Simran Jain : శృంగారం గురించి మాట్లాడితే తప్పేంటి?!

శృంగారం.. దీని గురించి నలుగురిలో మాట్లాడడానికి చాలామంది ఆసక్తి చూపరు. ఒకవేళ మాటల మధ్యలో ఆ టాపిక్ వచ్చినా ‘ష్‌’ అంటూ ఆ విషయాన్ని అక్కడితో కట్‌ చేస్తుంటారు. అలాగని దీని గురించి మాట్లాడలేక కాదు.. బహిరంగంగా మాట్లాడితే తమ గురించి నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే చాలామంది నోరు నొక్కేస్తోంది.

Published : 28 Nov 2023 12:32 IST

(Photos: Instagram)

శృంగారం.. దీని గురించి నలుగురిలో మాట్లాడడానికి చాలామంది ఆసక్తి చూపరు. ఒకవేళ మాటల మధ్యలో ఆ టాపిక్ వచ్చినా ‘ష్‌’ అంటూ ఆ విషయాన్ని అక్కడితో కట్‌ చేస్తుంటారు. అలాగని దీని గురించి మాట్లాడలేక కాదు.. బహిరంగంగా మాట్లాడితే తమ గురించి నలుగురూ ఏమనుకుంటారోనన్న భయమే చాలామంది నోరు నొక్కేస్తోంది. నిజానికి ఈ మౌనం వల్లే చాలామంది తమ లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారని చెబుతోంది సిమ్రన్‌ జైన్‌. మనదేశంలో చాలామంది ఏ శృంగారం గురించైతే మాట్లాడుకోవడం తప్పుగా భావిస్తున్నారో.. అదే అంశం గురించి అందరిలో అవగాహన కల్పిస్తూ.. దీనిపై ఉన్న అపోహల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తోందామె. ప్రస్తుతం శృంగారం, దానికి సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుతూ.. దేశంలోనే పాపులర్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు తెచ్చుకున్న సిమ్రన్‌ జర్నీ అసలెలా ప్రారంభమైందో తెలుసుకుందాం రండి..

సిమ్రన్‌ది బెంగళూరు. చిన్నప్పట్నుంచి అందం, ఫ్యాషన్‌.. వంటి అంశాల్లో ఎక్కువగా ఆసక్తి చూపే ఆమె.. కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడేది. ఆయా అంశాల్లో తాను పాటించే చిట్కాలు, తెలిసిన విషయాలు తన స్నేహితులతో పంచుకునేది. ఇలా కాలేజీ రోజుల నుంచే కంటెంట్‌ రూపొందించడంపై మక్కువ చూపిన సిమ్రన్‌.. చదువు పూర్తయ్యాక దీన్నే తన కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

అప్పుడే మనసు మార్చుకున్నా!

డిగ్రీ ఫైనలియర్‌లో ఉన్నప్పుడు.. అందం, ఫ్యాషన్‌ వంటి అంశాల్లో తాను పాటించే, తనకు తెలిసిన చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడం మొదలుపెట్టింది సిమ్రన్‌. వీటికి మంచి స్పందన రావడంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగింది. ఇక చదువు పూర్తయ్యాక కొన్నేళ్ల పాటు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పనిచేసిన ఆమె.. కొవిడ్‌ సమయంలోనే పూర్తిస్థాయి కంటెంట్‌ క్రియేటర్‌గా మారానంటోంది.

‘కాలేజీ రోజుల నుంచే అందం, ఫ్యాషన్‌పై కంటెంట్‌, వీడియోలు రూపొందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేదాన్ని. అయితే కొవిడ్‌ సమయంలో ఈ టాపిక్స్‌పై అవగాహన పెంచే ఇన్‌ఫ్లుయెన్సర్లు మన దేశంలో బోలెడు మంది ఉన్నారని తెలుసుకున్నా. కాస్త లోతుగా పరిశోధిస్తే.. మనదేశంలో అరుదుగా మాట్లాడే, స్పందించే టాపిక్‌ ఏదైనా ఉందంటే.. అది శృంగారమే అని నాకు అర్థమైంది. సెక్స్‌, వ్యక్తిగత పరిశుభ్రతపై మన సమాజంలో ఉన్న అపోహలు.. చాలామంది దీని గురించి మాట్లాడకుండా, సంబంధిత సమస్యలు బయటికి చెప్పుకోలేకుండా చేస్తున్నాయని తెలుసుకున్నా. అందుకే అందం, ఫ్యాషన్‌ పక్కన పెట్టి శృంగారం, వ్యక్తిగత పరిశుభ్రత, నెలసరి.. వంటి మహిళలకు సంబంధించిన అంశాలపై కంటెంట్‌ రూపొందించడం మొదలుపెట్టా..’ అంటోంది సిమ్రన్‌.

కంటెంటే.. కాస్త వెరైటీగా!

