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటప్పుడు ఆర్గన్ ఆయిల్‌కు పని చెబుతుంటా. కొన్ని చుక్కల ఈ నూనెతో ముఖంపై మర్దన చేసుకుంటా. ఇది చర్మంలో తేమ స్థాయుల్ని పెంచడంలో త్వరితగతిన పనిచేస్తుంది. అలాగే మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మర్చిపోను.

రోజుకు రెండుసార్లు.. అది!

‘ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తున్నాయి. అలాంటిది 40కి చేరువవుతున్నా మీ ముఖంలో అలాంటి ఆనవాళ్లే లేవు.. అదెలా?’ అనే ప్రశ్న తరచూ నాకు ఎదురవుతుంటుంది. దీని వెనుక ఓ సీక్రెట్‌ ఉంది. అదే.. హైఅల్యురోనిక్‌ ఆమ్లం. ఈ ఫేస్‌ సీరమ్‌ను రోజుకు కనీసం రెండుసార్లు నా ముఖానికి అప్లై చేసుకుంటా. ముఖం శుభ్రం చేసుకొని, టోనర్‌ రాసుకున్నాక ఈ సీరమ్‌ను ముఖానికి అప్లై చేసుకుంటా. ఇది ముడతలు, గీతలు.. వంటి వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడుతుంది. అలాగే చర్మంలో తేమను నిలిపి ఉంచి మెరుపునిస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. చర్మం తడిగా ఉన్నప్పుడు రాసుకుంటే మరింత బాగా ఇంకుతుంది.

తేమ వాతావరణంలో.. ఇలా!

వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పదే పదే జిడ్డుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు కలబంద లేదా నీళ్లు కలిపి తయారుచేసిన చందనం పేస్ట్‌తో ముఖానికి మర్దన చేసుకుంటా. దీనివల్ల చర్మ రంధ్రాలు తెరచుకొని అవి పూర్తిగా శుభ్రపడతాయి. తద్వారా జిడ్డుదనం తగ్గుతుంది. ఇదనే కాదు.. టొమాటో ముక్కతో ముఖానికి మర్దన చేసుకోవడం, చర్మ సౌందర్యానికి పెరుగు, ఓట్‌మీల్, బియ్యప్పిండి, శెనగపిండి.. ఇలా ఎక్కువ శాతం వంటింటి చిట్కాల్నే ఫాలో అవుతా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్