నిజానికి శృంగారం, దానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడాలంటే కాస్త వెనకా ముందూ ఆలోచిస్తాం.. ఇంట్లో వాళ్లు ఏమనుకుంటారోనన్న ఆలోచనలు కూడా వస్తుంటాయి. కానీ సిమ్రన్‌కు ఈ సమస్యలేవీ ఎదురుకాలేదు. అటు కుటుంబ సభ్యులు, ఇటు స్నేహితులు ఆమె ఆలోచనను ప్రోత్సహించడంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగిన సిమ్రన్‌.. మొదట్లో కొంతమంది నెటిజన్ల నుంచి మాత్రం కొన్ని నెగెటివ్‌ కామెంట్లను ఎదుర్కొన్నానంటోంది.

‘శృంగారం, దానికి సంబంధించిన అంశాలపై మరింత లోతుగా తెలుసుకోవడానికి.. ఫ్లోరిడాలోని మోడ్రన్‌ సెక్స్‌ థెరపీ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ‘సెక్స్‌ ఎడ్యుకేషన్‌’ కోర్సు చేశా. ఎన్నో పుస్తకాలు చదివా.. కాస్త భిన్నంగా కంటెంట్‌ రూపొందించాలన్న ఉద్దేశంతో అప్పటివరకు మార్కెట్లో ఉన్న కంటెంట్‌ క్రియేటర్ల వీడియోలూ చూశా. మరోవైపు.. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచీ పలు సలహాలు తీసుకున్నా.. తెలిసిన గైనకాలజిస్టులను కలిసి మరిన్ని అంశాలపై నాకున్న సందేహాల్ని నివృత్తి చేసుకున్నా. ఇన్ని శోధనలు, పరిశోధనలు పూర్తయ్యాకే.. ఒక్కో టాపిక్‌ గురించి కంటెంట్‌ తయారుచేయడం మొదలుపెట్టా. శృంగారం, దీనిపై ఉన్న అపోహలు-వాటి వాస్తవాలు, మహిళల వ్యక్తిగత పరిశుభ్రత, బాడీ పాజిటివిటీ, నెలసరి పరిశుభ్రత, ప్లస్‌ సైజ్‌ మహిళల సమస్యలు.. తదితర అంశాలపై చిట్కాలు అందిస్తున్నా.. అలాగే ఆయా అంశాలపై పాత్రల్ని క్రియేట్‌ చేసి విశ్లేషించడం, ఆడియో/వీడియో రూపంలో కంటెంట్‌ అందించడం, దానికి అనుగుణమైన సంగీతాన్ని జోడించడం.. ఇలా అందరిలో ఆసక్తి రేపేలా, సులభంగా అర్థం చేసుకునేలా కాస్త భిన్నంగా ప్రయత్నిస్తున్నా..’ అంటోంది సిమ్రన్‌.

వ్యాపారవేత్తగానూ..!

శృంగారం, మహిళల వ్యక్తిగత పరిశుభ్రతపైనే కాదు.. పురుషులకూ దీనికి సంబంధించిన చిట్కాల్ని అందిస్తోంది సిమ్రన్‌. అంతేకాదు.. ఆయా అంశాలపై ‘Q&A’ సెషన్స్‌ నిర్వహించడం, ఆయా అంశాల గురించి మహిళలు చర్చించుకునేలా సురక్షితమైన, ప్రైవసీతో కూడిన వాతావరణం కల్పించడం, నిపుణుల సలహాలు అందించడం.. ఇలా ఈ సమాజంలో శృంగారంపై ఉన్న అపోహల్ని దూరం చేసేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తోందామె. ఇలా దేశంలోనే పాపులర్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, సెక్స్‌ ఎడ్యుకేటర్‌గా పేరు తెచ్చుకున్న సిమ్రన్‌ను.. ప్రస్తుతం ఇన్‌స్టాలో 12 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. మరోవైపు వ్యాపారంలోనూ రాణిస్తోన్న సిమ్రన్‌.. ‘అన్‌బౌండ్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. వ్యక్తిగత పరిశుభ్రత, లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ఈ వేదికగా విక్రయిస్తోన్న ఆమె.. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచడానికి, ఇద్దరూ తమ ఫ్యాంటసీల్ని, శృంగార అనుభవాల్ని నిర్మొహమాటంగా పంచుకోవడానికి.. కొన్ని రొమాంటిక్‌ గేమ్స్ కూడా రూపొందిస్తోంది.

‘శృంగారం, నెలసరి.. వంటివి మన సమాజంలో సాధారణమైన అంశాలుగా మారాలంటే.. ముందు వీటిపై ఉన్న అపోహలు తొలగిపోవాలి.. నలుగురిలో మాట్లాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అప్పుడే దీనికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.. జంటలూ దీన్ని ఆస్వాదించగలుగుతారు..’ అంటోంది సిమ్రన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్